భీమిలిలో గ్రీన్ డేటా సెంటర్
ABN , Publish Date - Nov 11 , 2026 | 01:37 AM
రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానాలు, భారీ పెట్టుబడులకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కొత్తగా ఆంధ్రప్రదేశ్ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్‌టెండెడ్ రియాలటీ పాలసీ (2026-31), ఆంధ్రప్రదేశ్ రోబోటిక్స్, ఫిజికల్ ఏఐ పాలసీ (2026-36)లను..
రూ.31,387 కోట్ల పెట్టుబడి.. వెయ్యి ఉద్యోగాలు
రాంబిల్లిలో 570 కోట్లతో మాడ్యులర్ విడిభాగాల తయారీ
నాయుడుపేటలో ఇంటిగ్రేటెడ్ మాన్యుఫాక్చరింగ్ కాంప్లెక్స్
‘కార్బన్ కాస్మో’ ప్రతిపాదనకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం
యానిమేషన్, రోబోటిక్స్ సహా 3 కొత్త పాలసీలకూ ఆమోదముద్ర
వివిధ ప్రాజెక్టులకు భూ కేటాయింపులు, ప్రోత్సాహకాలకూ అనుమతి
అమరావతి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానాలు, భారీ పెట్టుబడులకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కొత్తగా ఆంధ్రప్రదేశ్ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్‌టెండెడ్ రియాలటీ పాలసీ (2026-31), ఆంధ్రప్రదేశ్ రోబోటిక్స్, ఫిజికల్ ఏఐ పాలసీ (2026-36)లను.. ఆంధ్రప్రదేశ్ సెమీకండక్టర్, డిస్‌ప్లే ఫ్యాబ్ పాలసీ4.0(2024-29) ముసాయిదా సవరణలను ఆమోదించింది. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరిగింది. పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ క్లౌడ్‌హబ్ పాలసీ 2018-2020 కింద అదానీ గ్రూప్ సమర్పించిన ప్రతిపాదనపై సమగ్ర పరిశీలన చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖ జిల్లా భీమునిపట్నం నియోజకవర్గంలోని అమనం గ్రామంలో రూ.31,387 కోట్ల పెట్టుబడితో వెయ్యి ఉద్యోగాల సామర్థ్యం తో 512 మెగావాట్ల గ్రీన్ ఇంటిగ్రేటెడ్ ఏఐ డేటా సెంటర్ ఫెసిలిటీ ఏర్పాటుకు ఏఎం ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అనుమతి మంజూరు చేసింది. ఈ సంస్థకు ప్రోత్సాహకాలివ్వడానికి ఆమోదం తెలిపింది.
తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఐరన్ ఫాస్ఫేట్ ప్రికర్సర్, లిథియం ఐరన్ ఫాస్ఫేట్, క్యాథోడ్ యాక్టివ్ మెటీరియల్ తయారీ కోసం రూ.4వేల కోట్ల పెట్టుబడితో 700 మందికి ఉద్యోగాలిచ్చేలా ఇంటిగ్రేటెడ్ మాన్యుఫాక్చరింగ్ కాంప్లెక్స్‌ను ఏర్పాటుచేసే ‘కార్బన్ కాస్మో అడ్వాన్స్‌డ్ మెటీరియల్ ప్రైవేట్ లిమిటెడ్’ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రూ.570 కోట్ల పెట్టుబడి, 2,565 మందికి ఉపాధి కల్పనతో హైపర్‌స్కిల్, ఏఐ డేలా సెంటర్ల కోసం కీలకమైన మాడ్యులర్ విడిభాగాలను తయారు చేసేందుకు ‘ఈప్యాక్ డేటా సెంటర్ సొల్యూషన్స్’ సంస్థకు అనుమతి ఇచ్చింది.
మరిన్ని కీలక నిర్ణయాలు..
మంగళగిరి డీజీపీ కార్యాలయంలో ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్డు భద్రత డైరెక్టరేట్ ఏర్పాటులో భాగంగా డైరెక్టర్‌గా ఐజీపీ స్థాయి అధికారి నియామకం.
టీటీడీలో టైమ్ స్కేల్ విధానంలో ప్రధాన సన్నిధి యాదవ(గొల్ల), సన్నిధి యాదవ(గొల్ల) పోస్టులకు ఆమోదం.
దేవాదాయశాఖలో శిల్పి వింగ్‌లో ముఖ్య స్థపతి పోస్టును సూపరింటెండెంట్ ఇంజనీర్ క్యాడర్‌లో ఏర్పాటు.
ప్రాజెక్టులకు భూ కేటాయింపులు..
విజయవాడ చుట్టుపక్కల స్థానిక సంస్థల్లో రోజుకు ఉత్పత్తి అయ్యే 1,023 టన్నుల ఘన వ్యర్థ్యాలు శుద్ధి చేయడానికి.. 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటుకు ఇబ్రహీంపట్నంలో 5.50 ఎకరాల మున్సిపల్ కార్పొరేషన్ భూమి ఇంధన శాఖకు ఉచితంగా బదిలీ.
తిరుపతిలో రూ.700 కోట్ల పెట్టుబడితో 2,300 ఉద్యోగాలు సృష్టించే డిక్సన్ టెక్నాలజీస్‌కు భూ కేటాయింపు.
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని ఏపీ బల్క్ డ్రగ్ పార్కులో హెటెరో గ్రూపునకు 173.82 ఎకరాలు.
అనంతపురం జిల్లా వజ్రకరూరులో సౌర విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు వక్ఫ్ భూమి 30ఏళ్ల పాటు లీజుకు.
తిరుపతి జిల్లా నాయుడుపేటలోని వెబ్‌సోల్ రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించిన 123.45 ఎకరాల భూమి రద్దుచేసి, అదేచోట మెట్రో డెకరేటివ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించిన 50 ఎకరాలు ఉపసంహరించడానికి అనుమతి.
అనంతపురం జిల్లా తలారిచెరువు, ఊరుచింతల గ్రామాల్లోని 56.81 ఎకరాల ప్రభుత్వ భూమి ఎకరా రూ.31 వేల చొప్పున ఎన్‌ఆర్‌ఈడీసీఏపీకి లీజుకు అనుమతి.
విజయనగరం జిల్లా పోలిపల్లిలో 24.96 ఎకరాల ప్రభుత్వ భూమి రిలయన్స్ గిగా స్కేల్ ఏఐ డేటా సెంటర్ అభివృద్ధికి షరతులకు లోబడి కేటాయింపు.
అన్నమయ్య జిల్లాలో పలు గ్రామాలకు తాగునీటి సరఫరా ప్రాజెక్టు నిర్మాణాలకు 15 ఎకరాలు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు బదిలీ/ మార్కెట్ విలువపై జల్‌జీవన్ మిషన్‌కు కేటాయింపునకు ఆమోదం.
శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండలో ప్రభుత్వ ఐటీఐ కాలేజీ ఏర్పాటుకు ఉచితంగా రెండెకరాల భూమి.
అన్నమయ్య జిల్లా కుక్కరాజుపల్లెలో ఎకరా రూ.10 లక్షల మార్కెట్ విలువతో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు 20.98 ఎకరాల ప్రభుత్వ భూమి.
పోలవరం జిల్లా కన్నాపురంలో 23.55 ఎకరాల అటవీ భూమిని ఎన్‌హెచ్-30 ప్రాజెక్టు కోసం మళ్లించినందుకు పరిహారంగా అంతే భూమి నష్టపరిహార అటవీకరణ కింద అటవీ శాఖకు బదిలీ.
పరిశ్రమలకు ప్రోత్సాహకాలు..
పశ్చిమగోదావరి జిల్లాలో రూ.236.92 కోట్లతో 1,569 మందికి ఉపాధి కల్పించే కాటన్ నూలు తయారీ విస్తరణ యూనిట్ స్థాపనకు రవళి స్పిన్నర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రత్యేక ప్రోత్సాహకాలు.
ఎర్లీ బర్డ్ ప్రోత్సాహక పథకం కింద రాఠీ గ్రీన్ ఎనర్జీ, న్యూలాండ్ ల్యాబొరేటరీస్‌కు షరతులకు లోబడి మూలధన రాయితీ, ఇతర ప్రోత్సాహకాలు.
అన్నమయ్య జిల్లా ఐపీ తాటిగుంటపల్లిలో 56.82 ఎకరాల్లో సమీకృత పాదరక్షల భాగాల పార్కు అభివృద్ధి.
ఎన్టీఆర్ జిల్లా జయంతిపురంలో మహిళా పారిశ్రామిక పార్కుకు 30 ఎకరాలు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్‌కు ఎకరాకు 35.31 లక్షల రాయితీ ధరతో ప్లాట్ల కేటాయింపు.
ఎన్టీఆర్ జిల్లా చింతలపాడు వద్ద 10 టీపీడీ కంప్రెస్ట్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు ఎక్స్‌ఈఎంఎక్స్ అమరావతి సంస్థకు అనుమతి.. ప్రోత్సాహాకాలకూ ఆమోదం.
ఎన్టీఆర్ జిల్లా చీమలపాడులోని ఎనర్జీ ప్రాజెక్టును పొందుగల గ్రామానికి మార్చడానికి.. విక్సిట్ అగ్రి గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 20 టీపీడీ కంప్రెస్ట్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు అనుమతి; విజయనగరం జిల్లా నందం గ్రామంలో 15టీపీడీ కంప్రెస్ట్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు గ్రీన్‌వాయు బయో ఎనర్జీకి అనుమతి.
ఈ వార్తలనూ చదవండి:
విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవల రద్దు
30 ఏళ్లు దాటినా రాజీవ్ గాంధీ భౌతికకాయం ఫొటో చూడని సోనియా!