'360° సమతుల్య బడ్జెట్': ఏపీ బడ్జెట్‌పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం..
ABN , Publish Date - Feb 14 , 2026 | 10:26 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దిక్సూచి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనియాడారు. విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, పరిశ్రమలు, మహిళా సాధికారత వంటి అన్ని రంగాలను సమతుల్యంగా అభివృద్ధి చేస్తూ ఈ బడ్జెట్ ముందుకు సాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అమరావతి, ఫిబ్రవరి 14: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ (శనివారం) అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రూ. 3,32,205 కోట్ల భారీ బడ్జెట్‌పై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం 'స్వర్ణాంధ్ర 2047' దిశగా బలమైన పునాది వేసిందని ఆయన కొనియాడారు.
బడ్జెట్ రూపకల్పనపై ప్రశంసలు
ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడులకు పవన్ కళ్యాణ్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ఈ బడ్జెట్ కేవలం అంకెలే కాదని, గ్రామం నుంచి గ్లోబల్ స్థాయి వరకు రాష్ట్రాన్ని తీసుకెళ్లే '360 డిగ్రీల గ్రోత్ మోడల్' అని ఆయన అభివర్ణించారు.
కీలక శాఖలకు కేటాయింపులపై హర్షం
తన శాఖలైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖలకు ప్రభుత్వం కేటాయించిన నిధులపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు గ్రామీణాభివృద్ధికి ఊతమిచ్చేలా (Rs.22,942 కోట్లు)కేటాయించడం శుభపరిణామమని పవన్ చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో గ్రామాలే కీలకమనే విషయాన్ని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసిందన్నారు. ఈ నిధులతో గ్రామీణ రహదారులు, ఇంటింటికీ తాగునీరు, ఉపాధి అవకాశాలు, స్థానిక పాలన మరింత బలోపేతం అవుతాయని పవన్ పేర్కొన్నారు.
హరిత ఆంధ్రప్రదేశ్ దిశగా (రూ. 714 కోట్లు):
పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖలకు కేటాయించిన నిధులు రాష్ట్ర పర్యావరణ సమతుల్యతకు తోడ్పడతాయని పవన్ అన్నారు. 2030 నాటికి 37శాతం, 2047 నాటికి 50శాతం మేర అటవీ విస్తీర్ణాన్ని (Green Cover) పెంచి, ఆంధ్రప్రదేశ్‌ను హరితమయంగా మార్చడమే లక్ష్యమని ఆయన వివరించారు.
వికసిత్ భారత్ - స్వర్ణాంధ్ర భాగస్వామ్యం
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ 'వికసిత్ భారత్ 2047' స్వప్నంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన భాగస్వామిగా ఉండేలా ఈ బడ్జెట్ రూపొందించబడిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. విద్య, ఆరోగ్యం, పరిశ్రమలు, మహిళా సాధికారత వంటి అన్ని రంగాలను సమతుల్యంగా అభివృద్ధి చేస్తూ ఈ బడ్జెట్ ముందుకు సాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేంద్ర క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలకు ఆమోదం..
ముంబైలో కుప్పకూలిన మెట్రో పిల్లర్.. ఏం జరిగిందంటే.?