Share News

తాగునీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - Sep 27 , 2026 | 04:51 AM

గ్రామీణ ప్రాంతాలకు సురక్షితమైన, నాణ్యమైన తాగునీటిని నిరంతరాయంగా అందించే సమగ్ర రక్షిత తాగునీటి పథకాల(సీపీడబ్ల్యూఎస్‌) నిర్వహణ, పర్యవేక్షణను పటిష్టపరచాలని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అధికారులను ఆదేశించారు.

తాగునీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి

  • ఫిల్టర్‌ చాంబర్లు, బెడ్స్‌లోకి కీటకాలు చేరకుండా జాగ్రత్తలు

  • రక్షిత తాగు నీటి పథకాల నిర్వహణలో లోపాలు సహించం

  • క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలి: పవన్‌

  • గ్రామీణ నీటి సరఫరా విభాగం ఉన్నతాధికారులతో సమీక్ష

అమరావతి, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాలకు సురక్షితమైన, నాణ్యమైన తాగునీటిని నిరంతరాయంగా అందించే సమగ్ర రక్షిత తాగునీటి పథకాల(సీపీడబ్ల్యూఎస్‌) నిర్వహణ, పర్యవేక్షణను పటిష్టపరచాలని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా సీపీడబ్ల్యూఎస్‌ నిర్వహణపై శనివారం గ్రామీణ నీటి సరఫరా విభాగం ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. సీపీడబ్ల్యూఎ్‌సపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజారోగ్యానికి సంబంధించిన అంశాల్లో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 512 సీపీడబ్ల్యూఎస్‌ పథకాల ద్వారా 11,221 నివాస ప్రాంతాలకు తాగునీటి సరఫరా జరుగుతోందని, సుమారు 1.65 కోట్ల మంది ప్రజలు ఈ పథకాలపై ఆధారపడుతున్నారన్నారు. అన్ని పథకాలపై గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య అధికారులు, జెడ్పీ సీఈవోలు సంయుక్తంగా క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని, నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. వేసవి నిల్వ ట్యాంకులను పూర్తి సామర్థ్యంతో నిర్వహించడంతో పాటు వాటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, జంతువులు, కాలుష్య కారకాలు ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. లీకేజీలు, విద్యుత్‌ సంబంధిత లోపాలు, మౌలిక సదుపాయాలు దెబ్బతినడం తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. తాగునీటి నాణ్యత పరిరక్షణలో ఫిల్టర్‌ బెడ్లు కీలకమన్నారు. ఫిల్టర్‌ హౌస్‌లను అత్యంత పరిశుభ్రంగా నిర్వహించాలని ఆదేశించారు.


కప్పలు, బల్లులు, ఎలుకలు, పాములు, కీటకాలు తదితరాలు ఫిల్టర్‌బెడ్లలోకి ప్రవేశించకుండా అన్ని ఓపెనింగ్‌లకు రక్షణ వలలు ఏర్పాటు చేయాలన్నారు. వెంటిలేటర్లు, ఓవర్‌ఫ్లో పైపులు, డ్రెయిన్‌ అవుట్‌లెట్లకు తుప్పుపట్టని మెష్‌ స్ర్కీన్లు అమర్చాలన్నారు. ఫిల్టర్‌ హౌస్‌ పరిసరాలను నీరు నిల్వ లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని నిర్దేశించారు. పైకప్పులు, గోడలు, ప్లాట్‌పామ్‌లు, మెట్లు, గ్రేటింగ్‌లు, నిచ్చెనలు తదితరాలను క్రమం తప్పకుండా తనిఖీ చేసి అవసరమైన మరమ్మత్తులు చేపట్టాలన్నారు.

నీటి వనరులు, వాటి పరిసర ప్రాంతాలును పరిశుభ్రంగా, కాలుష్యరహితంగా ఉంచాలని, వేసవి నిల్వ ట్యాంకులను తగిన సామర్థ్యంతో నింపి నిర్వహించడంతో పాటు ట్యాంకుల కట్టలను బలోపేతం చేసి, జంతువులు, పశువులు, ఇతర కాలుష్య కారకాలు ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పంచాయతీ అభివృద్ధి అధికారులు నీటి నాణ్యత పరీక్షలను క్రమం తప్పకుండా పర్యవేక్షించి, పరీక్షల ఫలితాలను వాటర్‌ క్వాలిటీ యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. నిర్దేశిత ప్రమాణాలు పాటించిన తర్వాత మాత్రమే చెల్లింపులను సిఫారసు చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామీణ కుటుంబానికి నమ్మకమైన తాగునీటి సేవలు అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

Updated Date - Sep 27 , 2026 | 04:51 AM