Share News

ప్రధానితో నేడు చంద్రబాబు భేటీ

ABN , Publish Date - Oct 08 , 2026 | 04:13 AM

ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం సమావేశం కానున్నారు. సాయంత్రం లోక్‌కల్యాణ్‌ మార్గ్‌లోని ప్రధాని నివాసంలో ఈ భేటీ జరుగనుంది. విశాఖ మెట్రో రైల్‌ ప్రాజెక్టుతో పాటు బీచ్‌ కారిడార్‌ ప్రాజెక్టులను మంజూరు చేయాలని సీఎం కోరనున్నారు.

ప్రధానితో నేడు చంద్రబాబు భేటీ

  • విశాఖ మెట్రో రైల్‌, బీచ్‌ కారిడార్‌ప్రాజెక్టులకు నిధులు కోరనున్న సీఎం

  • కరువు ఉపశమనానికి ప్రత్యేక సాయం కూడా..

  • అమిత్‌ షా, గడ్కరీ, పాటిల్‌, గోయల్‌, సోనోవాల్‌తోనూ వరుస సమావేశాలు

  • రాత్రికి అమరావతి పయనం

న్యూఢిల్లీ, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం సమావేశం కానున్నారు. సాయంత్రం లోక్‌కల్యాణ్‌ మార్గ్‌లోని ప్రధాని నివాసంలో ఈ భేటీ జరుగనుంది. విశాఖ మెట్రో రైల్‌ ప్రాజెక్టుతో పాటు బీచ్‌ కారిడార్‌ ప్రాజెక్టులను మంజూరు చేయాలని సీఎం కోరనున్నారు. ప్రత్యేకించి నదుల అనుసంధానం ప్రాజెక్టు చేపట్టేందుకు అవసరమైన అధ్యయనం చేయించాలని కూడా కోరతారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల నుంచి ఉపశమనం కలిగించేలా ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని అభ్యర్థిస్తారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం కేంద్ర సహకారం అందించాలని విజ్ఞప్తి చేస్తారు. ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసేందుకు ముఖ్యమంత్రి బుధవారం సాయంత్రం అమరావతి నుంచి దేశ రాజధానికి చేరుకున్నారు.

టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, ఉపనేత దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎంపీలు అంబికా లక్ష్మీనారాయణ, బైరెడ్డి శబరి, జీఎం హరీశ్‌ బాలయోగి, తెన్నేటి కృష్ణప్రసాద్‌, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బీద మస్తాన్‌రావు, సానా సతీశ్‌, భాష్యం రామకృష్ణ ఆయనకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. గురువారం ఉదయం నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, రోడ్డురవాణా, హైవేల మంత్రి నితిన్‌ గడ్కరీ, కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌, వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌, నౌకాయాన మంత్రి సర్బానంద్‌ సొనోవాల్‌తో సీఎం వరుస భేటీలు నిర్వహించనున్నారు. కరువు పరిస్థితుల నుంచి ఉపశమనం కలిగించేలా ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని అమిత్‌ షాను కోరతారు. గోదావరి నది నుంచి సముద్రంపాలవుతున్న వరద నీటిని సద్వినియోగం చేసుకునే అంశంతో పాటు నదుల అనుసంధానంపై జలశక్తి మంత్రితో చర్చిస్తారు. అనంతరం భారత పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యంలో విశాఖలో నిర్వహించే భాగస్వామ్య సదస్సు కర్టెన్‌ రైజర్‌ కార్యక్రమంలో పీయూష్‌ గోయల్‌తో కలిసి పాల్గొంటారు. ఢిల్లీ ఏపీభవన్‌ నిర్మాణంపై సీఎం సమీక్షించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. నూతన భవన నిర్మాణంపై ఆయనకు అధికారులు ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నట్లు తెలిసింది. అనంతరం రాత్రికి ఆయన ఢిల్లీ నుంచి అమరావతికి పయనమవుతారు.


హార్టికల్చర్‌ హబ్‌ కార్యాచరణపై నిర్మలా సీతారామన్‌తో చర్చలు

చంద్రబాబు బుధవారం సాయంత్రం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కర్తవ్య భవన్‌లో సమావేశమయ్యారు. గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌ (జీహెచ్‌హెచ్‌) ప్రాజెక్టును ముందు కు తీసుకెళ్లే దిశగా జిల్లాల వారీగా చేపట్టాల్సిన కార్యాచరణపై ఆమెతో చర్చించారు. జీహెచ్‌హెచ్‌ ప్రారంభోత్సవానికి వచ్చి ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్థ తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. విదేశీ రుణ సాయం (ఈఏపీ) ప్రాజెక్టుల్లో కేంద్ర, రాష్ట్ర వాటాలకు సంబంధించిన అంశంపైనా వారు చర్చించారు. ఆయన వెంట రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌, టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు.

ఈ వార్తలనూ చదవండి..

రైతన్నకు ఊరటేదీ?

ప్రజల చెంతకు వైద్య సేవలు

Updated Date - Oct 08 , 2026 | 04:13 AM