కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Sep 24 , 2026 | 04:47 AM
తీవ్ర వాయుగుండం కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉన్నందున ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆకస్మిక వరదల వల్ల ముంపు బారిన పడే అవకాశం ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.
నదుల్లో ప్రవాహాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి
మంత్రులు, సీఎస్, డీజీపీలతో సమీక్షలో సీఎం
అమరావతి, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): తీవ్ర వాయుగుండం కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉన్నందున ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆకస్మిక వరదల వల్ల ముంపు బారిన పడే అవకాశం ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. నదుల్లో ప్రవాహాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, రిజర్వాయర్లలో నీటి నిల్వలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. భారీ వర్షాలపై బుధవారం మంత్రులు, సీఎస్, డీజీపీతో పాటు ఆయా శాఖల అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 261 మండలాల్లో 129 మండలాలకు భారీ వర్షం, 121 మండలాల్లో సాధారణ వర్షం, 9 మండలాల్లో అతిభారీ వర్షం, 2 మండలాల్లో తీవ్ర వర్షం పడుతుందని అంచనా వేసినట్లు అధికారులు చెప్పారు.
వర్షాలు తగ్గుముఖం పట్టేవరకు అప్రమత్తత అవసరం
వాయుగుండం తీరం దాటినా.. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. బుధవారం రాత్రి క్యాంప్ కార్యాలయం నుంచి వర్షప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, 24,25 తేదీల్లో కలెక్టర్లు అలెర్ట్‌గా ఉండాలన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వరి ఎంత మేర దెబ్బతిన్నదో అంచనా వేయాలన్నారు. వర్షప్రభావం ఉన్న జిల్లాల్లో గురువారం కూడా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించాలని చెప్పారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులను కూడా వెనక్కి వచ్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
జనజీవనానికి ఇబ్బందుల్లేకుండా చూడాలి: నారాయణ
పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా చూడాలని, అదనపు సిబ్బందితో అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్లకు ఆ శాఖ మంత్రి నారాయణ ఆదేశించారు. వర్షాల కారణంగా జనజీవనానికి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
తాగునీరు కలుషితం కాకూడదు: మంత్రి సత్యకుమార్
పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తుండడంతో ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
విద్యుత్ సిబ్బంది అందుబాటులో ఉండాలి: గొట్టిపాటి
ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్తు శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సిబ్బంది మొత్తం అందుబాటులో ఉండాలని విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు.