Share News

AP CM Chandrababu: క్రెడిట్‌ చోరీ ఎవరిదో అందరికీ తెలుసు!

ABN , Publish Date - Jan 19 , 2026 | 03:12 AM

రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో క్రెడిట్‌ ఎవరిదో.. క్రెడిబిలిటీ ఎవరికుందో.. క్రెడిట్‌ చోరీ ఎవరిదో.. ప్రజలకు తెలుసు. వారు అన్నీ గమనిస్తూనే ఉన్నారు.

AP CM Chandrababu: క్రెడిట్‌ చోరీ ఎవరిదో  అందరికీ తెలుసు!
Credit Theft

  • క్రెడిబిలిటీ ఎవరికుందో కూడా తెలుసు: సీఎం

  • అభివృద్ధి చేయలేని వాళ్లకే క్రెడిట్‌ పాట్లు

  • అధికారంలో ఉన్నప్పుడు 3 ముక్కలాట

  • 3 ప్రాంతాల్లోనూ చావుదెబ్బతిన్నారు

  • పిన్నమ్మ పుస్తెలు తెంచిన నేరస్థులను రాజకీయం ముసుగులో కాపాడుతున్నారు

  • ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధానా..?

  • జగన్‌.. బెంగళూరు, ఇడుపులపాయలో ఉంటే అవి రాష్ట్రానికి రాజధానులు అవుతాయా?

  • పల్నాడు జిల్లాలో ఫ్యాక్షనిజం చేయనివ్వం

  • ఎన్టీఆర్‌ను మరువం.. ఆయన మార్గం విడువం

  • కార్యకర్తల వల్లే సీఎం సీటులో కూర్చున్నా

  • ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమంలో చంద్రబాబు

క్రెడిట్‌ చోరీ అంటూ గింజుకుంటున్న వాళ్లకు కూడా ఓ క్రెడిట్‌ ఉంది. ఇసుక మాఫియా, మద్యం మాఫియా, గనుల దోపిడీ, డ్రగ్స్‌, గంజాయి.. ఇదీ వాళ్ల క్రెడిట్‌. ప్రజల ఆస్తులపై ఫొటోలు వేసుకోవడం వాళ్ల క్రెడిట్‌. రూ.700 కోట్లు ఖర్చు చేసి సర్వే రాళ్లపై బొమ్మలు వేసుకోవడం, ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం, టీచర్లను బ్రాందీ షాపుల వద్ద కాపలా పెట్టడం వాళ్ల క్రెడిట్‌.

- సీఎం చంద్రబాబు

అమరావతి, జనవరి 18(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో క్రెడిట్‌ ఎవరిదో.. క్రెడిబిలిటీ ఎవరికుందో.. క్రెడిట్‌ చోరీ ఎవరిదో.. ప్రజలకు తెలుసు. వారు అన్నీ గమనిస్తూనే ఉన్నారు.’’ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు అన్నారు. వైసీపీ నేతలు ‘క్రెడిట్‌ చోరీ’ అని గింజుకున్నా.. సైబరాబాద్‌, కియా, గూగుల్‌, భోగాపురం విమానాశ్రయం, గ్రీన్‌ ఎనర్జీ వంటివన్నీ టీడీపీ తెచ్చినవేనన్న విషయం ప్రజలందరికీ తెలుసునని ఉద్ఘాటించారు. ‘‘అభివృద్ధి ఆలోచనే లేని వారు ఇతరుల ఆలోచనలు.. అభివృద్ధి పనులను తమ ఖాతాలో వేసుకుని.. క్రెడిట్‌ కోసం పాకులాడుతారు.’’ అని దుయ్యబట్టారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం ఎన్టీఆర్‌ 30వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. వైసీపీ నేతలు చేస్తున్న ‘క్రెడిట్‌ చోరీ’ విమర్శలపై ఘాటుగా స్పందించారు. ఆయన ఏమన్నారంటే..


వైసీపీ పుట్టుకే ఫేక్‌

వైసీపీ వాళ్లు రాజకీయాల్లో కుట్రలు, కుతంత్రాలు చేస్తూనే ఉంటారు. 18నెలల్లో రకరకాల కుట్రలు పన్నారు. వైసీపీ పుట్టుకే ఫేక్‌. అవినీతి సొమ్ముతో పేపర్‌ పెట్టుకున్నారు. అలాంటి పార్టీతో పోరాడటం దౌర్భాగ్యం. వాళ్ల పత్రికలో క్రెడిట్‌ చోరీ అని వార్తలు రాస్తున్నారు. కాకినాడలో ఏఎం గ్రీన్‌ 10 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెడుతోంది. దీనిలో క్రెడిట్‌ ఎవరిదో.. చోరీ ఎవరిదో అందరికీ తెలుసు. గతంలో కియాతో సంబంధం లేకున్నా ఆ పరిశ్రమను కూడా వైసీపీ తెచ్చిందని చెప్పుకొన్నారు. భోగాపురం విమానాశ్రయానికి టీడీపీ హయాంలో 2,500 ఎకరాల భూసేకరణ చేశాం. ఎప్పుడో అయిపోవాల్సిన ప్రాజెక్టును 5ఏళ్లపాటు మూలన పడేశారు. 500 ఎకరాలు తిరిగి ఇచ్చారు. మొదటిసారి సివిల్‌ ఏవియేషన్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. దీన్ని కూడా తమ ఘనతగా చెప్పుకొంటున్నారు. ఎవరిది క్రెడిట్‌ చోరీ?. ప్రజల ఆస్తులపై వాళ్ల ఫొటోలు వేసుకోవడం వాళ్ల క్రెడిట్‌. రూ.700 కోట్లు ఖర్చుచేసి సర్వే రాళ్లపై బొమ్మలు వేసుకోవడం, ఉద్యోగులను ఇబ్బందిపెట్టడం, టీచర్లను బ్రాందీ షాపుల వద్ద కాపలా పెట్టడం, బకాయిలు అడిగితే తప్పుడు కేసులు పెట్టడం వాళ్ల క్రెడిట్‌. నేడు ఉద్యోగులను గౌరవించి బకాయిలు, డీఏలు చెల్లిస్తున్నాం. కొన్ని బకాయిలు చెల్లించి వారికి నిజమైన సంక్రాంతి ఆనందాన్ని కల్పించాం.


తోక తిప్పలేరు.. జాగ్రత్త!

పల్నాడు జిల్లాలో మొన్న ఒక గొడవ జరిగితే రెచ్చగొడుతున్నారు. గిల్లికజ్జాలు పెట్టుకోవాలంటే మర్యాదగా ఉండదు. నా దగ్గర తోక తిప్పలేరు. సోషల్‌ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడితే పట్టుకొచ్చి బట్టలూడదీస్తాం. తప్పుచేస్తే వదిలిపెట్టం.. మంచి చేస్తే ఎవరి జోలికీ రాను. రాజకీయాల ముసుగులో ఘోరాలు చేస్తే చూరుకోను. సీమలో ముఠాలను అంతం చేసిన పార్టీ టీడీపీ. పల్నాడులో కూడా పూర్తి ప్రక్షాళన చేసి శాంతియుతంగా మార్చుతాం. పల్నాడు ప్రాంతానికి నేను వెళ్తానంటే.. గతంలో నా ఇంటి గేటుకు తాళ్లు కట్టి గేట్లు మూసివేశారు. ఆ తాళ్లే వారికి ఉరితాళ్లు అవుతాయని చెప్పా. తప్పుడు రాజకీయాలు కాదు ప్రజా రాజకీయాలు చేయాలి.


ట్యాంపర్‌ చేస్తే జైలుకే

వైసీపీ హయాంలో ప్రజలకు వారసత్వంగా వచ్చిన భూముల పత్రాలపై వారి ఫొటోలు వేసుకున్నారు. కొత్త గ్రామాధికారులను తీసుకొచ్చి ప్రజల ఆస్తులు కొట్టేయాలని చూశారు. అడ్డదిడ్డంగా వ్యవహరించి భూములను 22-ఏలో పెట్టారు. చెప్పిన మాట ప్రకారం ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దు చేశాం. పట్టాదారు పాస్‌పుస్తకాల్లో గత పాలకుల ఫొటోలు తొలగించి రాజముద్రతో పాస్‌ పుస్తకాలు అందిస్తున్నాం. రీసర్వేను పక్కాగా చేస్తున్నాం. బ్లాక్‌ చైన్‌ విధానం తెస్తున్నాం. క్యూఆర్‌ కోడ్‌ విధానం తీసుకొచ్చాం. రికార్డులను ట్యాంపర్‌ చేస్తే జైలుకు వెళ్తారు. రాష్ట్రంలో ఫ్యాక్షన్‌ రాజకీయాలను టీడీపీ అంతం చేసింది. రాష్ట్రాన్ని తీవ్రవాదులు ఇబ్బందులు పెట్టాలని చూస్తే రాజీ లేకుండా పనిచేశాం. నాపై దాడి చేసినా భయపడకుండా పోరాడాను. మత విద్వేషాలు లేకుండా చేశాం. నేడు రాష్ట్రంలో కొంతమంది పొలిటికల్‌ రౌడీలు తయారయ్యారు. నేరస్థులు రాజకీయ పార్టీలు నడుపుతున్నారు. బాబాయిని చంపి రాజకీయం చేసినట్టు.. నేరాలు చేయాలని చూస్తున్నారు. ప్రజలు ఒక్కసారే మోసపోతారు. ఇక్కడున్నది ఎన్డీయే ప్రభుత్వం.. నడిపించేది సీబీఎన్‌. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉండాలి అప్పుడే పెట్టుబడులు వస్తాయి. కక్ష తీర్చుకోవడానికి నేను రాజకీయాల్లోకి రాలేదు. తెలుగు జాతిని బాగు చేయడానికి వచ్చాను. నాడు ఎన్టీఆర్‌.. నేడు నాది ఒకే లక్ష్యం. రాష్ట్రం ఏమవుతుందోననే ఆందోళనతో ఉన్న వారికి 18 నెలల్లో భరోసా కల్పించాం. తెలుగు జాతిలో ఆత్మవిశ్వాసం నింపాం. రాబోయే రోజుల్లో మరింత ముందుకు తీసుకెళ్తాం.


మొత్తం పెట్టుబడుల్లో 25శాతం మనకే

దేశంలో వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25 శాతం మన రాష్ట్రానికే వచ్చాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా కాకినాడలో ఏఎం గ్రీన్‌ అమ్మోనియా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసుకున్నాం. ఇదీ తెలుగువారి సత్తా. సమైక్య రాష్ట్రం, నవ్యాంధ్రలో సాగునీటి ప్రాజెక్టులకు టీడీపీ ప్రాణం పోసింది. 2027 జూన్‌ నాటికి పోలవరం పూర్తిచేసి జాతికి అంకితం చేస్తాం. శ్రీకాకుళంలోని వంశధార నుంచి నెల్లూరులోని పెన్నా వరకు నదుల అనుసంధానం చేస్తాం. గత ప్రభుత్వంలో రూ.32 వేల కోట్ల విద్యుత్‌ చార్జీల భారాన్ని ప్రజలపై మోపారు. రూ.1.20 లక్షల కోట్ల మేరకు అప్పులు పెట్టారు. మా ప్రభుత్వం వచ్చాక.. రూ.4,600 కోట్ల ట్రూఅప్‌ చార్జీలు వేస్తే వాటిని ప్రభుత్వమే భరిస్తోంది.


యుగపురుషుడు ఎన్టీఆర్‌

ఎన్టీఆర్‌ భౌతికంగా మనకు దూరమైనా.. తెలుగుజాతి గుండెల్లో శాశ్వతంగా ఉన్న ఏకైక నాయకుడు. తెలుగుజాతి ఖ్యాతిని ఎవరెస్ట్‌ అంత ఎత్తుకు తీసుకెళ్లిన యుగపురుషుడు. పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించారు. సుపరిపాలనకు అర్ధం చెప్పారు. మహిళలకు ఆస్తిలో హక్కు తీసుకొచ్చారు. తర్వాత అది చట్టం అయింది. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించారు. మహిళలకు స్థానిక సంస్థల్లో 9శాతం రిజర్వేషన్లు కల్పించారు. దాన్ని నేను 33 శాతం చేశాను. రాబోయే ఎన్నికల్లో పార్లమెంటు, శాసనసభల్లో 33 శాతం సీట్లు మహిళలకు రాబోతున్నాయి. మార్పునకు ఇది నాంది. ఎన్టీఆర్‌ రూ.2కే కిలో బియ్యం ఇచ్చి ఆహార భద్రతకు నాంది పలికారు. తిరుమలలో అన్నదానం ప్రవేశపెట్టారు. నేడు మనం అన్న క్యాంటీన్లు ద్వారా రూ.5కే అన్నం పెడుతున్నాం. ఎన్టీఆర్‌ వృద్ధులకు రూ.35తో పింఛను ప్రారంభించారు. దాన్ని రూ.70 చేశాను. ఆ తర్వాత మళ్లీ రూ.2వేలకు పెంచాను. ఇప్పుడు రూ.4వేలు ఇస్తున్నాం. పేదలకు ఎన్టీఆర్‌ పక్కా ఇళ్లను ఇచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో 3సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు స్థలం ఇవ్వడంతోపాటు ఇళ్లను కూడా నిర్మించి ఇస్తున్నాం. ఇటీవల 3 లక్షల గృహప్రవేశాలు చేశాం. ఉగాది రోజు 5 లక్షల గృహ ప్రవేశాలు ఉంటాయి. ‘సూపర్‌ సిక్స్‌’ను సూపర్‌ హిట్‌ చేశాం. త్వరలో మరిన్ని ఉద్యోగ నియామకాలు చేపడతాం.


పార్టీని అశ్రద్ధ చేయను..

నాకు ఎన్ని పనులున్నా పార్టీ విషయంలో అశ్రద్ధ చేయను. కార్యకర్తల సంక్షేమం కోసం పార్టీ పనిచేస్తోంది. చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటున్నాం. ప్రత్యేకంగా స్కూలు పెట్టి చదివిస్తున్నాం. దేశంలో ఏ పార్టీకి లేనంతగా కోటి మంది కార్యకర్తలు టీడీపీకి ఉన్నారు. కోటి కుటుంబాలు మన పార్టీకి ఉన్నాయి. ఇది నా అదృష్టం. టీడీపీ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది. జాతీయ రాజకీయాల్లో కీలకంగా ఉన్నా రాష్ట్రాభివృద్ధికే అధిక ప్రాధాన్యత ఇచ్చాం. ప్రధాని మోదీ రాష్ట్రానికి పూర్తిగా సహకరిస్తున్నారు. మన వైపు నుంచి మోదీకి అదే సహకారం అందిస్తున్నాం. ప్రభుత్వం కొనసాగుతూ ఉంటేనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది. కేంద్రంలో 3వ సారి మోదీ ప్రధాని అయి దేశం సత్తా చాటారు. గుజరాత్‌లో 5 సార్లు బీజేపీ గెలిచింది. దీన్ని మనం ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలి. కాగా.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్‌ 30వ వర్ధంతిని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదానం చేసిన అభిమానులు, కార్యకర్తలకు సీఎం చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు.


మూడు ప్రాంతాల్లో సమాన అభివృద్ధి

అమరావతిని స్మశానం.. ఎడారి అని మాట్లాడారు. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారు. సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అంట.. ఈయన(జగన్‌) బెంగళూరులో ఉంటే బెంగళూరు ఏపీ రాజధాని అయిపోతుందా.. ఇడుపులపాయలో ఉంటే ఇడుపులపాయ రాజధాని అయిపోతుందా?. ఓ పార్టీ నిర్వహించే వ్యక్తి ఇలాగేనా మాట్లాడేది. 5 ఏళ్లు మీ రాజధాని ఏదీ అంటే ఎక్కడా చెప్పుకోలేని పరిస్థితి. మూడు రాజధానులు అని చెప్పిన చోట ప్రజలు ఆ పార్టీని(వైసీపీ) తిప్పికొట్టి.. ఎన్డీయే అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిచారు. ఏపీ రాజధాని అమరావతే అని గర్వంగా కాలర్‌ ఎగరేసి చెప్పుకొందాం. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం. విశాఖను నంబర్‌ వన్‌ సిటీ చేస్తాం. తిరుపతి మెగా సిటీగా అవతరిస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

Medical Equipment: పాడైన పరికరాలతో వైద్యమెలా?

Fake Investment App: అధిక వడ్డీ ఆశచూపి.. నగదు కాజేసి

Updated Date - Jan 19 , 2026 | 06:50 AM