Share News

Fake Investment App: అధిక వడ్డీ ఆశచూపి.. నగదు కాజేసి

ABN , Publish Date - Jan 19 , 2026 | 05:40 AM

టెక్నాలజీపై పట్టు, షేర్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌పై అవగాహన ఉన్న ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను సైబర్‌ నేరగాళ్లు బురిడీ కొట్టించారు.

Fake Investment App: అధిక వడ్డీ ఆశచూపి.. నగదు కాజేసి

  • సైబర్‌ కేటుగాళ్ల వలలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌

  • కోటి రూపాయలకు పైగా మోసపోయిన వైనం

శ్రీకాకుళం క్రైం, జనవరి 18(ఆంధ్రజ్యోతి): టెక్నాలజీపై పట్టు, షేర్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌పై అవగాహన ఉన్న ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను సైబర్‌ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. అధిక వడ్డీ ఆశచూపి నకిలీ యాప్‌ ద్వారా కోటి రూపాయలకు పైగా కాజేశారు. ఈ భారీ సైబర్‌ మోసం శ్రీకాకుళం నగరంలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం నగరంలోని కర్రా వీధికి చెందిన సిల్లా శ్రీనివాసరావు హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ సంస్థలో మెకానికల్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ విధానంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. శ్రీనివాసరావుకు షేర్‌ మార్కెట్‌, ట్రేడింగ్‌పై మంచి అవగాహన ఉంది. ఇటీవల ఆయన యూట్యూబ్‌ చూస్తుండగా ‘క్యాప్స్‌టాయిన్‌’ పేరిట వచ్చిన ఒక ప్రకటన ఆకర్షించింది. ఆ లింక్‌ ఓపెన్‌ చేయగా.. ‘క్యూఐబీ’ అనే యాప్‌కు మళ్లించింది. అందులో పెట్టుబడిదారులు, ధనవంతులు ఉంటారని, ఇది అంతర్జాతీయ స్థాయి ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అని శ్రీనివాసరావు పొరబడ్డాడు. అది నకిలీ యాప్‌ అని గుర్తించలేకపోయాడు. మొదట ఆ యాప్‌లో రూ.10 వేలు డిపాజిట్‌ చేశాడు. అయితే.. ఆ మొత్తం సరిపోదని, కనీసం రూ.50 వేలు డిపాజిట్‌ చేస్తేనే ట్రేడింగ్‌కు అనుమతిస్తామని.. రోజుకు రూ.2వేలు వడ్డీ ఇస్తామని అవతలి వ్యక్తులు నమ్మబలికారు. వారి మాటలు నమ్మిన శ్రీనివాసరావు రూ. 50 వేలు జమ చేశాడు. వారు చెప్పినట్లే రోజుకు రూ. 2 వేల చొప్పున శ్రీనివాసరావు బ్యాంక్‌ ఖాతాలో జమ అయ్యాయి. దీంతో ఇది నిజమైన యాప్‌ అని పూర్తిగా నమ్మాడు. ఈ మేరకు గతేడాది డిసెంబరు 22 నుంచి ఈ నెల 13 వరకు విడతల వారీగా శ్రీనివాసరావు భారీగా పెట్టుబడి పెట్టాడు. ఇలా ఏకంగా రూ. 1 కోటి 3 లక్షల 55 వేలను ఆ యాప్‌లో జమ చేశాడు. చివరికి డబ్బులు డ్రా చేసుకుందామంటే కుదురకపోవడంతో తాను మోసపోయానని గ్రహించాడు. వెంటనే బాధితుడు సైబర్‌ క్రైమ్‌ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 1930కు ఫిర్యాదు చేశాడు. పోలీసులు స్పందించి కేవలం రూ.9 లక్షలను మాత్రమే ఫ్రీజ్‌ చేయగలిగారు. మిగిలిన మొత్తం అప్పటికే సైబర్‌ నేరగాళ్ల ఖాతాల్లోకి మళ్లిపోయింది. బాధితుడి ఫిర్యాదు మేరకు శ్రీకాకుళం రెండో పట్టణ సీఐ ఈశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jan 19 , 2026 | 05:40 AM