కార్మిక శాఖపై ఏపీ సీఎం సమీక్ష.. నైపుణ్యాభివృద్ధిపై కార్యాచరణకు ఆదేశాలు
ABN , Publish Date - Feb 05 , 2026 | 09:34 PM
ఏపీ సీఎం చంద్రబాబు కార్మిక శాఖపై తాజాగా సమీక్ష నిర్వహించారు. కార్మికుల నైపుణ్యాభివృద్ధి, సంక్షేమం కోసం కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
ఇంటర్నెట్ డెస్క్: అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల్లో ఆధునిక నైపుణ్యాలను, జీవన ప్రమాణాలను పెంచే అంశంపై అధికారులకు ఏపీ సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. క్యాంపు కార్యాలయంలో సీఎం తాజాగా కార్మిక శాఖపై సమీక్ష నిర్వహించారు. ఆధునిక నైపుణ్య శిక్షణ ద్వారా ఏపీలోని కార్మికులు దేశ విదేశాల్లోని ఉపాధి అవకాశాలను దక్కించుకుని అధిక ఆదాయాన్ని ఆర్జించేలా చూడాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని 20 లక్షల మంది కార్మికులకు నైపుణ్యాలు పెంచేందుకు అనువుగా కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు.
నిర్మాణ రంగంలో ఉన్న ప్రముఖ కంపెనీలు ఎల్ అండ్ టీ, ఎన్సీసీ, మిట్టల్ సహా వేర్వేరు సంస్థల సహకారంతో వారికి అవసరమైన నైపుణ్య శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాల వారీగా, రంగాల వారీగా కార్మికుల డేటా బేస్ ను రూపొందించాలని చెప్పారు. కార్మికుల్లో నైపుణ్యాల స్థాయిని అంచనా వేసి ఆ మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నైపుణ్యం పోర్టల్ ద్వారా ఈ డేటా బేస్‌ను అనుసంధానించటంతో పాటు కార్మికులు లేటరల్ ఎంట్రీ ద్వారా వివిధ కోర్సులు అభ్యసించి ఉన్నత విద్యార్హతను సాధించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. గిగ్ వర్కర్లు, నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల ఆదాయాలు పెరిగేందుకు చర్యలు చేపట్టాలని కూడా ఆదేశించారు.
అసంఘటిత రంగంలోని కార్మికుల సంక్షేమంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. భవన నిర్మాణ, ఇతర కార్మికులకు గతంలో అందించిన సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని సూచించారు. ప్రసూతికి రూ.20 వేలు, వివాహానికి రూ.40 వేలు, సహజ మరణానికి రూ.60 వేలు, అంత్యక్రియలకు రూ.20 వేల మేర ఆర్థిక సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యూనివర్సల్ హెల్త్ పాలసీతో పాటు కార్మిక శాఖ ద్వారా రూ.2.5 లక్షల వరకూ ఉచిత వైద్య చికిత్సలు ఆపై ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా భరించేలా చూడాలని స్పష్టం చేశారు. గతంలో కార్మికుల సంక్షేమం కోసం కన్‌స్ట్రక్షన్ వర్కర్ వెల్ఫేర్ ఫండ్‌ను టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఏర్పాటు చేశామని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు.
ఇవీ చదవండి:
సాగునీటి సంఘాలకే కాల్వల మరమ్మతు పనులు: సీఎం చంద్రబాబు