చదువుల తల్లిగా కనకదుర్గమ్మ
ABN , Publish Date - Oct 17 , 2026 | 04:03 AM
ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ శుక్రవారం సరస్వతిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అర్ధరాత్రి నుంచే పోటెత్తారు.
సరస్వతి అలంకారంలో అమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు
విజయవాడ, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ శుక్రవారం సరస్వతిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అర్ధరాత్రి నుంచే పోటెత్తారు. ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. వారికి కలెక్టర్ లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు, ధర్మకర్తల మండలి చైర్మన్ రాధాకృష్ణ, ఆలయ ఈవో శీనా నాయక్, ఎంపీ కేశినేని చిన్ని స్వాగతం పలికారు. వేదపండితులు పూర్ణకుంభంతో చంద్రబాబు దంపతులను ప్రధానాలయంలోకి తీసుకెళ్లారు. అంతరాలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఆశీర్వచన మండపంలో వేదాశీర్వాదం అందజేశారు. చంద్రబాబుకు ఈవో శేషవస్త్రాన్ని, భునేశ్వరికి అమ్మవారి చీరను అందజేశారు. ఆలయ అధికారులు వారికి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం చంద్రబాబు దంపతులు క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి, అపరాజిత అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు.
వర్షాలు కురవాలని ప్రార్థించా: చంద్రబాబు
వర్షాలు పుష్కలంగా కురిసి, రాష్ట్రం అభివృద్ధి చెందేలా చూడాలని కనకదుర్గమ్మను వేడుకున్నట్టు సీఎం చంద్రబాబు చెప్పారు. మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నానని తెలిపారు. ఆరు రోజుల్లో 8 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని.. చిన్నారుల నుంచి పెద్దలు వరకూ అందరూ భక్తితో వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటున్నారన్నారు. విజయవాడ ఉత్సవ్ 2.0, జాతీయ సరస్ మేళా ఇక్కడే జరుగుతున్నాయని వివరించారు. పేదరిక నిర్మూలన జరిగి మెరుగనైన జీవన ప్రమాణాలు కల్పించాలని కోరుకున్నానని, హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీగా రాష్ట్రం ఉండాలని ప్రార్ధిస్తున్నానని చంద్రబాబు తెలిపారు.
కిటకిటలాడిన ఇంద్రకీలాద్రి
గురువారం రాత్రి ఆలయం మూసివేసే సమయానికే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు క్యూల్లోకి చేరారు. మూడో హోల్డింగ్ పాయింట్ నుంచి భక్తులను క్యూల్లోకి అనుమతించారు. అర్ధరాత్రి 12.40 గంటలకు దర్శనానికి పంపారు. ఇంద్రకీలాద్రి నుంచి వినాయకుడి ఆలయం వరకు క్యూలైన్లన్నీ నిండిపోవడంతో మిగిలిన భక్తులను హోల్డింగ్ పాయింట్లలోకి పంపారు. శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల సమయానికి 1,44,670 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. గంటకు 8 వేల మంది దర్శనం చేసుకున్నారు. దర్శనానికి ఆరు గంటల సమయం పట్టింది.
ఈ వార్తలనూ చదవండి:
ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు