జగనన్న కాలనీల్లో ఇళ్లు కట్టుకుంటారా.. లేదా?
ABN , Publish Date - Oct 08 , 2026 | 04:10 AM
వైసీపీ ప్రభుత్వం కేటాయించిన జగనన్న కాలనీలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇందులో గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, జనసేనకు చెందిన మరో మంత్రి సభ్యులుగా ఉండాలన్నారు.
లబ్ధిదారులందరికీ నోటీసులివ్వండి: సీఎం
మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుకు ఆదేశం
ఇళ్లు కట్టుకుంటామంటే సహకరిద్దాం
వేరేచోట స్థలం కావాలన్నా ఏర్పాటు చేద్దాం
45 రోజుల్లో కార్యాచరణ సిద్ధం చేయాలి
స్థలాల సద్వినియోగమే అంతిమ లక్ష్యం
ఎల్‌నినో సమీక్షలపై ఇంత నిర్లక్ష్యమా?
క్యాబినెట్‌లో నేను చెప్పినవి
కలెక్టర్లకు చేరవేయాల్సింది మంత్రులే
వారితో చర్చించి ఫలితాలు రాబట్టాలి
మంత్రివర్గ భేటీలో చంద్రబాబు స్పష్టీకరణ
అమరావతి, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వం కేటాయించిన జగనన్న కాలనీలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇందులో గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, జనసేనకు చెందిన మరో మంత్రి సభ్యులుగా ఉండాలన్నారు. లబ్ధిదారులందరికీ నోటీసులిచ్చి వారు ఇళ్లు కట్టుకునేందుకు సుముఖంగా ఉన్నారో లేదో తెలుసుకోవాలని చెప్పారు. ఇళ్లు కట్టుకునే పక్షంలో వారికి అవసరమైన మార్గనిర్దేశం చేయాలని, అక్కడ కట్టుకునేందుకు విముఖత చూపేవారికి వేరేచోట ఇళ్ల స్థలాలు కేటాయించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. బుధవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో అజెండా అంశాలను ఆమోదించిన తర్వాత పలు అంశాలపై మంత్రివర్గ సహచరులతో సీఎం చర్చించారు. ఈ సందర్భంగా జగనన్న కాలనీల అంశం చర్చకు వచ్చింది. చాలాచోట్ల ఆ కాలనీలు ఖాళీగా ఉన్నాయని..
స్థలాలు పొందినవారు అక్కడ ఇళ్లు కట్టుకునేందుకు సుముఖంగా లేరని పలువురు మంత్రులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. సరైన రవాణా వసతి, విద్యుత్, తాగునీటి సౌకర్యం లేకపోవడం, కొన్నిచోట్ల ఇళ్లు కట్టుకునేందుకు స్థలాలు అనువుగా లేకపోవడం వంటి కారణాలతో లబ్ధిదారులు విముఖంగా ఉన్నారని తెలిపారు. స్పందించిన సీఎం.. ఇళ్ల స్థలాల సద్వినియోగమే అంతిమ లక్ష్యంగా మంత్రివర్గ ఉపసంఘం 45రోజుల్లో తగిన కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆ కాలనీల్లో ఖాళీ అయిన స్థలాలను కొత్త లబ్ధిదారులకు కేటాయించేందుకు విధివిధానాలు సిద్ధం చేయడం కూడా దాని బాధ్యతేనని స్పష్టంచేశారు. ఆవాస్ సర్వేలో 2 లక్షల మందికి ఇళ్ల స్థలాలు కావాలని గుర్తించిన నేపథ్యంలో భూ సేకరణ ఎలా చేయాలో కూడా అది పరిశీలించాలన్నారు.
సమీక్షలు చేయకుంటే ప్రయోజనం ఏమిటి?
ఎల్‌నినో ప్రభావంపై జిల్లాస్థాయిలో సమీక్షలు నిర్వహించాలని కోరానని, ఎంతమంది సమీక్షలు చేశారని సీఎం అడిగారు. ఆరేడుగురు మంత్రులు మాత్రమే సమీక్షలు నిర్వహించామని చెప్పడంతో ఆయన సీరియస్ అయ్యారు. క్యాబినెట్‌లో చెప్పిన విషయాలను కలెక్టర్లకు చేరవేసి.. క్షేత్రస్థాయికి తీసుకెళ్లి ఫలితాలు రాబట్టాల్సిన మీరే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలాగని ప్రశ్నించారు. క్యాబినెట్ భేటీలో తాను ప్రస్తావించే అంశాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లే బాధ్యత మంత్రులే తీసుకోవాలని, కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి మెరుగైన ఫలితాలు రాబట్టాలని సూచించారు. లేకుంటే ప్రయోజనం ఉండదన్నారు.
ఉద్యోగుల పనితీరు మెరుగుపై దృష్టి..
‘కర్మయోగి’ కార్యక్రమంలో భాగంగా మంత్రులు, శాఖాధిపతులు ముందుగా తమ పనితీరు మెరుగుపరచుకోవాలని, అనంతరం తమ శాఖల పరిధిలోని సిబ్బంది నుంచి మెరుగైన పనితీరును సాధించడంపై దృష్టి సారించాలని సీఎం అన్నారు. మంత్రులు, అధికారులు సంబంధిత అంశాలపై అధ్యయనం చేయగలిగితేనే కింది స్థాయి ఉద్యోగుల నుంచి మెరుగైన ఫలితాలు రాబట్టగలుగుతారని చెప్పారు.
కాలేజ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లు భేష్
గిరిజన, సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాలేజ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ల పనితీరు బాగుందని సీఎం ప్రశంసించారు. ఆ శాఖ అధికారులు దీనికి సంబంధించి ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 4 ఎక్స్‌లెన్స్ కాలేజీలు ఉన్నాయని.. వీటిలో ఆకాశ్, ఫిజిక్స్‌వాలా వంటి సంస్థల ప్రతినిధులతో ఐఐటీ, జేఈఈ, నీట్ పరీక్షలకు విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తున్నామని, అవి మంచి ఫలితాలను ఇస్తున్నాయని వారు వివరించారు. ఈ కాన్సె్‌ప్టను మరింత విస్తృతపరచాలని సీఎం అన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా త్వరలో రాష్ట్రవ్యాప్తంగా 500 సమీకృత గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని, ఈ ఏడాది 25 వరకు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు తెలిపారు.
దేశంలో నిర్దేశిత సమయంలో వ్యవసాయ ఉత్పత్తులు 2 శాతమే పెరిగితే.. యూరియా వాడకం 200 శాతం పెరిగిందని సీఎం అన్నారు. మనం తినే ఆహారాన్ని మనమే కలుషితం చేసుకోవడం వల్ల క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య పెరుగుతోందని, కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయని చెప్పారు. వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు రావాలని.. ఆర్గానిక్ విప్లవం వస్తే రోగాలు కూడా తగ్గుతాయన్నారు.
గతంలో తాను సీఎంగా ఉన్నప్పుడు నీటివినియోగదారుల సంఘాలు, సహకార సమాఖ్యలు, స్వయం ఉపాధి గ్రూపులను ఏర్పాటు చేశామని.. వాటిలో స్వయం ఉపాధి గ్రూపులు మంచి పనితీరు కనబరుస్తున్నాయని సీఎం అన్నారు. వాటి వద్ద ప్రస్తుతం రూ.35వేల కోట్లు కార్పస్ నిధులు ఉన్నాయని చెప్పారు.
విశ్వవిద్యాలయాల్లో సంప్రదాయ డిగ్రీల స్థానం లో ఉపాధి కల్పించే విద్యకు ప్రాధాన్యమివ్వాలని, ఈ దిశగా విద్యావ్యవస్థలో సమూల మార్పులు రావాలని చంద్రబాబు అన్నారు.
ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించేందుకు సీడ్‌బాల్స్‌ను అస్త్రంగా వాడుకోవాలని సీఎం సూచించారు. వాటి వాడకం వల్ల ఉష్ణోగ్రతలు కనీసం 2 శాతం తగ్గుతాయన్నారు.
క్యాబినెట్ సమావేశానికి నలుగురు మంత్రులు రాలేదు. విశాఖలో సీఐఐ సదస్సు ఏర్పాట్ల పర్యవేక్షణకు మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్‌రెడ్డి వెళ్లగా, బీజేపీ సమావేశం ఉండడంతో మంత్రి సత్యకుమార్ హాజరుకాలేదు. మంత్రి కందుల దుర్గేశ్ స్పెయిన్ పర్యటనలో ఉన్నారు. ఈ విషయాన్ని సీఎం క్యాబినెట్‌లో ప్రస్తావించారు. మంత్రులు ఏ కారణాలతో రాలేదో తనకు తెలుసని, కానీ సమావేశం మొదలైన వెంటనే ఎవరెవరు రాలేదో మీడియా ప్రసారం చేస్తోందని, దానికి సరైన సమాచారం అందించకపోతే ఫలితాలు వేరేగా ఉంటాయనడానికి మంత్రుల గైర్హాజరు అంశమే ఉదాహరణగా సీఎం పేర్కొన్నారు..
ఈ వార్తలనూ చదవండి..