ఆశా వర్కర్లకు గ్రాట్యుటీ!
ABN , Publish Date - Oct 08 , 2026 | 04:06 AM
రాష్ట్రంలో ఆశావర్కర్లు విధినిర్వహణలో మరణిస్తే.. ఎండ్-ఆఫ్-సర్వీస్ ప్రయోజనంగా గ్రాట్యుటీ అందించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. సర్వీసు పూర్తి చేసుకున్న ప్రతి సంవత్సరానికీ రూ.5 వేల చొప్పున..
విధుల్లో మరణిస్తే ఏటా రూ.5 వేలు చెల్లింపు.. గరిష్ఠంగా లక్షన్నర వరకు.. మంత్రివర్గ ఆమోదం
‘తల్లికి వందనం’లో ఈ ఏడాది అదనంగా 58,601 మందికి లబ్ధి
రెండో దశలో 3,29,201 మందికి
సాయం విడుదలకు ఓకే
వంద పడకలకు రేపల్లె ఆస్పత్రి అప్‌గ్రేడ్
ఆర్టీఈ సవరణ ఆర్డినెన్స్‌కు అనుమతి
అమరావతి, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆశావర్కర్లు విధినిర్వహణలో మరణిస్తే.. ఎండ్-ఆఫ్-సర్వీస్ ప్రయోజనంగా గ్రాట్యుటీ అందించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. సర్వీసు పూర్తి చేసుకున్న ప్రతి సంవత్సరానికీ రూ.5 వేల చొప్పున.. గరిష్ఠంగా రూ.లక్షన్నర వరకు గ్రాట్యుటీ చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. 2026-27లో ఈ పథకం అమలుకు రూ.2.19 కోట్లు మంజూరుచేసింది. బుధవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆ సందర్భంగా తీసుకున్న 12 కీలక నిర్ణయాలను గృహనిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు తెలిపారు. 2026-27లో ‘తల్లికి వందనం’ పథకంలోకి అదనంగా 58,601 మంది అర్హులైన విద్యార్థులను తేవడానికి క్యాబినెట్ అనుమతి ఇచ్చిందన్నారు. ‘ఈ పథకం రెండో దశలో ఎంపికైన 3,29,201 మంది అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సాయం విడుదలకు ఆమోదం తెలిపింది. ఈ పథకం కోసం గతంలో ఇచ్చిన రూ.10,120.78 కోట్లను రూ.10,208.69 కోట్లకు పెంచాలని నిర్ణయించింది. లబ్ధి పొందే విద్యార్థుల సంఖ్య 67,47,190 నుంచి 68,05,791కు చేరనుంది’ అని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో పేదల ఇళ్ల స్థలాల సమస్యను 45 రోజుల్లో పరిష్కరించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
క్యాబినెట్ మరిన్ని నిర్ణలివీ..
బాపట్ల జిల్లా రేపల్లెలో ప్రస్తుత 30 పడకల కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌ను 100 పడకల ఏరియా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్. ఇందులో 66 అదనపు పోస్టుల మంజూరుకు ఆమోదం.
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగ, జువైనల్ హాస్టళ్లు సహా అన్ని సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, ఇతర ప్రభుత్వ సంస్థల్లో వసతి పొందుతున్న విద్యార్థులకు నెలవారీ డైట్ చార్జీలు 10 శాతం పెంపునకు ఆమోదం. అన్ని సంక్షేమ హాస్టళ్లకు ఏకరీతి రేట్ల అమలు.
గిరిజన విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా నాణ్యమైన శిక్షణ అందించేందుకు విశాఖపట్నంలోని మరికవలస ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు. దీని ద్వారా గిరిజన విద్యార్థులకు ఐఐటీ-జేఈఈ, నీట్ పరీక్షలకు ప్రత్యేక, సమగ్ర నివాస కోచింగ్ అందించేందుకు ఆమోదం. ఈ కేంద్రంలో 300 మంది బాలురు, 300 మంది బాలికలతో కలిపి 600 మంది ఇంటర్ విద్యార్థులకు ప్రవేశం.
రాష్ట్ర విద్యా వ్యవస్థకు సంబంధించి చట్టపరమైన నిబంధనల్లో అవసరమైన మార్పులు తేవటానికి ఏపీ విద్యా హక్కు చట్టంలోని పలు సెక్షన్ల సవరణకు ఆమోదం. ఇందుకు ఆర్డినెన్స్ జారీకి అనుమతి.
రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి ఉన్నత విద్యా సంస్థలు, నాణ్యమైన ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ఆకర్షించేందుకు, విద్యారంగంలో అంతర్జాతీయ భాగస్వామ్యాలు, పెట్టుబడులు, అత్యుత్తమ విద్యా అవకాశాలను పెంపొందించేందుకు ‘ఏపీ పాలసీ ఫర్ ప్రొమోషన్ ఫర్ ఫారిన్ హైయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్-2026’కు ఆమోదం.
ఉద్యాన పంటల సమాచారాన్ని సమగ్రంగా సేకరించి, నిర్వహించి, విశ్లేషించి.. రైతులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఏపీ హార్టికల్చర్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(ఏపీహెచ్‌ఐఎంఎస్)ను రూపొందించే పనులు వాసర్ ల్యాబ్ ఐటీ సొల్యూషన్స్‌కు అప్పగింత.
ప్రకాశం జిల్లా కొండపి గడియారం వారి కండ్రిక గ్రామంలో 7ఎకరాల వాగు పోరంబోకు భూమి వర్గీకరణను అసైన్డ్ వేస్ట్‌గా మార్చడానికి ఆమోదం. ఈ భూమిని ఏపీ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ ఆధ్వర్యంలోని బాలుర గురుకుల పాఠశాల, వసతి గృహానికి వినియోగించడానికి అనుమతి.
చిత్తూరు జిల్లా గుండ్లసాగరం పంచాయతీ పరిధిలోని నక్కనపల్లెలో 1.69ఎకరాల గ్రేజింగ్ గ్రౌండ్ పోరంబోకు భూమిని పంచాయతీరాజ్ చట్టం నుంచి ఉపసంహరించి, కుప్పం ఏరియా డెవల్‌పమెంట్ అథారిటీ ప్రాజెక్టుకు కేటాయించి, అధికారుల అతిథిగృహం నిర్మాణానికి ఆమోదం.
ఎన్టీఆర్ జిల్లాలో ప్రభుత్వ పోరంబోకు భూముల్లో దీర్ఘకాలంగా ఉన్న ఆక్రమణలు, భూముల వర్గీకరణ మార్పు, క్రమబద్ధీకరణ జీవోకు ఆమోదం.
కడప జిల్లా పాతూరులో 7.66 ఎకరాల ప్రభుత్వ భూమి అక్కడి కన్నేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కోసం దేవదాయ శాఖకు ఉచితంగా బదలాయింపు.
ఈ వార్తలనూ చదవండి..