మీ పెట్టుబడికి ఏపీ గ్యారంటీ
ABN , Publish Date - Nov 13 , 2026 | 03:32 AM
పెట్టుబడుల సాధనలో వేగం పెంచుతూ, జాతీయస్థాయిలో పెట్టుబడుల భద్రతా చట్టం రావాల్సి ఉందని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు.
జాతీయ స్థాయిలో పెట్టుబడుల భద్రతా చట్టం
భిన్న ప్రభుత్వాలతో పెట్టుబడిదారు బలి కావొద్దు
అందుకే దేశమంతా వర్తించేలా చట్టం రావాలి
ప్రాంతీయ కోణంలో ఏపీలో పెట్టుబడులకు ఊతం
25 రంగాలు.. ప్రత్యేక పారిశ్రామిక పార్కులు
కీలక జల ప్రాజెక్టులు చేతికొస్తే మరింత అభివృద్ధి
ఏఐ, క్వాంటమ్‌లో ముందున్నాం..
భవిష్యత్తు రంగాలకు ప్రాధాన్యమిస్తున్నాం
ప్రధాని జన విశ్వాస్ బాటలో ఏపీలో పాలన
31వ పెట్టుబడుల సదస్సులో సీఎం వెల్లడి
జాతీయ స్థాయిలో పెట్టుబడిదారుల భద్రతా చట్టం రావాలి. పెట్టుబడులకు శాశ్వత భరోసా కల్పించడానికి ఇలాంటి ఏర్పాటు అవసరం. పెట్టుబడిదారులకు విశ్వాసం ఉండాలంటే .. వారి పెట్టుబడులకు పూర్తి భద్రత లభించాలి. భిన్న ప్రభుత్వాల కారణంగా వారు బలి కాకూడదు. ప్రభుత్వాలు ఇచ్చే హామీకి కచ్చితంగా చట్టబద్ధమైన గ్యారెంటీ ఉండాల్సిందే. దేశవ్యాప్తంగా వర్తించేలా చట్టం తీసుకురావడమే దీనికి మార్గం.
- సీఎం చంద్రబాబు
విశాఖపట్నం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): పెట్టుబడుల సాధనలో వేగం పెంచుతూ, జాతీయస్థాయిలో పెట్టుబడుల భద్రతా చట్టం రావాల్సి ఉందని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌తో కలిసి ఆయన పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో ఏర్పాటుచేసిన ఏపీ పెవిలియన్‌ను ప్రారంభించారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అభివృద్ధి, పెట్టుబడుల సాధనలో కూటమి ప్రభుత్వ లక్ష్యాలను చాలా స్పష్టంగా వెల్లడించారు.
దక్షిణాసియాలోనే తొలి క్వాంటమ్ కంప్యూటర్, భారత్‌లోనే అత్యధిక విదేశీ పెట్టుబడితో ఏర్పాటైన గూగుల్ ఏఐ డేటా సెంటర్ ప్రారంభోత్సవం, స్పేస్ నుంచి ఇళ్లకు విద్యుత్ సరఫరా తదితర కొత్త విషయాలను ప్రస్తావించారు. లక్ష్యాల సాధనకు నిర్దేశించుకున్న గడువును కూడా ప్రకటించారు. ఏయే రంగాల్లో.. ఏయే ప్రాంతాల్లో పెట్టుబడులకు అవకాశం ఉందనేది విశ్లేషించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరిగిన ప్రగతిని సీఎం వివరించారు. పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తల్లో నమ్మకం, ఉత్సాహం కలిగించేందుకు పారిశ్రామిక రాయితీలను ఎస్ర్కో ఖాతాలను తెరుస్తున్నామని చెప్పారు.
ప్రభుత్వాల మధ్య వైరుధ్యాలకు పెట్టుబడిదారులు బలి కాకూడదని సీఎం అభిప్రాయపడ్డారు. పెట్టుబడిదారులకు భరోసా కల్పించడమే లక్ష్యమని తెలిపారు. ప్రధాని ఇచ్చిన జన్ విశ్వాస్ పిలుపునకు అనుగుణంగా ఏపీలో పాలన సాగుతోందన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో పరిశ్రమలకు రియల్‌టైమ్‌లో అనుమతులు మంజూరు చేస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. ప్రకటనలకే పరిమితం కాకుండా, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు, భూమి కేటాయింపులు, ప్రోత్సాహకాలను వేగంగా అందిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ విధానం వల్లే ‘కియ’ కార్ల కంపెనీ ఏపీకి వచ్చిందన్నారు. రేర్ ఎర్త్ మాగ్నేట్స్, సౌర విద్యుదుత్పత్తి కేంద్రాలు, బ్యాటరీ ఎనర్జీ రంగాల్లో పెద్దఎత్తున అవకాశాలను కల్పించామన్నారు. ఇంకా ఏమన్నారంటే...
నదుల అనుసంధానానికి ప్రణాళిక
‘‘రాష్ట్ర భవిష్యత్తుకు సాగునీరు, తాగునీటి భద్రత కీలకం. రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నాటికి జాతికి అంకితం చేస్తాం. రాష్ట్రంలోని ప్రాంతీయ వనరులు, పారిశ్రామిక అవకాశాలను దృష్టిలో పెట్టుకుని 25 రంగాల వారీగా పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయనున్నాం. శ్రీకాకుళంలో కెమికల్ పార్కు, విశాఖపట్నంలో మెడ్‌టెక్ పార్కు, అనకాపల్లిలో ఉక్కు అనుబంధ పరిశ్రమలతో పాటు అరుదైన ఖనిజాలు, ఏఐ డేటా సెంటర్లకు ప్రాధాన్యం ఇస్తున్నాం.
ప్రతి ప్రాంతానికీ ఉన్న ప్రత్యేకతను పారిశ్రామిక అభివృద్ధికి అనుసంధానం చేయడం ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రాష్ట్ర అభివృద్ధికి స్వర్ణాంధ్ర 2047 విజన్‌ను మార్గదర్శకంగా తీసుకుని ముందుకు సాగుతున్నాం. పెట్టుబడుల ఆకర్షణ, ఆధునిక సాంకేతికత, పారిశ్రామిక తయారీ, మౌలిక సదుపాయాల విస్తరణ, వ్యవసాయానికి జలభద్రత.. ఇలా అన్ని రంగాలనూ సమన్వయం చేస్తూ ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టడమే లక్ష్యం. కేవలం పెట్టుబడుల ఒప్పందాలు చేసుకోవడమే, కాకుండా వాటిని పరిశ్రమలుగా మార్చడం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి శ్రమిస్తున్నాం.’’ అని చంద్రబాబు వివరించారు.
అభివృద్ధి ప్రణాళికల లక్ష్యమిదే..
‘‘రాష్ట్రాన్ని పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అభివృద్ధి ప్రణాళికలను రచించాం. సదస్సు వేదికగా 303 అవగాహన ఒప్పందాల ద్వారా రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించనున్నాం. జూన్ 2024 నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి వచ్చిన రూ.22.60 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలకు ఇవి అదనం. దీంతో రాష్ట్రానికి వచ్చిన మొత్తం పెట్టుబడి ప్రతిపాదనలు రూ.32.49 లక్షల కోట్లకు చేరాయి.
పెట్టుబడులను కేవలం ప్రతిపాదనలకే పరిమితం చేయకుండా, క్షేత్ర స్థాయిలో పరిశ్రమల స్థాపన, ఉత్పత్తి, ఉపాధి కల్పన దిశగా తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యం. సదస్సుకు ముందు జూన్ 2024 నుంచి రాష్ట్రానికి రూ.22.60 లక్షల కోట్ల విలువైన 714 ప్రాజెక్టుల ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో రూ.17.10 లక్షల కోట్ల విలువైన 526 ప్రాజెక్టులకు భూమి, ప్రోత్సాహకాలు తదితర అంశాలకు ఆమోదం లభించింది. మరో రూ.7.30 లక్షల కోట్ల విలువైన 303 ప్రాజెక్టులు నిర్మాణానికి సిద్ధమయ్యాయి. ఆమోదం పొందిన ప్రాజెక్టుల్లో సంఖ్యా పరంగా 58 శాతం నిర్మాణ సన్నద్ధత దశకు చేరుకోవడం పారిశ్రామిక ప్రణాళిక అమలులో పురోగతిని సూచిస్తోంది.’’
ఇం..ధనమే కీలకం..
‘‘పునరుత్పాదక ఇంధన రంగంలో 160 గిగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 114 గిగావాట్లకు ఆమోదం లభించింది. 42 గిగావాట్ల సోలార్ సెల్ తయారీ సామర్థ్యంతో పాటు 53 గిగావాట్ల ఇంగట్ వెఫర్ తయారీ సామర్థ్యానికి అనుమతులు ఇచ్చాం. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల తయారీలో ఏటా రూ.4.20 లక్షల కోట్ల ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
ఈ రంగాల్లో ఇప్పటికే రూ.31,926 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపాం. ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో రూ.50 వేల కోట్లు, అంతరిక్ష రంగంలో మరో రూ.25 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలన్నది ప్రణాళిక. ఐదో తరం యుద్ధవిమాన ప్రాజెక్టును కేవలం 36 రోజుల్లో గ్రౌండింగ్ దశకు తీసుకువచ్చాం. డేటా సెంటర్ల ఏర్పాటులోనూ ఏపీ కీలక గమ్యస్థానంగా ఎదుగుతోంది.’’
లాజిస్టిక్స్‌లో ముందడుగు..
‘‘సముద్ర తీరాన్ని రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ప్రధాన వనరుగా మలచుకునే దిశగా పోర్టుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చాం. దేశ పోర్టుల ద్వారా జరిగే సరుకు రవాణాలో 20శాతం వాటాను సాధించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో పని చేస్తున్న ఆరు పోర్టుల వార్షిక సరుకు నిర్వహణ సామర్థ్యం 346 మిలియన్ టన్నులు.
2025-26లో 209 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసి దేశంలోనే ఏపీ నాలుగో స్థానంలో నిలిచింది. కొత్తగా నిర్మిస్తున్న 4 పోర్టుల ద్వారా మరో 108 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం అందుబాటులోకి రానుంది. పోర్టులు, పారిశ్రామిక పార్కు లు, విమానాశ్రయాలు, రైల్వేమార్గాల సమన్వయం ద్వారా రవాణావ్యయాన్ని తగ్గించి, పరిశ్రమలకు లాజిస్టిక్స్ సదుపాయాలు కల్పిస్తాం.’’
ఈ వార్తలనూ చదవండి:
విశాఖలో 31వ సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్-2026 ప్రారంభం
ఏపీకి పెట్టుబడుల వరద.. తొలిరోజే రూ.1.57 లక్షల కోట్ల ఒప్పందాలు