బీ అలెర్ట్
ABN , Publish Date - Nov 03 , 2026 | 05:41 AM
కోస్తాంధ్ర తీరంపై ’మురసు’ ప్రభావం అర్నబ్ తుఫాన్‌తో పోల్చితే తక్కువగానే ఉండే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. అయినా, అప్రమత్తంగా ఉండాల్సిందేనని అధికార యంత్రాంగానికి స్పష్టం చేశారు.
దక్షిణ కోస్తా, రాయలసీమపై ప్రభావం
ప్రతి గంటకూ రియల్‌టైమ్‌లో హెచ్చరికలు
ప్రతి రెండు గంటలకూ బులెటిన్లు విడుదల
ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకూడదు
వరద నీటితో చెరువులు, ప్రాజెక్టులు నింపాలి
బుడమేరుకు అధిక వరద పోటెత్తే ప్రమాదం
స్తంభాలు కూలితే 48 గంటల్లో పునరుద్ధరణ
కలెక్టర్లు, అధికారులకు సీఎం దిశా నిర్దేశం
45 వేల మంది సిబ్బందితో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
అమరావతి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): కోస్తాంధ్ర తీరంపై ’మురసు’ ప్రభావం అర్నబ్ తుఫాన్‌తో పోల్చితే తక్కువగానే ఉండే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. అయినా, అప్రమత్తంగా ఉండాల్సిందేనని అధికార యంత్రాంగానికి స్పష్టం చేశారు. సోమవారం ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష చేశారు. అనంతరం వివిధశాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్లు సహా, 45వేల మంది క్షేత్రస్థాయి సిబ్బందితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. దక్షిణ కోస్తాంధ్ర, సీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రభుత్వ యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ‘‘తుఫాన్ ప్రభావంపై ప్రతి గంటకూ రియల్ టైమ్‌లో అధికారులు హెచ్చరికలు జారీ చేయాలి. 848 స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల పరిధిలో తుఫాన్ ప్రభావం ఉంటుంది. బుడమేరుకు 30వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉంది. బుడమేరు వద్ద ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకుని, జాగ్రత్తలు తీసుకోవాలి.’’ అని ఆదేశించారు.
తుఫాన్ ప్రభావంతో వచ్చే వర్షాలతో చెరువులు, రిజర్వాయర్లను నింపాలని సూ చించారు. ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే చాలా వరకు సాధారణ పరిస్థితులు నెలకున్నాయని చెప్పారు. గాలుల ప్రభావం దక్షిణ కోస్తా, సీమ జిల్లాల్లోని సుమారు 8వేల విద్యుత్ స్తంభాలపై చూపే అవకాశం ఉందని అంచనా వేశారు. పునరుద్ధరణ పనులను 48గంటల్లో పూర్తి చేయాలని అధికారులకు సీఎం నిర్దేశించారు. పల్నాడు జిల్లాలో 30, ప్రకాశంలో 24, మార్కాపురంలో 19, కృష్ణా, గుంటూరు, ఏలూరు, నెల్లూరు జిల్లాల్లో 9 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదయ్యే అవకాశముందని అంచనా వేశారు. నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల పరిధిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, 30-50 టీఎంసీల నీటి ప్రవాహం రావచ్చని అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో నీటి నిర్వహణపై దృష్టి పెట్టాలని జలవనరుల శాఖను సీఎం ఆదేశించారు.
ఆరు జిల్లాల్లోని 6,800 చెరువుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం ఆదేశించారు. సాగునీటి సంఘాలను క్రియాశీలం చేసి, ప్రజల భాగస్వామ్యంతో చెరువులను నింపాలని, ఎక్కడా గండ్లు పడకుండా చూడాలని నిర్దేశించారు. గాలులు, వర్షాలు, వరద ప్రవాహాలను నిరంతరం గమనిస్తుండాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. సమాచార వ్యవస్థకు అంతరాయం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రతి రెండు గంటలకు ఓసారి పరిస్థితిని సమీక్షించి, బులెటిన్లు విడుదల చేయాలన్నారు. ఎన్టీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను అవసరాన్ని బట్టి మోహరించాలని సీఎం సూచించారు.
ఈ వార్తలనూ చదవండి:
త్వరితగతిన రాష్ట్రానికి సాయం అందించండి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
ఏపీ లిక్కర్ స్కామ్.. ఈడీ కస్టడీలో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి