Medical Equipment: పాడైన పరికరాలతో వైద్యమెలా?
ABN , Publish Date - Jan 19 , 2026 | 05:07 AM
ఆస్పత్రుల్లో వైద్య పరికరాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది! ఏ పరికరం ఎప్పుడు పని చేస్తుందో.. ఎప్పుడు మోరాయిస్తుందో.. పాడైతే వాటిని ఎప్పుడు బాగు చేస్తారో చెప్పలేని పరిస్థితి.
బోధనాస్పత్రుల్లో నిర్వహణ అస్తవ్యస్తం
సకాలంలో మరమ్మతులు చేయని కంపెనీ
వైద్యమంత్రికి, ఆ శాఖ కార్యదర్శికి సూపరింటెండెంట్ల ఫిర్యాదు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఆస్పత్రుల్లో వైద్య పరికరాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది! ఏ పరికరం ఎప్పుడు పని చేస్తుందో.. ఎప్పుడు మోరాయిస్తుందో.. పాడైతే వాటిని ఎప్పుడు బాగు చేస్తారో చెప్పలేని పరిస్థితి. వాస్తవానికి మరమ్మతుల కోసం ప్రభుత్వం నిర్వహణ కంపెనీకి రూ.కోట్లు చెల్లిస్తోంది. అయినా ఆశించిన స్థాయిలో వైద్య పరికరాల మరమ్మతులు జరగడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 17 బోధనాసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి! ఈ నేపథ్యంలో పాడైన వైద్య పరికరాలతో వైద్యం చేసేదెలా? అని వైద్యులు నేరుగా సూపరింటెండెంట్లను ప్రశ్నిస్తున్నారు. దీంతో రెండేళ్ల నుంచి ఓపిక పట్టిన ఆస్పత్రుల సూపరింటెండెంట్లు తాజాగా శుక్రవారం జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి సత్యకుమార్‌కు, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్‌కు సమస్యలను ఏకరువుపెట్టారు. ప్రభుత్వం నేరుగా వైద్య పరికరాల నిర్వహణ చేపట్టడం సాధ్యం కాదని ఒక ప్రయివేటు కంపెనీకి ఆ బాధ్యత అప్పగించింది. సదరు కంపెనీకి ప్రభుత్వం ఏటా రూ.65 కోట్ల వరకూ బిల్లులు చెల్లిస్తోంది. ఎంవోయూ నిబంధనల ప్రకారం.. పాడైన వైద్య పరికరాల సకాలంలో రిపేరు చేయలేని పక్షంలో వెంటనే మరో వైద్య పరికరాన్ని దాన్ని స్థానంలో ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఆయా కంపెనీకి ఉంది. కంపెనీ ఆ పని కూడా సక్రమంగా చేయడం లేదని సూపరింటెండెంట్లు సృష్టం చేశారు. ఏదైనా ఒక వైద్య పరికరాన్ని రిపేరు చేయాల్సి వస్తే, దాని స్థానంలో పని చేస్తున్న వైద్య పరికరాన్ని తెరిచి చూస్తున్నారంటూ నైపుణ్యం లేని బయో మెడికల్ ఇంజనీర్ల తీరును వివరించారు. ఈ విషయం విన్న ఉన్నతాధికారులు షాక్ అయ్యారు. వైద్య పరికరాల నిర్వహణపై మరో సమావేశంలో సుదీర్ఘంగా చర్చిద్దామని అధికారులు దాటవేశారు.