ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక నగరమే లక్ష్యం
ABN , Publish Date - Oct 13 , 2026 | 05:05 AM
ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులు, యాత్రికులు తిరుపతిని చూసి.. ఏపీ ఎలా ఉందో అంచనా వేసేలా నగరాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
తిరుపతిని చూసి ఏపీ ఎలా ఉందో చెప్పేలా అభివృద్ధి చేయాలి
రూ.3222 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు వర్చువల్‌గా శంకుస్థాపన
తిరుపతి, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులు, యాత్రికులు తిరుపతిని చూసి.. ఏపీ ఎలా ఉందో అంచనా వేసేలా నగరాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. టీటీడీ, తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడా) ద్వారా రూ.3222 కోట్లతో చేపడుతున్న మూడు కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టారు. సోమవారం తిరుపతి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం అమరావతి నుంచి వర్చువల్‌గా పాల్గొని శంకుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ‘తిరుపతిని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం. శ్రీవారి దర్శనానికి దేశవిదేశాల నుంచి వచ్చే భక్తులకు తిరుపతిలోనే సమగ్ర సదుపాయాలు కల్పించడం, తిరుమల పవిత్రతను కాపాడడం, టీటీడీ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు నగరాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో అభివృద్ధి చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. తిరుమల కొండపై పవిత్రతను కాపాడేందుకు అనుగుణంగా తిరుపతిలో ప్రత్యామ్నాయ సౌకర్యాలను అభివృద్ధి చేయాలి’ అని చంద్రబాబు ఆదేశించారు. అలిపిరి సమీపాన రూ.2700 కోట్ల అంచనా వ్యయంతో టీటీడీ చేపట్టిన ఇంటిగ్రేటెడ్ టూరిజం టౌన్‌షి్‌ప నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు.
రెండేళ్లలో పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. నాలుగు బ్లాకులతో కూడిన ఈ భవనాలలో 2700 గదులుంటాయని, వాటి ద్వారా ఏకంగా 15వేల మంది భక్తులకు వసతి కల్పించవచ్చని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సీఎంకు వివరించారు. అలాగే, రూ.310 కోట్లతో 4500 వాహనాల పార్కింగ్ సామర్థ్యం కలిగిన మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ కూడా ఏర్పాటవుతుందని వివరించారు. రూ.90 కోట్లతో ఇక్కడే భక్తులను తిరుమలకు తరలించడానికి అవసరమైన ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ టెర్మినల్ నిర్మించనున్నామని చెప్పారు.
అనంతరం, తిరుపతి సమీప వడమాలపేట మండలం పాదిరేడు అరణ్యం గ్రామం వద్ద 418 ఎకరాల్లో టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల లే అవుట్ అభివృద్ధి పనులకు, తిరుపతిలో తుడా ద్వారా రూ.242 కోట్ల అంచనా వ్యయంతో తొమ్మిది మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి వెళ్లడానికి రూ.115.23 కోట్లతో ఎన్‌హెచ్-71 నుంచి మూడు రోడ్లు నిర్మించనున్నట్టు తుడా చైర్మన్ దివాకరరెడ్డి సీఎం చంద్రబాబుకు వివరించారు. అలాగే మరో రూ.126.89 కోట్ల అంచనా వ్యయంతో తుడా ద్వారా ఆరు మాస్టర్ ప్లాన్ రోడ్లు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.
వెంకటాద్రి యాప్ ప్రారంభించిన సీఎం
తిరుమలలో భక్తులకు సమగ్ర సమాచారాన్ని అందించే విధంగా టీటీడీ రూపొందించిన వెంకట్రాది యాప్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఇంటర్నెట్ సిగ్నల్స్ లేకపోయినా కూడా ఆఫ్‌లైన్‌లోనూ ఇది పనిచేస్తుంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో యాప్ అందుబాటులో ఉంది. తిరుమలలోని వసతి సముదాయాలు మొదలుకుని అన్న ప్రసాద కేంద్రాలు, తాగునీటి కేంద్రాలు, వైద్య కేంద్రాలు, టాయిలెట్ల దాకా ఎక్కడ వున్నాయి? వాటికి ఎలా వెళ్లాలి? ఎంత సేపటిలో చేరుకోవచ్చుననే సమాచారం అందులో ఉంటుందని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సీఎంకు వివరించారు. కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వేర్వేరు చోట్ల నుంచి వర్చువల్‌గా పాల్గొన్నారు. టీటీడీ ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తిరుమల నుంచి వర్చువల్‌గా హాజరయ్యారు.
ఈ వార్తలనూ చదవండి: