బీసీలకు 44 శాతం
ABN , Publish Date - Oct 17 , 2026 | 03:51 AM
పట్టణ స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేశారు. 7 కార్పొరేషన్లు, 29 మున్సిపాలిటీలకు మేయర్లు, ఛైర్పర్సన్ల స్థానాలకు అభ్యర్థులను శుక్రవారం రాత్రి ప్రకటించారు.
7 కార్పొరేషన్లు.. 29 మున్సిపాలిటీలకు
టీడీపీ అభ్యర్థుల ప్రకటన
7 కార్పొరేషన్లు.. 29 మున్సిపాలిటీలకు టీడీపీ అభ్యర్థుల ప్రకటన
తొలి జాబితాలోనే సామాజిక న్యాయం
అమరావతి, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): పట్టణ స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేశారు. 7 కార్పొరేషన్లు, 29 మున్సిపాలిటీలకు మేయర్లు, ఛైర్పర్సన్ల స్థానాలకు అభ్యర్థులను శుక్రవారం రాత్రి ప్రకటించారు. వీరి ఎంపికలో టీడీపీ సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది. మొత్తం 36 మందిలో 22 మంది.. అంటే 61 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందినవారు ఉన్నారు. 16 చోట్ల బీసీలకు అవకాశం కల్పించారు. అంటే తొలి జాబితాలోనే 44 శాతం సీట్లను వెనుకబడిన వర్గాలకు కేటాయించారు. 34 శాతం కంటే ఎక్కువే ఇస్తామన్న హామీని సీఎం చంద్రబాబు నిలబెట్టుకున్నారు. ఏడుగురు మేయర్ అభ్యర్థుల్లో నలుగురు బీసీలు, ఒకరు ఎస్సీ ఉన్నారు. ఆళ్లగడ్డ, రాయచోటి మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థులుగా మైనారిటీలను ఖరారుచేశారు. మొత్తం జాబితాలో ముగ్గురు ఎస్సీలు, ఒక ఎస్టీ ఉన్నారు. మంగళగిరి-తాడేపల్లి సహా మిగతా కార్పొరేషన్ల మేయర్ అభ్యర్థులను తర్వాత ప్రకటిస్తారు.
ప్రజాభిప్రాయానికి పెద్దపీట..
ప్రజాభిప్రాయమే ప్రాతిపదికగా.. సామాజిక న్యాయానికి ప్రాధాన్యమిస్తూ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను టీడీపీ విడుదల చేసింది. వారి ఎంపికలో ప్రజల విశ్వాసం, సమర్థ నాయకత్వం, సేవా దృక్పథాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఈసారి మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్లకు ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతుండడంతో చంద్రబాబు అభ్యర్థుల ఎంపికపై విస్తృత కసరత్తు చేశారు. ఆయా పట్టణాలు, నగరాలకు సమర్థ నాయకత్వం అందించగలవారిని గుర్తించేందుకు అన్ని కోణాల్లో నిశితంగా పరిశీలించారు.
విద్యాధికులకు ప్రాధాన్యం..
అభ్యర్థుల ఎంపికలో వారి విద్యార్హతలనూ పరిగణనలోకి తీసుకున్నారు. తొలి జాబితాలో 36 మంది లో 25 మంది అంటే 76 శాతం డిగ్రీ లేదా అంతకంటే ఉన్నత విద్యార్హతలు కలిగినవారు ఉన్నారు. వీరిలో ఏడుగురు పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ, ఎంఏ వంటి విద్యార్హతలు ఉన్నవారూ ఉన్నారు. ముగ్గురు వైద్యులకు అవకాశమిచ్చారు. అభ్యర్థుల సగటు వయసు 45.7 సంవత్సరాలు. మొత్తం 36 మందిలో 16 మంది 45 ఏళ్లలోపు వారు 10 మంది 40 ఏళ్లలోపు వారు. ఏడుగురు మేయర్ అభ్యర్థుల సగటు వయసు 39 సంవత్సరాలు. మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థుల సగటు వయసు 47.5 సంవత్సరాలు కాగా.. మేయర్ అభ్యర్థుల సగటు వయసు దానికంటే సుమారు తొమ్మిదేళ్లు తక్కువ. తొలి జాబితాలో మహిళలకు పెద్దపీట వేశారు. 36 మందిలో 19 మంది మహిళలు. మహిళలకు రిజర్వు చేసిన స్థానాలు 17 కాగా.. టీడీపీ 19 మందికి అవకాశం కల్పించింది. మహిళలకు రిజర్వు కాని చిత్తూరు కార్పొరేషన్, బద్వేలు స్థానాల్లోనూ అవకాశం ఇచ్చారు.
చైర్పర్సన్ అభ్యర్థులు
ఆళ్లగడ్డ- అనీషా షేక్, అద్దంకి-కాకాని అశోక్, ఆదోని-నాగమణి, ఆత్మకూరు(నంద్యాల)-డాక్టర్ గోవిందరాజులు, బద్వేలు-సోమశిల దివ్యతేజ, బొబ్బిలి-రాంబార్కి రేణుకాదేవి స్వ ప్న, దాచేపల్లి-తంగెళ్ల శ్రీనివాసరావు, ధర్మవరం-పరిశె సుధాకర్, గురజాల-నెలవల్లి బొల్లయ్య, హిందూపురం-పీఎస్ మం జునాథ్, ఇచ్ఛాపురం-ఆసి లీలారాణి, జగ్గయ్యపేట-నరేంద్రుల వినీత, జమ్మలమడుగు-జ్యోతి చదిపిరాళ్ల, కమలాపురం-గొంగళిరెడ్డి స్వప్న, కుప్పం-ఎస్.రాజ్కుమార్, మాచర్ల-ఏనుముల సుష్మ, మదనపల్లె-శ్రీరామ్ చిన్నబాబు, మార్కాపురం-వక్కలగడ్డ మల్లికార్జున, నగరి-శ్రీనివాసన్, పలాస కాశీబుగ్గ-వజ్జ గంగాభవాని, పెద్దాపురం-వత్సవాయి ఎస్ఎస్ఎన్ రాజు, పెనుకొండ-త్రివేంద్రమూర్తి, పులివెందుల-తుగుట్ల గీతాకుమారి, రాజంపేట-డాక్టర్ దొంతం గాయత్రి, రామచంద్రాపురం-మేడిశెట్టి శేషారావు, రాయచోటి-ఖాదర్వలీ షేక్, రాయదుర్గం-టంకశాల హనుమంతు, రేపల్లె-కె.అపర్ణ, సూళ్లూరుపేట-పిట్టల సుహాసిని.
7 కార్పొరేషన్లకు మేయర్ అభ్యర్థులు
చిత్తూరు- కటారి హేమలత
కడప- డాక్టర్ నెల్లటూరి సువర్ణ
కర్నూలు- విజయ ప్రత్యూష
నెల్లూరు- పోలబోయిన రూప్కుమార్
తిరుపతి- మన్నెం శ్రీనివాస ప్రసాద్ (జేబీ శ్రీనివాస్)
విశాఖపట్నం- డాక్టర్ ముక్క శ్రావణి
విజయనగరం- అవనపు భార్గవి
ఈ వార్తలనూ చదవండి:
ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు