39,436 కోట్ల ప్రతిపాదనలకు ఓకే
ABN , Publish Date - Apr 11 , 2026 | 03:30 AM
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు లక్ష్యంగా వివిధ శాఖల పరిధిలో రూ.39,436 కోట్ల విలువైన ప్రతిపాదనలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం
అకాడమీ నిర్మాణం కోసం సింధూకు ఇచ్చిన గడువు మరో ఏడాది పొడిగింపు
మార్కాపురం ప్రమాద మృతులకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద పరిహారం
క్యాబినెట్ సమావేశంలో నిర్ణయాలు
అమరావతి, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు లక్ష్యంగా వివిధ శాఖల పరిధిలో రూ.39,436 కోట్ల విలువైన ప్రతిపాదనలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్-2025 నిబంధనల ప్రకారం, రాష్ట్రంలోని నాలుగు జోన్లను ఆరు జోన్లుగా, రెండు మల్టీ జోన్లను మూడు మల్టీ జోన్లుగా మార్చుతూ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం పలు నిర్ణయాలు తీసుకుంది. ఆ నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారఽథి మీడియాకు వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక.. 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎ్‌సఐపీబీ) 260 ప్రాజెక్టులను ఆమోదించగా, వీటి ద్వారా కొత్తగా 9.62 లక్షల ఉద్యోగ అవకాశాలు లభించాయని మంత్రి తెలిపారు. డీఎస్సీ టీచర్ పోస్టులు, పోలీస్ ఉద్యోగాలతో పాటు జాబ్ క్యాలెండర్‌లో ఇచ్చే ఉద్యోగాలకు ఇవి అదనమన్నారు. ఉద్యోగ కల్పనకు సంబంధించిన జోన్ల విధానంలో మార్పులు చేసినట్టు మంత్రి తెలిపారు. ‘‘గతంలో జోన్1లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉండేవి. ఇప్పుడు మారిన జోన్ ప్రకారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి ఉంటాయి. జోన్2లో తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలు గతంలో ఉన్నాయి. వాటి బదులు అల్లూరి, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాలను చేర్చాం. జోన్3లో గతంలో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఉన్నాయి. వాటి బదులు పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలుంటాయి. జోన్4లో రాయలసీమ ఉమ్మడి జిల్లాల ఉండేవి. ఇప్పుడు గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను చేర్చాం. జోన్5లో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, జోన్6లో నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలను చేర్చాం’’ అని మంత్రి వివరించారు. వచ్చే నెల 15న నెల్లూరు జిల్లాలో డిఫెన్స్ రా మెటీరియల్ ప్లాంట్ నిర్మాణానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ద్వారా వర్చువల్‌గా శంకుస్థాపన చేయించే అవకాశం ఉందని తెలిపారు.
క్యాబినెట్ నిర్ణయాలు..
ఏపీఐఐసీకి ఉచితంగా కేటాయించిన 11,039 ఎకరాల భూమికి ఎకరాకు రూ.14లక్షల చొప్పున చెల్లించాలని నిర్ణయం.
నంద్యాల జిల్లాలోని ఆరు గ్రామాల్లో ఇకొరెన్ ఎనర్జీ 168.30మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్ట్ స్థాపనకు ఎన్‌ఆర్‌ఈడీసీఏపీకి 261.34ఎకరాల భూకేటాయింపు.
పల్నాడుజిల్లా మాచర్లలో 4.56సెంట్ల ప్రభుత్వభూమి కేంద్రీయ విద్యాలయ నిర్మాణానికి ఉచిత కేటాయింపు.
కడప జిల్లా దిగువ కల్వటాలలో 181.06 ఎకరాల ప్రభుత్వ భూమి సెయిల్ సోలార్‌కు లీజు పద్ధతిలో ఎకరాకు ఏడాదికి రూ.31వేల చొప్పున 30ఏళ్లకు కేటాయింపు.
కుప్పం మండలం ఎకార్లపల్లె, పెద్దబంగరునత్తలో మొత్తం 15.88 ఎకరాల ప్రభుత్వ భూమి ఇండస్ర్టీయల్ పార్కు ఏర్పాటుకు ఎకరాకు 90లక్షల చొప్పున ఏపీఐఐసీకి కేటాయింపు.
కుప్పం మండలం పెద్దబంగారునత్తంలో 1.99 ఎకరాల ప్రభుత్వ భూమి సెంట్రలైజ్డ్ కిచెన్ కోసం అక్షయపాత్ర ఫౌండేషన్‌కు లీజు పద్ధతిలో కేటాయింపు.
చిత్తూరు జిల్లా అమ్మవారిపేటలో 25 ఎకరాల ప్రభుత్వ భూమి ఇండస్ర్టీయల్ పార్కు కోసం ఏపీఐఐసీకి ఎకరా రూ.16లక్షల చొప్పున కేటాయింపు.
చిత్తూరు జిల్లా గుంటిపల్లెలో 79.03 ఎకరాల ప్రభుత్వ భూమి పర్యాటక ప్రాజెక్ట్ కోసం ఏపీ టూరిజం అథారిటీ సీఈవోకు ఎకరా రూ.27.88లక్షలకు కేటాయింపు.
వారసత్వ కట్టడాలు, ప్రదేశాల పరిరక్షణ, నిర్వహణకు ఏపీ టూరిజం పరిధిలో అడాప్ట్ మాన్యుమెంట్ పాలసీ ఆమోదం.
మార్కాపురం రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.ఐదు లక్షలు, క్షతగాత్రులకు రూ. రెండు లక్షల చొప్పున సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి విడుదల.
విజయవాడ యూబీఐ మిడ్ కార్పొరేట్ బ్రాంచ్ నుంచి రూ.2వేల కోట్ల ప్రత్యేక రుణం పొందటానికి ఏపీపవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు అనుమతి.
అనకాపల్లి జిల్లాలో ఏఐడేటా సెంటర్ ప్రాజెక్ట్‌కు సంబంధించి అదానీ ఇన్‌ఫ్రా, రైడెన్ ఇన్ఫోటెక్ అధికారిక పార్టనర్ అభ్యర్థనకు సమ్మతి.
క్వాంటమ్ కంప్యూటరింగ్ పాలసీ 2025-30 కింద ప్రోత్సాహాల కల్పనకు ఆమోదం.
అమరావతిలో ఏఐ గ్లోబల్‌కు 2.5 ఎకరాల భూ కేటాయింపు, ప్రోత్సాహకాల కల్పన.
విశాఖ చినగడిలిలో పీవీ సింధూ అకాడమీ, స్పోర్డ్స్ స్కూల్ ఏర్పాటుకు ఇచ్చిన గడువును మరో ఏడాది పొడిగింపు.
స్థానిక ఎన్నికలొస్తున్నాయ్.. సన్నద్ధం కండి: లోకేశ్
స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో రాబోతున్నాయని, అందరూ అప్రమత్తంగా ఉండాలని.. క్షేత్రస్థాయిలో క్యాడర్‌ను క్రియాశీలం చేయాలని లోకేశ్ ఆదేశించారు. క్యాబినెట్ భేటీకి ముందు ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రివర్గ సహచరులతో ఆయన బ్రేక్‌ఫాస్ట్ భేటీ నిర్వహించారు. మంత్రులు పార్టీ కార్యాలయంలో ఒక రోజు పూర్తిగా గడపాలని సూచించారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను ప్రైవేటుపరం చేస్తున్నారన్న వైసీపీ నేతల ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలని కోరారు. మత్య్సకారుల జీవనోపాధి దెబ్బతినకుండా స్థానికంగానే ఉపాధి కల్పించే చర్యలను వైసీపీ అడ్డుకుంటోందని మండిపడ్డారు.