రాష్ట్రాన్ని ఆదుకోండి.. అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ
ABN , Publish Date - Nov 06 , 2026 | 08:43 PM
ఆర్నబ్, మురసు వరుస తుఫాన్ల దెబ్బకు రాష్ట్రం విలవిలలాడిందని సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఒకే సీజన్లో రైతులు, మత్స్యకారులు రెండుసార్లు నష్టపోయారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
అమరావతి, నవంబరు 6: వారం వ్యవధిలోనే ఆర్నబ్, మురసు తుఫాన్ల కారణంగా రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లిన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. తుఫాను నష్టం నుంచి కోలుకునేందుకు తక్షణ సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. 'మురసు' తుఫానుతో ప్రాథమికంగా రూ.1,919.59 కోట్ల నష్టం కలిగిందని సీఏం లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రానికి తక్షణమే మధ్యంతర ఆర్థిక సాయం మంజూరు చేయాలని కోరారు.
ఆర్నబ్, మురసు వరుస తుఫాన్ల దెబ్బకు రాష్ట్రం విలవిలలాడిందని సీఎం చంద్రబాబు లేఖలో రాశారు. ఒకే సీజన్లో రైతులు, మత్స్యకారులు రెండుసార్లు నష్టపోయారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షాలు, ఈదురుగాలులతో విద్యుత్ వ్యవస్థ, రహదారులు ధ్వంసమయ్యాయని వాపోయారు. మురసు దెబ్బకు ఒక్క వ్యవసాయ రంగానికి రూ.874.96 కోట్ల మేర నష్టం వచ్చిందని తెలిపారు. 1,43,122 హెక్టార్ల వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయని, 1.86 లక్షల మంది రైతులపై ప్రభావం పడిందని చెప్పారు. ఉద్యానవన రంగానికి రూ.337.10 కోట్ల భారీ నష్టం వాటిల్లిందని చంద్రబాబు అమిత్ షాకు రాసిన లేఖలో వెల్లడించారు. 6,504 హెక్టార్ల ఉద్యాన పంటలు దెబ్బతినడంతో 12,178 మంది రైతులు నష్టపోయారని వివరించారు.
‘విద్యుత్, ఇరిగేషన్, పశుసంవర్థక, గృహ నిర్మాణ శాఖలకూ తీవ్ర నష్టం ఏర్పడింది. ముందస్తు చర్యలు తీసుకోవడంతో ఆస్తినష్టం కొంత మేర తగ్గింది. వరద నీరు తగ్గాక పూర్తిస్థాయి అంచనాతో మరో 15 రోజుల్లో కేంద్రానికి సమగ్ర నివేదిక సమర్పిస్తాం. దెబ్బతిన్న అత్యవసర మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు సాయం చేయాలి. రైతులు, మత్స్యకారులు, ఇళ్లు కోల్పోయిన బాధితులను తక్షణమే ఆదుకోవాలి. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా కేంద్రం వెంటనే స్పందించాలి. కేంద్రం నుంచి తక్షణ సహాయం అందితేనే బాధితులకు ఉపశమనం లభిస్తుంది’అని చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలూ చదవండి
తుఫాన్ బాధితులకు అండగా ఉంటాం.. అధైర్యపడొద్దు: సీఎం చంద్రబాబు
భీమవరానికి వరద ముప్పు.. ఉధృతంగా ప్రవహిస్తోన్న