కావాలనే నాపై కట్టుకథలు
ABN , Publish Date - Sep 23 , 2026 | 05:16 AM
బిడ్డ పెళ్లిని అడ్డుపెట్టుకొని తెర వెనుక రాజకీయం చేయాల్సిన ఖర్మ వైఎస్ బిడ్డగా తనకు పట్టలేదని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. శుభకార్యానికి, రాజకీయానికి లింకు పెట్టి తన విశ్వసనీయతను, ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని దెబ్బ తీయాలని చూస్తే ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించారు.
బిడ్డ పెళ్లిని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాల్సిన ఖర్మ నాకు పట్టలేదు
జగన్‌ను కలవడంపై వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారానికి షర్మిల కౌంటర్
అమరావతి, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): బిడ్డ పెళ్లిని అడ్డుపెట్టుకొని తెర వెనుక రాజకీయం చేయాల్సిన ఖర్మ వైఎస్ బిడ్డగా తనకు పట్టలేదని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. శుభకార్యానికి, రాజకీయానికి లింకు పెట్టి తన విశ్వసనీయతను, ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని దెబ్బ తీయాలని చూస్తే ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించారు. బెంగళూరులోని వైసీపీ అధ్యక్షుడు జగన్ నివాసానికి పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఇటీవల వెళ్లారు. తన కుమార్తె అంజలి రెడ్డి నిశ్చితార్థానికి, వివాహానికి రావాలని ఆహ్వానిస్తూ, పెళ్లి పత్రిక అందించారు. జరిగింది ఇంతే. కానీ, జగన్‌ను షర్మిల ఎందుకు కలిశారనే విషయం పక్కకు పోయింది. వైసీపీలోకి షర్మిల వచ్చేస్తున్నారంటూ ‘నీలి మీడియా’ ప్రచారం మొదలుపెట్టింది. మేనకోడలి వివాహ నిశ్చితార్థానికి తనను పిలవడానికి షర్మిల వచ్చిన విషయం జగన్ సైతం ‘ఎక్స్’లో పంచుకోలేదు. దీంతో కుమార్తె పెళ్లి ఏర్పాట్లలో ఉన్న షర్మిల పనిగట్టుకుని మంగళవారం ‘ఎక్స్’ వేదికగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ‘‘నేను ఎవరినో కలిసినట్టు...ఎక్కడో చేరిపోతున్నట్లు...నామీద సోషల్ మీడియాలో అల్లుతున్నవి కట్టుకథలు. దానిపై చేస్తున్న విశ్లేషణలు, జరుగుతున్న ప్రచారం పూర్తి నిరాధారం. గిట్టని వాళ్ళ పస లేని ఆరోపణలు అవి. వాటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. జగన్‌ను నా కుమారుడి వివాహానికి ఆహ్వానించిన సమయంలో ఒకసారి కలిశాను. ఇప్పుడు నా కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను ఆయనను కలిసి అందించాను. నా బిడ్డ పెళ్లికి రావాలని, దీవించాలని అన్ని రాజకీయ పార్టీల అధినేతలను ఆహ్వానిస్తాను. ఇందులో కొత్తేం లేదు. వింత అంతకన్నా లేదు.’’ అని షర్మిల వివరించారు.
ఈ వార్తలనూ చదవండి...
పాదగయలో విషాదం.. పుష్కరిణిలో స్నానానికి దిగి యువకుడి గల్లంతు..
సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం