వచ్చే 20 ఏళ్లు కీలకం
ABN , Publish Date - Sep 30 , 2026 | 04:01 AM
దేశాభివృద్ధిలో వచ్చే 20 ఏళ్ల కాలం కీలకమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రజా ఆకాంక్షలు వేగంగా మారుతున్నాయని, తదానుగుణంగానే ప్రభుత్వ వ్యవస్థలు, సంస్థల్లో విప్లవాత్మక మార్పులు రావాల్సిన అవసరముందని తెలిపారు.
ప్రజా ఆకాంక్షలు వేగంగా మారుతున్నాయి
పాలనా వ్యవస్థలోనూ పెనుమార్పులు రావాలి
నైపుణ్యాలే అభివృద్ధికి చోదకశక్తి
టెక్నాలజీతో పాలన మరింత సరళీకృతం
సేవల్లో నాణ్యతే సామర్థ్యానికి గీటురాయి
మిషన్ కర్మయోగి దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ తొలి సదస్సులో సీఎం చంద్రబాబు
కెపాసిటీ బిల్డింగ్‌లో ఏపీకి మొదటి స్థానం
అవార్డు అందుకున్న పీయూశ్ కుమార్
తదుపరి స్థానాల్లో కర్ణాటక, ఒడిశా
అమరావతి, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): దేశాభివృద్ధిలో వచ్చే 20 ఏళ్ల కాలం కీలకమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రజా ఆకాంక్షలు వేగంగా మారుతున్నాయని, తదానుగుణంగానే ప్రభుత్వ వ్యవస్థలు, సంస్థల్లో విప్లవాత్మక మార్పులు రావాల్సిన అవసరముందని తెలిపారు. విజయవాడ అంబేడ్కర్ కళావేదికలో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాధన శృంఖల-2026 మిషన్ కర్మయోగి ప్రాంతీయ సదస్సును సీఎం మంగళవారం ప్రారంభించారు. ‘ఐగాట్ మిషన్ కర్మయోగి’ ద్వారా ఉద్యోగులు ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలని సీఎం కోరారు. ప్రభుత్వ శిక్షణ సంస్థలు కేవలం ఉద్యోగులకు కోర్సులు నిర్వహించే కేంద్రాలుగా ఉండకూడదన్నారు. సవాళ్లను పరిష్కరించడంలో ఉద్యోగుల నైపుణ్యాలను పెంచే సంస్థలుగా అవి మారాలని సూచించారు. కోర్సులు పూర్తి చేసి సర్టిఫికెట్లు పొందడం మాత్రమే కెపాసిటీ బిల్డింగ్ కాదని, నేర్చుకున్న అంశాలను ఉద్యోగులు తమ విధుల్లో ఎంత వరకు అమలు చేస్తున్నారు.. ప్రజలకు అందే సేవల నాణ్యత ఎంత మెరుగుపడిందన్న అంశమే ప్రామాణికత అని సీఎం స్పష్టం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
టెక్నాలజీ మారింది.. పాలనా విధానాలూ మారాలి..
‘‘ప్రగతిని నిరోధించే అనవసర నిబంధనలను సరళీకరించాల్సిన అవసరం ఉంది. జన్ విశ్వాస్ వంటి సంస్కరణలు ఈ దిశలో కీలకం. ప్రస్తుతం ఐటీ విప్లవం తర్వాత ఏఐ కాలం ప్రారంభమైంది. మారుతున్న సాంకేతికతలకు అనుగుణంగా ప్రభుత్వ వ్యవస్థలు కూడా మారాల్సిందే. ఏపీలో రియల్‌టైమ్ గవర్నెన్స్ ద్వారా పాలనా వ్యవహారాలు, పౌరసేవల నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ఏపీ ఏఐ స్టాక్, మనమిత్ర, వాట్సాప్ గవర్నెన్స్ వంటి కార్యక్రమాలను పాలనలో వినియోగిస్తున్నాం.’’
పాలనకు విలువను పెంచాలి.
‘‘ఏఐ పాలనా వ్యవహారాలను మార్చగలదు. ఉద్యోగుల సామర్థ్య లోపాలను గుర్తించడం, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా శిక్షణ కోర్సులను సూచించడం, పరిపాలనా నిర్ణయాలను మెరుగుపరచడంలో ఏఐ ఉపయోగపడుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు, యంత్రాంగం ప్రభుత్వ పాలనలో కీలకం. ఉద్యోగుల సేవలను ఎప్పటికీ విస్మరించలేం. మీ ముందున్న ప్రతి ఫైలు వెనక ఒక మనిషి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు ఉంటాయి. నిరంతరం నైపుణ్యాలను పెంచుకునేలా ఆన్‌లైన్ శిక్షణను వినియోగించుకోవాలి. రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు అధికారులు, ఉద్యోగులు శిక్షణ పొందినప్పుడే నాణ్యమైన సేవలు అందించగలం.’’
ఏపీకి కెపాసిటీ బిల్డింగ్ పాలసీ...
‘‘ఆంధ్రప్రదేశ్ కెపాసిటీ బిల్డింగ్ పాలసీని ప్రవేశపెట్టి రాష్ట్రంలోని 38 శాఖలకు కెపాసిటీ బిల్డింగ్ ప్రణాళికలు రూపొందించాం. ప్రతి ఉద్యోగికీ ఎదిగే అవకాశం, ప్రతి సంస్థకు మెరుగుపడే అవకాశం, ప్రతి పౌరుడికి దాని ప్రయోజనం అందేలా వ్యవస్థను తీర్చిదిద్దాలి. ప్రభుత్వం నియంత్రించే వ్యవస్థగా కాకుండా ప్రజలను సాధికారత వైపు నడి పే వ్యవస్థగా మారాలి. 2047 వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా యంత్రాంగాలు కలిసి పనిచేయాలి. 1978లో సంస్కరణలు ప్రారంభించిన చైనా కొన్ని దశాబ్దాల్లోనే తన సామర్థ్యాలను భారీగా పెంచుకుని ఆర్థికంగా ఉన్నతస్థాయికి చేరింది. ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు తమ నైపుణ్యాలను నిరూపించుకున్నారు. ఆర్థిక సంస్కరణల తర్వాత భారతీయుల ఆకాంక్షలు మారాయి. వాటికి అనుగుణంగా ప్రభుత్వ వ్యవస్థలు కూడా మారాలి. ప్రపంచంలోని ప్రముఖ సంస్థలకు భారతీయులు నాయకత్వం వహిస్తున్నారు. ఆ సామర్థ్యాలను దేశాభివృద్ధికి వినియోగించుకోవాల్సిన అవసరముంది. ప్రభుత్వ శిక్షణ సంస్థలు భవిష్యత్తు సవాళ్లను ముందుగానే అంచనా వేసి ఉద్యోగులను సిద్ధం చేయాలి. రాష్ట్రంలో గుర్తించిన 61 శిక్షణ సంస్థలను ‘ఐగాట్..’లో అనుసంధానించాం. అమరావతిలో గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఏర్పాటు దిశగా కూడా పనిచేస్తున్నాం.’’ అని చంద్రబాబు వివరించారు.
‘‘సాంకేతిక పరిజ్ఞానం వేగంగా మారుతున్నా, కొన్నిచోట్ల పాత నిబంధనలు, విధానాలే ఉన్నాయి. కంప్యూటర్లు వచ్చినా పేపర్‌వర్క్ కొనసాగడం, దరఖాస్తులను డిజిటల్ చేసినా, అనేక అనుమతులు కోరడం, ఆన్‌లైన్ సేవలు వచ్చినా పౌరులను కార్యాలయాలకు రప్పించడం వంటి విధానాలను మార్చాలి. పాత విధానాన్ని డిజిటలైజ్ చేయడం మాత్రమే ఆధునిక పాలన కాదు. మొత్తం ప్రక్రియను మార్పు చేయాలి.’’ - సీఎం చంద్రబాబు
రాష్ట్రానికి మొదటి స్థానం..
ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన అధికారులు, శిక్షణ సంస్థల ప్రతినిధులు రెండు రోజుల సదస్సుకు హాజరయ్యారు. ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యాల పెంపు, పరిపాలనా నైపుణ్యాల మెరుగుదల, ప్రభుత్వ శిక్షణ సంస్థల సామర్థ్య నిర్మాణంపై ప్రధానంగా చర్చించారు. ప్రభుత్వ ఉద్యోగుల కెపాసిటీ బిల్డింగ్‌లో ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ రాష్ట్రంగా మొదటి స్థానాన్ని సంపాదించింది. ఈ అవార్డును ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి పీయూశ్ కుమార్, ఏపీఎస్‌డీపీఎస్ ఈడీ వీఆర్ అలపర్తి అందుకున్నారు. రెండో స్థానంలో నిలిచిన కర్ణాటక, మూడో స్థానంలో నిలిచిన ఒడిశా రాష్ట్రాలకు కూడా సీఎం అవార్డులు అందజేశారు. మిషన్ కర్మయోగి కింద ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 7.89 లక్షల మంది ఉద్యోగులు ఐగాట్ కర్మయోగిలో నమోదయ్యారని సీఎం తెలిపారు. రాష్ట్రంలో రెండు కోట్లకు పైగా కోర్సులు పూర్తి చేసి దేశంలోని రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. రెండు కోట్ల సర్టిఫికెట్ల కంటే నేర్చుకున్న అంశాలే కీలకమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు అందే సేవల్లో మార్పుగా ఈ అంశాలు కనిపించాలన్నారు. శిక్షణతో ఓ రెవెన్యూ అధికారి...
పౌరుడి సమస్యను వేగంగా పరిష్కరించడం, ఉపాధ్యాయుడు తరగతి గదిలో మెరుగైన బోధన అందించడం...పోలీసు అధికారి మరింత మానవీయంగా స్పందించడం ముఖ్యమని సీఎం స్పష్టం చేశారు. పూర్తి చేసుకున్న శిక్షణతో పౌరులకు నాణ్యమైన సేవలు అందుతున్న తీరుకు కొలమానంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. కెపాసిటీ బిల్డింగ్ చైర్‌పర్సన్ రాధా చౌహాన్ మాట్లాడుతూ... ‘సేవాభావం -నాగరిక దేవోభవ’ స్ఫూర్తితో దేశ నిర్మాణంలో ఉద్యోగుల భాగస్వామ్యం పెంచేలా 900 కు పైగా శిక్షణా సంస్థలను ఉన్నతి ప్లాట్‌ఫామ్‌తో అనుసంధించామని వివరించారు.
ఈ వార్తలనూ చదవండి..
హై బీమ్ ఎల్‌ఈడీ లైట్లతో అగచాట్లు
వేర్వేరు ఘటనల్లో ఐదుగురి బలవన్మరణం