Share News

ఉద్యాన కేంద్రంగా సీమను తీర్చిదిద్దుతాం

ABN , Publish Date - Oct 03 , 2026 | 03:38 AM

కరువుతో పోరాడిన రాయలసీమను ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు.

ఉద్యాన కేంద్రంగా సీమను తీర్చిదిద్దుతాం

  • పచ్చని చెట్లు నరికేసిన నేలలోనే నేడు ప్రగతి వనం

  • 28 వేల మంది రైతులకు లబ్ధి: డిప్యూటీ సీఎం పవన్‌

  • పచ్చని చెట్లు నరికిన నేలలోనే నేడు ప్రగతి వనం: పవన్‌ కల్యాణ్‌

  • పల్లెపండుగ కింద రెండేళ్లలో రూ.8 వేల కోట్ల అభివృద్ధి పనులు

  • మదనపల్లె సభలో డిప్యూటీ సీఎం వెల్లడి

మదనపల్లె, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): కరువుతో పోరాడిన రాయలసీమను ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. శుక్రవారం మదనపల్లెలో శుక్రవారం రాయలసీమ ఇంటిగ్రేటెడ్‌ హార్టికల్చర్‌ హబ్‌, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ (ఐఎస్ఏ) శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రాయలసీమ గొప్ప చరిత్రకు, ప్రత్యేకమైన సంస్కృతికి, ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్ష్యంగా నిలిచిన నేలగా పేర్కొన్నారు.

శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన ఈ ప్రాంతం.. అనేక ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొందని.. ఫ్యాక్షన్‌ రాజకీయం ప్రభావంతో అశాంతికి గురైన సందర్భాలూ ఉన్నాయని.. అభివృద్ధికి ప్రతీకగా నిలవాల్సిన ప్రాంతంలో పచ్చని చెట్లను సైతం నరికేశారని గుర్తుచేశారు. వాటి నుంచి రాయలసీమను బయటకు తీసుకొచ్చి అభివృద్ధి బాటలో నడిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో కృషి చేశారన్నారు. 2024లో ప్రజలిచ్చిన తీర్పే.. ఈ మార్పునకు మరింత బలాన్నిచ్చిందని.. ఈ రోజు రాయలసీమలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో అభివృద్ధి కార్యక్రమాలకు బాటలు పడ్డాయని తెలిపారు. గత రెండేళ్లలో పల్లె పండుగ ద్వారా ఈ ప్రాంతంలో రూ.8 వేల కోట్లకుపైగా అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. 62 వేల ఎకరాల్లో 28 వేలమంది రైతులకు లబ్ధి కలిగేలా ఉద్యాన పంటల సాగును విస్తరించామని చెప్పారు. నీటి సంరక్షణకు దాదాపు 70 వేల పంట కుంటలు నిర్మిం చి అదనంగా 50 వేల ఎకరాలను సాగులోకి తెచ్చామన్నారు. రూ. 4500 కోట్లతో 23 వేలకుపైగా రహదారి పనులు చేపట్టి 5 వేల కిలోమీటర్లకు పైగా రోడ్ల నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు. ఉపాధి హామీ నిధులతో ప్రాజెక్టు జలధార ద్వారా నీటి సంరక్షణ చర్యలు బలోపేతం చేస్తూ రాయలసీమను నీటి భద్రత కలిగిన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామని.. దీంతో ఈ ప్రాంతంలో భూగర్భజల మట్టం సగటున 3.6 మీటర్లు పెరిగిందని వివరించారు.


45 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఆపిల్‌ సాగు

‘రాయలసీమ రైతుల పట్టుదలకు ఉద్యాన సాగులో వస్తున్న మార్పులే నిదర్శనం. సాధారణంగా ఆపిల్‌ సాగుకు అనుకూలంగా ఉండని 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అనంతపురం ప్రాంతంలోనూ కేఎల్‌డీ ఆపిల్‌ సాగు సాధ్యమైంది. సీమలో మామిడి, అరటి, టమోటా, దానిమ్మ, నిమ్మ, స్వీట్‌ ఆరెంజ్‌తోపాటు డ్రాగన్‌ ఫ్రూట్‌, అవకాడో, ఆపిల్‌, బెర్రీస్‌ వంటి అధిక విలువ కలిగిన పంటలు కూడా సాగు చేస్తున్నారు. సీమలో ఉద్యాన పంటలకు ఉన్న అపారమైన సామర్థ్యానికి ఇది నిదర్శనం’ అని పవన్‌ పేర్కొన్నారు. ఉద్యాన హబ్‌ కింద మూడేళ్లలో చేపట్టబోయే ప్రణాళికళ గురించీ ఆయన ప్రస్తావించారు. రూ.21 వేల కోట్లతో రిజర్వాయర్లు, కాలువలు, చెరువులను అభివృద్ధి చేసి 8లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించడంతోపాటు 4.3 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరిస్తామన్నారు. 6.5 లక్షల హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్‌ను విస్తరిస్తున్నామని.. మరో రూ.15 వేల కోట్లతో 6 లక్షల హెక్టార్లలో ఉద్యానవన సాగును విస్తరించి.. 14.41 లక్షల హెక్టార్లకు పెంచే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. ‘పంట ఉత్పత్తి నుంచి నిల్వ, ప్రాసెసింగ్‌, రవాణా, మార్కెటింగ్‌, ఎగుమతుల వరకు పూర్తి వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. దీని ద్వారా 40 నుంచి 48 లక్షల టన్నుల ఉత్పత్తిని కాపాడుకునే అవకాశముంది. మూడో సంవత్సరం నుంచి రూ.80 వేల కోట్ల అదనపు గ్రాస్‌ వాల్యూ అడిషన్‌తోపాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 లక్షల ఉద్యోగావకాశాలు రానున్నాయి’ అని తెలిపారు.

జలజీవన్‌ మిషన్‌కు కేంద్ర సహకారం

గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో నిలిచిపోయిన జలజీవన్‌ మిషన్‌ను ఏపీలో కొనసాగించాల్సిన అవసరాన్ని సీఎం చంద్రబాబు, తాను కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని పవన్‌ చెప్పారు. అందుకు సానుకూలంగా స్పందించి 2028 డిసెంబరు వరకు పథకాన్ని పొడిగించి సుమారు రూ.30 వేల కోట్లతో ఈ మిషన్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సహకరించారంటూ.. ఆమెకు ఆంధ్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు.


అనంత్‌ అంబానీకి కృతజ్ఞతలు

రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించడంతోపాటు డిజిటల్‌ అగ్రికల్చర్‌, ప్రెసిషన్‌ ఫార్మింగ్‌, క్రాప్‌ మానిటరింగ్‌, స్మార్ట్‌ ఇరిగేషన్‌ ఫార్మింగ్‌, మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ వంటి ఆధునిక విధానాలను వ్యవసాయ రంగంతో అనుసంధానం చేయడంలో ఐఎస్ఏ కీలకంగా ఉంటుందని పవన్‌ చెప్పారు. ‘ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టులో పాలుపంచుకోవడానికి, ఐఎస్ఏ ఏర్పాటుకు మద్దతిచ్చినందుకు అనంత్‌ అంబానీకి ఆంధ్ర ప్రజల తరపున కృతజ్ఞతలు’ అని అన్నారు.

ఈ వార్తలనూ చదవండి..

స్వచ్ఛతే ఆరోగ్యానికి తొలిమెట్టు

శ్రీవారి ఆలయానికి ‘స్వచ్ఛ’ అవార్డు

Updated Date - Oct 03 , 2026 | 03:38 AM