Share News

స్వచ్ఛాంధ్రతోనే స్వర్ణాంధ్ర

ABN , Publish Date - Oct 03 , 2026 | 05:37 AM

స్వచ్ఛాంధ్ర సాధన ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజల భాగస్వామ్యంతోనే అది ఉద్యమంగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

స్వచ్ఛాంధ్రతోనే స్వర్ణాంధ్ర

  • ప్రతి ఇల్లు, స్కూల్‌,పంచాయతీ, మున్సిపాలిటీకి ర్యాంకులు

  • చెత్తను సంపదగా మార్చాలి

  • స్వచ్ఛ అవార్డుల పంపిణీలో సీఎం పిలుపు

  • ఐఐటీ కాన్పూర్‌-స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ మధ్య నెట్‌జీరో అంశంపై ఎంఓయూ

అమరావతి, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): స్వచ్ఛాంధ్ర సాధన ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజల భాగస్వామ్యంతోనే అది ఉద్యమంగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా విజయవాడలో జరిగిన స్వచ్ఛ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. వ్యక్తిగత పరిశుభ్రత నుంచి ఇల్లు, పాఠశాల, కార్యాలయం, గ్రామం, పట్టణం వరకు ప్రతి స్థాయిలో మార్పు రావాలని ఈ సందర్భంగా సీఎం కోరారు. ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛతా కార్యక్రమాలకు కేటాయించాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛ మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, పాఠశాలలు, అంగన్‌వాడీలు, ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, బస్‌స్టేషన్లు, రైతు బజార్లు, పరిశ్రమలు, స్వచ్ఛతపై పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు, పారిశుధ్య కార్మికులు, గ్రీన్‌ అంబాసిడర్లను స్వచ్ఛ అవార్డులతో సత్కరిస్తున్నామని చెప్పారు. ప్రతి ఇంటికి, పాఠశాలకు, గ్రామ పంచాయతీకి, మున్సిపాలిటీకి స్వచ్ఛత ఆధారంగా ర్యాంకులు ఇవ్వాలని సీఎం సూచించారు. చెత్తను సమస్యగా కాకుండా సంపదగా మార్చే విధానాన్ని అవలంభించాలన్నారు.


రాష్ట్రంలో ఇంకా సుమారు 8లక్షల టన్నుల చెత్త తొలగించాల్సి ఉందని సీఎం తెలిపారు. జీరో గార్బేజ్‌ లక్ష్యాన్ని చేరుకునే వరకు అధికారులను వెంటాడతానన్నారు. రూప్‌టాప్‌ సోలార్‌ను విస్తృతంగా ప్రోత్సహించాలని సూచించారు. స్వచ్ఛ చల్లపల్లిని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలో స్వచ్ఛతా కార్యక్రమాలు అమలు చేద్దామన్నారు. ఏటా అక్టోబరు 2 తేదీన నెట్‌జీరో, స్వచ్ఛతపై పనిచేసినవ్యక్తులు, సంస్థలకు అవార్డులు ఇచ్చే కార్యక్రమాలను చేపట్టాలన్నారు. అనంతరం స్వచ్ఛతా వారియర్లు, ఎన్జీవో సంస్థలకు స్వచ్ఛాంధ్ర-2026 అవార్డులను ముఖ్యమంత్రి ప్రదానం చేశారు.

స్వచ్ఛ కాలనీలు, అసోసియేషన్లు, సంస్థలకు ఈ అవార్డులు దక్కాయి. నెట్‌జీరో అంశంపై ఐఐటీ కాన్పూర్‌-స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ మధ్య సీఎం సమక్షంలో ఎంఓయూ కుదుర్చుకున్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఎండీ, ఐఐటీ కాన్ఫూర్‌ ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేశారు. రాష్ట్రంలో చెత్త సమస్య పరిష్కారానికి సీఎం శాశ్వత ప్రణాళిక రూపొందించారని మంత్రి నారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ పట్టాభిరాం, వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లాల నుంచి స్వచ్ఛాంధ్ర అవార్డు గ్రహీతలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి..

స్వచ్ఛతే ఆరోగ్యానికి తొలిమెట్టు

శ్రీవారి ఆలయానికి ‘స్వచ్ఛ’ అవార్డు

Updated Date - Oct 03 , 2026 | 05:37 AM