స్వార్థం కోసం.. రాష్ట్ర ప్రయోజనాలూ తాకట్టు!
ABN , Publish Date - Oct 27 , 2026 | 03:55 AM
‘గొడ్డలి పార్టీ అధ్యక్షుడు తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలనూ తాకట్టు పెడతాడు. కుటుంబ బంధాలనూ పట్టించుకోడు’ అని సీఎం చంద్రబాబు అన్నారు. 2019లో 151 సీట్లతో గెలుపొంది అరాచకాలు చేసిన ఆ పార్టీపై ప్రజలు 2024లో తిరుగుబాటు చేశారని..
కుటుంబ బంధాలనూ పట్టించుకోడు
జగన్‌పై చంద్రబాబు ఫైర్
అన్ని స్థానాల్లో మిత్రధర్మం పాటించాల్సిందే
చాన్స్ రానివారికి నామినేటెడ్ పదవులిస్తాం
ముఖ్య నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
అమరావతి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ‘గొడ్డలి పార్టీ అధ్యక్షుడు తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలనూ తాకట్టు పెడతాడు. కుటుంబ బంధాలనూ పట్టించుకోడు’ అని సీఎం చంద్రబాబు అన్నారు. 2019లో 151 సీట్లతో గెలుపొంది అరాచకాలు చేసిన ఆ పార్టీపై ప్రజలు 2024లో తిరుగుబాటు చేశారని.. కేవలం 11 సీట్లే ఇచ్చారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరించడంతోపాటు గొడ్డలి పార్టీ చేసే అరాచకాలపైనా ప్రజలను అప్రమత్తం చేయాలని టీడీపీ శ్రేణులకు పిలుపిచ్చారు. ఆ పార్టీ వల్ల రాష్ట్రానికి జరిగే నష్టాన్ని వివరించాలన్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో సోమవారం టీడీపీ ముఖ్యనేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘చెప్పాం చేస్తున్నాం’ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలని ఈ సందర్భంగా వారిని ఆదేశించారు. ‘మూడు స్థాయుల్లోనూ ఒకే ప్రభుత్వం ఉంటే కలిగే లాభాలను వారికి వివరించాలి’ అని దిశానిర్దేశం చేశారు.
స్థానిక ఎన్నికల్లో బీసీలకు న్యాయం చేశామని, తక్కువ జనాభా ఉన్న కులాలకు కూడా ప్రాధాన్యమిచ్చామని సీఎం అన్నారు. ‘చక్కటి సమన్వయంతో క్షేత్రస్థాయిలో పనిచేయాలి. అన్ని స్థానాల్లో మిత్రధర్మాన్ని పాటించి తీరాలి. ఇందులో ఎలాంటి వెసులుబాటూ లేదు’ అని తేల్చిచెప్పారు. పొత్తులు, రిజర్వేషన్ల కారణంగా.. సోషల్ రీ-ఇంజనీరింగ్‌లో భాగంగా కొంతమందికి అవకాశాలు దక్కలేదని, అలాంటి వారికి గుర్తింపునిస్తామని, నామినేటెడ్ పదవులతో గౌరవిస్తామని స్పష్టం చేశారు. ‘వార్డూ.. డివిజన్ మొదలుకొని ప్రతి స్థానంలోనూ కూటమి పార్టీల జెండాలు ఎగరాల్సిందే.. పాజిటివ్ ఓట్లు పడాలి. కూటమికి పాజిటివ్ ఓటు బ్యాంకు మరింత పటిష్ఠం కావాలి. ప్రతి ఓటరూ పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటేసేలా చూడాలి. ప్రతి బూత్లోనూ 2024 ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లు పడాలి’ అని టీడీపీ నేతలను ఆదేశించారు.
ధిక్కరిస్తే సస్పెన్షన్ వేటే!
నేతలతో స్వయంగా మాట్లాడుతున్న చంద్రబాబు, లోకేశ్
కూటమి అధికారిక అభ్యర్థులకు వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తే సహించేది లేదని టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తే సస్పెండ్ చేసేందుకూ వెనుకాడబోమని టీడీపీ నేతలను హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో క్షేత్ర స్థాయిలో అభ్యర్థులు, పార్టీ నేతల పనితీరుపై వారు స్వయంగా దృష్టి సారించారు. స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని, ఎక్కడా విభేదాలకు తావు ఇవ్వకూడదని తేల్చిచెప్పారు. విభేదాలు పరిష్కరించుకుని.. కలిసి పనిచేయాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. కూటమికి అనుకూలంగా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టేలా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరిస్తామని సీఎం కటువుగానే చెబుతున్నారు. కూటమి పార్టీలతో సమన్వం చేసుకోవాలని తేల్చిచెబుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా బలపడిన ‘అర్నబ్’
అతి తీవ్ర తుఫాను..ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్