రైజింగ్ రాయలసీమ
ABN , Publish Date - Oct 03 , 2026 | 03:31 AM
కరువు సీమను రూ.లక్ష కోట్లతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కూటమిని గెలిపించిన మరుక్షణం నుంచి ప్రజలకు మేలు చేసే పనిలోనే ఉన్నామన్నారు.
గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు మదనపల్లెలో చంద్రబాబు శంకుస్థాపన
రిలయన్స్ సంస్థ భాగస్వామ్యంతో ఏర్పాటు
సీమను ప్రపంచానికి కనెక్ట్ చేస్తాం
అవకాశాలను అన్‌లాక్ చేస్తాం
ఫ్రూట్ బౌల్‌గా ఈ ప్రాంతానికి గుర్తింపు
సిరుల సీమగా మార్చే బాధ్యత నాది
వాటర్‌మ్యాన్ అనిపించుకోవడం హ్యాపీ
అగ్రి స్కూల్ ద్వారా నైపుణ్యాల పెంపు: బాబు
గోదావరి-కావేరి అనుసంధానానికి అనుమతివ్వాలని కేంద్రాన్ని కోరిన సీఎం
‘‘ఐదు దశాబ్దాల నా రాజకీయ జీవితంలో విజనరీ, స్వర్ణాంధ్ర నిర్మాత వంటి ఎన్నో పేర్లు నాకు పెట్టారు. ఇప్పుడు వాటర్‌మ్యాన్ అంటున్నారు. ఇది నా మనసుకు ఎంతో ఆనందం ఇస్తోంది. గొడ్డలి పార్టీ పట్టిసీమ కట్టవద్దని అప్పట్లో పట్టుబట్టింది. ఆ రోజు నేను పట్టిసీమ కట్టకుంటే రాయలసీమ ఏమై పోయుండేది? పట్టిసీమ ద్వారా పదేళ్లలో సుమారు 500 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు తరలించాం. కృష్ణా డెల్టాలో పొదుపు చేసిన నీటిని రాయలసీమకు తరలించడమనేది అనుసంధానం వల్లే సాధ్యమైంది. రూ.35 వేల కోట్లతో 36 ప్రాధాన్య ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తిచేస్తాం. వచ్చే ఏడాది పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి ప్రధాని మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తాం.’’
- సీఎం చంద్రబాబు
గొడ్డలి పార్టీ పట్టిసీమ కట్టవద్దని అప్పట్లో పట్టుబట్టింది. ఆ రోజు నేను పట్టిసీమ కట్టకుంటే రాయలసీమ ఏమై పోయుండేది? పట్టిసీమ ద్వారా పదేళ్లలో సుమారు 500 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు తరలించాం. కృష్ణా డెల్టాలో పొదుపు చేసిన నీటిని రాయలసీమకు తరలించడమనేది అనుసంధానం వల్లే సాధ్యమైంది.
- సీఎం చంద్రబాబు
మదనపల్లె, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): కరువు సీమను రూ.లక్ష కోట్లతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కూటమిని గెలిపించిన మరుక్షణం నుంచి ప్రజలకు మేలు చేసే పనిలోనే ఉన్నామన్నారు. ఇందులో భాగంగానే రాయలసీమలోని ఎనిమిది జిల్లాలు, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లోని ఉద్యాన రైతులకు మేలు చేసేలా హార్టికల్చర్ హబ్‌కు శ్రీకారం చుట్టామని తెలిపారు. రాయలసీమను దీనిద్వారా ప్రపంచానికి కనెక్ట్ చేస్తామని, అవకాశాలను అన్‌లాక్ చేస్తామని సీఎం వ్యాఖ్యానించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏర్పాటుకానున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్ (జీహెచ్‌హెచ్), ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ఐఎస్ఏ)కు శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రిలయన్స్ సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ, మంత్రి నారా లోకేశ్‌తో కలిసి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కోసం కేంద్ర సహకారంతో రూ40 వేల కోట్లు, ప్రైవేటు పెట్టుబడుల ద్వారా మరో రూ60 వేల కోట్లను సమీకరించేలా ప్రణాళికలు రూపొందించామని సీఎం తెలిపారు. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలన్న మహాత్మాగాంధీ ఆశయాన్ని సాకారం చేసే దిశగా, ఆయన జయంతి నాడే రాయలసీమలో చారిత్రక కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహకారంతో దానిని ముందుకు తీసుకెళతామన్నారు. ‘‘ప్రాథమిక రంగ వృద్ధిలో ఉద్యాన రంగం కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం సుమారు రూ.1.50 లక్షల కోట్ల జీవీఏ అందిస్తున్న రంగమిది. ఈ రంగం ద్వారా మరో రూ.లక్ష కోట్ల జీవీఏను సాధించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. దానివల్ల తలసరి ఆదాయం పెరుగుతుంది. సీమ రైతుల తలరాత మారుతుంది. రాయలసీమను రతనాలసీమగా చేస్తానన్న చెప్పా. ఇప్పుడు చేసి చూపిస్తున్నా. సీమ బిడ్డగా నాకు చాలా ఆనందంగా ఉంది. ద టీజ్ రైజింగ్ రాయలసీమ.’’ అని చంద్రబాబు ఉద్వేగంగా అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
సీడ్ టు షిప్‌మెంట్ వరకు..
‘‘జీహెచ్‌సీ హబ్ ద్వారా 5,860 గ్రామాలను 201 క్లస్టర్లుగా అభివృద్ధి చేయడంతో పాటు అదనంగా ఆరు లక్షల ఎకరాల్లో ఉద్యాన సాగును విస్తరించేలా కార్యాచరణ చేపడతాం. రైతులకు ఉత్పత్తి నుంచి మార్కెటింగ్, ప్రాసెసింగ్, ఎగుమతుల వరకు సమగ్ర మద్దతు అందించడమే హార్టికల్చర్ హబ్ ప్రధాన ఉద్దేశం. పంటల స్థిరీకరణతో పాటు ధరల స్థిరీకరణకు కూడా చర్యలు తీసుకోనున్నాం. యాపిల్, స్ట్రాబెరీ, అరటి, ఆవకాడో, కివీ, ఖర్జూరం తదితర ఉద్యాన పంటలకు ప్రోత్సహం అందిస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రి టెక్, లాజిస్టిక్స్, అగ్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాలను అభివృద్ధి చేస్తాం. రైతులకు మేలు చేసే వ్యవస్థలను అందుబాటులోకి తీసుకొస్తాం. సీడ్ టు షిప్‌మెంట్ వ్యవస్థల ద్వారా రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించే కార్యక్రమాలను అమలు చేస్తాం. ఏ దేశానికి వెళ్లినా ఇక్కడి రైతు పండించిన పండు గురించి చెప్పేలా రాయలసీమను ఫ్రూట్ బౌల్‌గా మారుస్తాం.’’
36 ప్రాజెక్టులు మూడేళ్లలో పూర్తి
‘‘సాగునీరు అందిస్తే రాయలసీమ ప్రజలు బంగారం పండిస్తారు. మార్కెటింగ్ ద్వారా సంపద సృష్టించగలరు. హంద్రీ- నీవా, గాలేరు-నగరి తదితర సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నాం. రూ.3500 కోట్లతో హంద్రీ-నీవా కాలువను పూర్తి చేసి కుప్పం వరకు నీటిని తీసుకెళ్లాం. వెలిగొండ మొదటి దశను పూర్తి చేసి మార్కాపురానికి, పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి నీటిని అందించాం. మరో రూ.35 వేల కోట్లతో 36 ప్రాధాన్య ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తిచేసి, జాతికి అంకితం చేస్తాం. రాయలసీమలో హంద్రీ-నీవా, మడకశిర బ్రాంచ్ కెనాల్, మల్లెమడుగు, బాలాజీసాగర్, అప్పర్ పేరూరు తదితర ప్రాజెక్టులను పూర్తి చేస్తాం.’’
వాటర్ గ్రిడ్ అవసరం
‘‘వాతావరణ మార్పులు, ఎల్ నినో వంటి పరిస్థితుల కారణంగా వ్యవసాయ రంగంలో సవాళ్లు పెరుగుతున్నాయి. పవర్ గ్రిడ్, రోడ్ గ్రిడ్, డిజిటల్ కనెక్టివిటీ మాదిరిగా వాటర్ గ్రిడ్ అవసరం. గోదావరి నుంచి కావేరి వరకు నీటిని అనుసంధానం చేసే అంశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లాం. దీనివల్ల రాయలసీమ కరువు తీరడంతోపాటుగా, దక్షిణాదిలోని 4 రాష్ట్రాల మధ్య నెలకొనే నీటి వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.’’
వ్యవసాయ నిపుణులను తయారు చేస్తాం
‘‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు రిలయన్స్ సంస్థ తన తోడ్పాటు అందిస్తోంది. ఐఐఎం లో మేనేజ్‌మెంట్ నిపుణులు, ఐఐటీలో సాంకేతిక నిపుణులు, ఐఎస్‌బీలో పారిశ్రామిక నైపుణ్యాలు అభివృద్ధి చెందినట్లే. ఐఎ్‌సఏ ద్వారా వ్యవసాయ రంగంలో నాయకత్వ నైపుణ్యాలు కలిగిన నిపుణులను తయారు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం’’. అని సీఎం అన్నారు.
ఉక్కు మహిళ నిర్మల సీఎం ప్రశంస
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రానికి, దేశ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అందిస్తున్న సహకారాన్ని సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘‘అమరావతి, విశాఖ ఉక్కు, పోలవరం తదితర ప్రాజెక్టులకు కేంద్రం సహకరిస్తోంది. దేశ నిర్మాణంలో నిర్మలా సీతారామన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. జీఎస్టీ నెక్స్ట్ జెన్ సంస్కరణలు, డీబీటీ ద్వారా సంక్షేమ పథకాల్లో పారదర్శకత, ఆర్థిక వ్యవస్థలో సంస్కరణల ద్వారా దేశాన్ని బలోపేతం చేస్తున్న ఉక్కు మహిళ నిర్మలా సీతారామన్. ఇంటిని చక్కగా తీర్చిదిద్దే సత్తా మహిళకు మాత్రమే ఉంటుంది. అదే విధంగా దేశ ఆర్థిక వ్యవస్థను నిర్మలా సీతారామన్ తీర్చిదిద్దుతున్నారు. ఆమెకున్న నాయకత్వ పటిమను గుర్తించే ప్రధాని మోదీ ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించారు. జీహెచ్‌సీ హబ్‌కు నిధులు కేటాయించే విషయంలో ఆమె చూపిన చొరవ, ఇచ్చిన సహకారాన్ని మరువలేం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ స్థాయిలో అభివృద్ధి-సంక్షేమం చేయగలుగుతోందంటే దానికి కేంద్రం అందిస్తున్న సహకారమే కారణం.’’ అని చంద్రబాబు అన్నారు.
ఆంధ్రుల ముద్డుబిడ్డ అనంత్ అంబానీ : చంద్రబాబు
మదనపల్లెలో ఐఎస్ఏ ఏర్పాటుకు ముందుకొచ్చిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ తన పెద్ద మనస్సును చాటుకున్నారని చంద్రబాబు అన్నారు. ‘‘వ్యవసాయం, ఉద్యాన రంగాల్లో పరిశోధన, ఆధునిక సాంకేతికత, ఏఐ వినియోగంతోపాటు రైతులకు అవసరమైన మద్దతు వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో రిలయన్స్ సంస్థ సహకారం అందించాలి. సీడ్ టు షిప్‌మెంట్, అగ్రిటెక్, లాజిస్టిక్స్, అగ్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో మరింతగా భాగస్వామ్యం కావాలి. తిరుమల శ్రీవారిపై భక్తితో ఈవీ బస్సులను సమకూర్చిన అనంత్ అంబానీకి ధన్యవాదాలు. అలాగే అనంత్ అంబానీ వంతారా వంటి వ్యవస్థను ఏర్పాటు చేసి జంతువులకు సైతం సేవలు అందిస్తున్న గొప్ప పర్యావరణ ప్రేమికుడు. తన తాత, తండ్రుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని వారి బాటలో నడుస్తున్నారు.’’ అని చంద్రబాబు కొనియాడారు. తనను ఆంధ్రా బిడ్డగా భావించాలని, రాష్ట్రానికి తాను ఏం చేయగలనో మార్గనిర్దేశం చేయాలని అనంత్ అంబానీ కోరగా.. ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డగానే భావిస్తున్నామని సీఎం వేదికపై ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధిలో రిలయన్స్ మరింతగా భాగస్వామి కావాలని ఆకాంక్షించారు.
ఈ వార్తలనూ చదవండి..
స్వచ్ఛతే ఆరోగ్యానికి తొలిమెట్టు
శ్రీవారి ఆలయానికి ‘స్వచ్ఛ’ అవార్డు