Share News

సంక్షేమం,అభివృద్ధి..సమతూకం

ABN , Publish Date - Feb 14 , 2026 | 02:51 AM

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలల్లో ఎంతో చేశామని, సంక్షేమం-అభివృద్ధి సమతూకంగా సుపరిపాలన ప్రజలకు అందుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన ప్రసంగించారు.

సంక్షేమం,అభివృద్ధి..సమతూకం

  • 20 నెలల్లో ఎంతో చేశాం: ముఖ్యమంత్రి

  • జగన్‌ విధ్వంసం నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది

  • పీపీపీ విధానంతో సంపద సృష్టి

  • ముఖ్యమంత్రే చట్ట వ్యతిరేకంగా చేస్తే ఎవరికి చెప్పుకోవాలి?

  • తాడేపల్లి ప్యాలెస్‌ సమీపాన హెలిప్యాడ్‌ కోసం భూమి అడిగారు

  • ఇవ్వలేదని 22ఏలో పెట్టేశారు

  • ఆ హెలిప్యాడ్‌, అప్రోచ్‌ రోడ్డుకు రూ.33 లక్షల ప్రజాధనం ఖర్చు

  • ల్యాండ్‌ రికార్డులన్నీ అస్తవ్యస్తం

  • వాటిని ఈ ఏడాదే ప్రక్షాళన చేస్తాం

  • జగన్‌ పాలనలో జనంపై రూ.32,166 కోట్ల విద్యుత్‌ భారం

  • మూడేళ్లూ కరెంటు చార్జీలు పెంచం

అమరావతి, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలల్లో ఎంతో చేశామని, సంక్షేమం-అభివృద్ధి సమతూకంగా సుపరిపాలన ప్రజలకు అందుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన ప్రసంగించారు. జగన్‌ పాలనలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటోందన్నారు. ఆ విధ్వంసంపై అధికారంలోకి వస్తూనే 7 శ్వేతపత్రాలు విడుదల చేశామని చెప్పారు. రాష్ట్రంలో పీపీపీ విధానంతో సంపద సృష్టి జరుగుతోందన్నారు. రోడ్లు, రేవులు, విమానాశ్రయాలను ఈ పద్ధతిలోనే నిర్మిస్తున్నట్లు తెలిపారు. పబ్లిక్‌-ప్రైవేట్‌-పీపుల్‌ పార్ట్‌నర్‌షిప్‌ (పీ-4) కార్యక్రమంతో భవిష్యత్‌లో మంచి ఫలితాలొస్తాయన్నారు. గత పాలనలో ల్యాండ్‌ రికార్డులన్నీ అస్తవ్యస్తం చేశారని విమర్శించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భూవివాదాలకు సంబంధించిన ఫిర్యాదులే అందుతున్నాయన్నారు. అడిగిన భూములివ్వకపోతే వాటిని 22ఏలో పెట్టారన్నారు. చట్టాలు చేసిన ముఖ్యమంత్రే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. తాడేపల్లి ప్యాలెస్‌ సమీపంలో హెలిప్యాడ్‌ కోసం ఓ భూమి అడిగారని.. ఇవ్వలేదని దానిని నిషేధ భూముల జాబితాలో చేర్చారని తెలిపారు. తర్వాత ఆ హెలిప్యాడ్‌, అప్రోచ్‌ రోడ్డు నిర్మాణానికి రూ.33 లక్షల ప్రజాధనం మంజూరు చేస్తూఏకంగా జీవోనే ఇచ్చారని ఆక్షేపించారు. మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలోని రెవెన్యూ రికార్డులు తగులపెట్టారని గుర్తుచేశారు. వాళ్లు చేసిన పాపం కడగడానికి ఏడాది పట్టిందన్నారు. ఈ ఏడాదే రెవెన్యూ రికార్డులన్నీ ప్రక్షాళన చేసి రాజముద్రతో పాస్‌ పుస్తకాలు జారీచేస్తామన్నారు. ప్రతి ఒక్కరి భూమికీ భద్రత కల్పించేలా కార్యాచరణ చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పనిచేస్తున్నాయన్నారు. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని ఆదుకున్నందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎం ఇంకా ఏం చెప్పారంటే..


కరెంటు వాడకుండానే 9 వేల కోట్ల చెల్లింపు..

గత పాలకులు రాష్ట్ర ప్రజలపై రూ.32,166 కోట్ల విద్యుత్తు భారం మోపారు. విద్యుత్‌ వాడకుండానే సోలార్‌, విండ్‌ ప్రాజెక్టుల్లో రూ.9 వేల కోట్లు చెల్లించాల్సి వచ్చింది. మొత్తంగా రూ.1,22,422 కోట్ల విద్యుత్‌ బకాయిలు పెట్టి పోయారు. 78 నుంచి 90 శాతం మేర కరెంటు చార్జీల భారం వేశారు. కరెంటు చార్జీలు పెంచబోమని మేం చెప్పాం. దానికి కట్టుబడి ఉన్నాం. రూ.4,860 కోట్ల ట్రూ అఫ్‌ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. వచ్చే మూడేళ్లలో కూడా విద్యుత్‌ చార్జీలు పెంచం.

రాయచోటికీ హంద్రీ-నీవా నీరు..

వచ్చే మూడేళ్లలో ఉత్తరాంధ్రలోని అన్ని ప్రాజెక్టులనూ పూర్తి చేస్తాం. పోలవరం-వంశధారను అనుసంధానిస్తాం. ఎడమ కాలువ ద్వారా ఈ ఏడాది అనకాపల్లి వరకూ నీటిని తీసుకెళ్తాం. ఎన్టీఆర్‌ రాయలసీమలో హంద్రీ-నీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ ప్రాజెక్టులు చేపట్టారు. ఇప్పుడు హంద్రీ-నీవా కాలువలను పూర్తి చేసి కుప్పం వరకూ నీళ్లు తీసుకెళ్లాం. చెరువులు నింపాం. రాయచోటికి కూడా నీరు తీసుకెళ్తాం. గాలేరు-నగరి ద్వారా వచ్చే ఏడాది కడపకూ నీళ్లు తరలిస్తాం. గత పాలకులు రాజకీయ కక్షతో పోలవరాన్ని గోదాట్లో ముంచేశారు. డయాఫ్రం వాల్‌ ధ్వంసం చేశారు. మేం ఈ పాజెక్టును 2027 జూన్‌లోగా జాతికి అంకితం చేస్తాం. ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఎమ్మెల్యేలు కూడా ప్రత్యక్షంగా చూడాలి.

తెలంగాణకు అభ్యంతరమెందుకు?

సముద్రంలోకి వృధాగా పోతున్న వరద జలాలను నల్లమలసాగర్‌కు తరలిస్తామంటే.. తెలంగాణ అభ్యంతరం చెప్పడం సరికాదు. సంప్రదింపుల ద్వారా నిర్ణయానికి రావొచ్చు. కూర్చుని మాట్లాడుకుందామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రతిపాదించారు.

శాంతి భద్రతల విషయంలో కఠినం

రాజకీయ ముసుగులో కొందరు నేరాలకు పాల్పడుతున్నారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం. ప్రతిపక్ష నేత రోడ్డుపైకి వస్తున్నాడంటే ఏం జరుగుతుందోననే భయం ప్రజల్లో నెలకొంటోంది. ఎక్కడకు వెళ్లినా దౌర్జన్యాలు, రోడ్డంతా బ్లాక్‌ చేయడం వంటివి చేస్తున్నారు. గుంటూరు నుంచి విజయవాడ వెళ్లడానికి ఆరు గంటలా? ప్రజలు నరకం అనుభవించాలా? జాతీయ రహదారులపై సమావేశాలు పెట్టకూడదని స్పష్టమైన ఆదేశాలున్నా పట్టించుకోవడం లేదు.


విజన్‌-2047తో అగ్ర స్థానంలో..

2047-స్వర్ణాంధ్ర విజన్‌ ద్వారా ఏపీని అగ్రస్థానంలో నిలిపేలా ప్రణాళికలు తయారుచేశాం. పది సూత్రాలతో ఈ విజన్‌ను సాధించేందుకు లక్ష్యాలు నిర్దేశించుకున్నాం. రాష్ట్రాన్ని 2.4 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా ఏపీని తీర్చిదిద్దుతాం. 2047నాటికి భారత్‌ నంబర్‌ వన్‌ ఎకానమీగా ఉంటుంది. అందులో ఏపీ అగ్రస్థానానికి చేరుతుంది. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ అనేది మా విధానం. ప్రతి ఐదేళ్లకూ తలసరి ఆదాయం రెట్టింపయ్యేలా ప్రణాళికలు చేపడుతున్నాం. రైతుల ఆత్మహత్యలను నివారించేలా చర్యలు చేపడుతున్నాం. ఆత్మహత్యలు దేనికీ పరిష్కారం కాదు. విద్యార్థులు కూడా ఎలాంటి ఒత్తిళ్లూ లేకుండా పరీక్షలు ఎదుర్కోవాలి.

3 లక్షల కోట్ల రైల్వే ప్రాజెక్టులు..

రాష్ట్రంలో రూ.3 లక్షల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు చేపట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండేళ్లలో ఇచ్ఛాపురం నుంచి దిగువ వరకూ నాలుగు వరుసల రైల్వే ట్రాక్‌ వచ్చే అవకాశముంది. జనాభా నిర్వహణపై ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే పాలసీ తెస్తాం. మెగా డీఎస్సీ హామీ ఇచ్చి ఏడాదిలోనే టీచర్లకు పోస్టింగ్‌లు ఇచ్చాం. కానిస్టేబుళ్ల నియామకాలు పూర్తిచేసి స్టయిపెండ్‌ను రూ.4,500 నుంచి రూ.12,500కు పెంచాం. అమరావతిలో క్వాంటమ్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నాం. క్వాంటమ్‌ కోర్సుకు 60 వేల మందికి పైగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. గ్రీన్‌ హైడ్రోజన్‌, గ్రీన్‌ అమ్మోనియా ఉత్పత్తికి సంబంధించి ఏపీ, మహారాష్ట్ర మోడల్‌ అవుతాయి. సోలార్‌ ప్యానెళ్లను ఇళ్లపై ఏర్పాటు చేసి గ్రిడ్‌కు అనుసంధానిస్తాం. సంజీవని ప్రాజెక్టు ద్వారా ప్రజారోగ్య సేవలను విస్తృతం చేస్తాం.

పరిశ్రమలకు భూములిస్తే వివాదం చేస్తారా?

ప్రముఖ పరిశ్రమలకు భూములిస్తుంటే కొందరు వివాదం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. భూమి, ప్రోత్సాహకాలు ఇవ్వకుండా పరిశ్రమలు, ఉద్యోగాలు ఎలా వస్తాయి? విదేశీ పెట్టుబడుల్లో 25.6 శాతం రాష్ట్రానికి వచ్చాయంటే ఏపీ బ్రాండ్‌ విలువేంటో అందరూ అర్థం చేసుకోవాలి. గత పాలకుల వేధింపుల కారణంగా అమర్‌రాజా బ్యాటరీస్‌ పొరుగు రాష్ట్రానికి వెళ్లిపోయింది. 11 సంఖ్యతో వైసీపీకి అవినాభావ సంబంధమున్నట్లుంది. అందుకే గవర్నర్‌ ప్రసంగిస్తుండగానే సభలో అడ్డంకులు సృష్టించి 11 నిమిషాలకే బయటకు వెళ్లిపోయారు.

సంపద ఉంటేనే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయగలం.. దానిని పంచగలం.. అట్టడుగు స్థాయిలో ఉన్న వారికి చేయూతనందించే పీ-4 దేశంలోనే పేదరిక నిర్మూలనకు అత్యుత్తమ మోడల్‌.

- సీఎం చంద్రబాబు

5.jpg

16న రాష్ట్రానికి బిల్‌గేట్స్‌

ఈ నెల 16న బిల్‌ గేట్స్‌ రాష్ట్రానికి వస్తున్నారు. గేట్స్‌ ఫౌండేషన్‌ సహకారంతో డిజిటల్‌ హెల్త్‌కార్డులను తయారుచేసి వ్యక్తిగత ఔషధాలను కూడా అందించే అవకాశముంది. సంజీవని ప్రాజెక్టుపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యతను ఎమ్మెల్యేలు తీసుకోవాలి.

Updated Date - Feb 14 , 2026 | 02:51 AM