మోదీ దార్శనికుడు
ABN , Publish Date - Oct 08 , 2026 | 04:16 AM
ప్రభుత్వాధినేతగా నిరంతరాయంగా 25 ఏళ్లు పూర్తిచేసుకున్న ప్రధాని మోదీకి రాష్ట్ర మంత్రివర్గం హృదయపూర్వక అభినందనలు తెలిపింది. బుధవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన మంత్రిమండలి ఈ మేరకు ప్రత్యేకంగా అభినందన తీర్మానాన్ని ఆమోదించింది.
ప్రజలకు పారదర్శక, అవినీతిరహిత పాలన.. దేశ సామర్థ్యాన్ని
అంతర్జాతీయ స్థాయికి పెంచారు.. 21వ శతాబ్దం నరేంద్ర మోదీదే
ప్రధానికి రాష్ట్ర క్యాబినెట్ అభినందనలు.. వరుసగా 25 ఏళ్ల
ప్రజాపాలనపై తీర్మానం.. రైట్ టైమ్, రైట్ ప్లేస్, రైట్ లీడర్: చంద్రబాబు
అమరావతి, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాధినేతగా నిరంతరాయంగా 25 ఏళ్లు పూర్తిచేసుకున్న ప్రధాని మోదీకి రాష్ట్ర మంత్రివర్గం హృదయపూర్వక అభినందనలు తెలిపింది. బుధవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన మంత్రిమండలి ఈ మేరకు ప్రత్యేకంగా అభినందన తీర్మానాన్ని ఆమోదించింది. తొలుత గుజరాత్ సీఎంగా, 2014 నుంచి ప్రధానిగా ఆయన అందించిన విశిష్ట సేవలను, నిబద్ధతతో కూడిన నాయకత్వాన్ని క్యాబినెట్ కొనియాడింది. ప్రధాని మోదీ సమగ్ర దార్శనికత, క్రమశిక్షణ, అవినీతిరహిత పాలనను తీర్మానంలో ప్రశంసించారు. సృజనాత్మకత, సాంకేతికత, వేగవంతమైన నిర్ణయాలు, పారదర్శకతతో కూడిన పాలనను ఆయన దేశానికి పరిచయం చేశారని మంత్రులు పేర్కొన్నారు. రాష్ర్టాలను దేశాభివృద్థిలో భాగస్వాములుగా భావించే ‘సహకార సమాఖ్య’ విధానాన్ని బలపరిచారని ఏపీ క్యాబినెట్ ప్రత్యేకంగా పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా అస్థిర పరిస్థితులు నెలకొన్న సమయంలోనూ దేశాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపించడంలో ఆయన దౌత్యనీతి కీలక పాత్ర పోషించిందని పేర్కొంది. ఈ అపూర్వ ప్రగతిని, మోదీ నాయకత్వ ముద్రను గుర్తిస్తూ.. ‘21వ శతాబ్దం మోదీదే’ అని క్యాబినెట్ అభివర్ణించింది. ప్రధానికి సంపూర్ణ ఆరోగ్యం, మరింత ప్రజాసేవ చేసే శక్తిని ప్రసాదించాలని ఆకాంక్షించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారిక తీర్మానాన్ని జారీ చేశారు.
ప్రజలను మెప్పించిన నేత: చంద్రబాబు
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. సీఎంగా, పీఎంగా మోదీ 25ఏళ్లు నిరంతరాయంగా కొనసాగడం అద్భుతమని, జనాలను మెప్పించగలిగితేనే ఇది సాధ్యమని అన్నారు. ప్రజలతో సన్నిహితంగా ఉండి, సమస్యలు పరిష్కరిస్తే మీరు కూడా నాయకులుగా ఎక్కువకాలం జనంలో ఉండగలుగుతారని అన్నారు. మోదీ ఎవరు చెప్పినా వింటారని, మంచి విషయం ఉంటే స్వీకరిస్తారని అన్నారు. రైట్ టైమ్, రైట్ ప్లేస్, రైట్ లీడర్ మోదీ అని సీఎం పేర్కొన్నారు. ప్రధానిగా ఉండి కూడా మోదీ అందరు చెప్పిన విషయాలు వింటారన్న సీఎం.. మంత్రులు కూడా ప్రజలు చెప్పిన విషయాలను వినాలని సూచించారు.
సహకార సమాఖ్య బలోపేతం: పవన్
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. కో-ఆపరేటివ్ ఫెడరలిజం ను బలోపేతం చేసిన నాయకుడు మోదీ అని అన్నారు. దేశాభివృద్ధే ప్రధాన అజెండాగా మోదీ పాలన సాగిస్తున్నారని కొనియాడారు.
25 ఏళ్ల ప్రజాసేవా శిఖరం నమో: లోకేశ్
భారత రాజకీయాల్లో ఆధునిక ఉక్కు మనిషిగా ప్రధాని మోదీ నిలుస్తారని, దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలపాలన్నది ఆయన వజ్రసంకల్పమని, అది నెరవేరాలని కోరుకుంటున్నానని మంత్రి లోకేశ్ అన్నారు. మోదీ సుదీర్ఘకాలం ప్రజాభిమాన నేతగా కొనసాగడానికి ఎన్నో మంచి లక్షణాలు ఆయన వద్ద ఉండటమే కారణమని అన్నారు. కాగా, మోదీకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మంత్రి లోకేశ్ వెంకటపాలెంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు.
మోదీ పాలన స్ఫూర్తిదాయకం: అచ్చెన్న
గుజరాత్ సీఎం నుంచి ప్రధాని వరకు మోదీ 25ఏళ్ల పాలనా ప్రస్థానం స్ఫూర్తిదాయకమని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. దేశప్రయోజనాలు, ప్రజల సంక్షేమం లక్ష్యంగా ముందుకు సాగుతున్న మోదీ నాయకత్వం ప్రశంసనీయమని అభినందనలు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి..