Share News

పెట్టుబడుల పండగ

ABN , Publish Date - Nov 11 , 2026 | 01:41 AM

పెట్టుబడుల పండగ AP Attracts 17.2 Lakh Crore Investments in Two and a Half Years

పెట్టుబడుల పండగ

  • వాస్తవ రూపంలోకి వస్తున్న ఒప్పందాలు

  • 2024 జూన్‌ నుంచి 526 పెట్టుబడులు

  • కార్యరూపం.. వాటి విలువ 17 లక్షల కోట్లు

  • పరిశీలనలో మరో 188 ప్రతిపాదనలు

  • రేపటి నుంచే విశాఖలో పెట్టుబడుల సదస్సు

  • రెండున్నరేళ్లలో... రయ్‌రయ్‌!

  • పెట్టుబడుల ప్రతిపాదనలు : 714

  • కార్యరూపం దాల్చినవి :526

  • వీటి విలువ: రూ.17.2 లక్షల కోట్లు

  • యువతకు ఉద్యోగాలు: 19 లక్షలు

  • పెట్టుబడి ప్రాజెక్టుల పురోగతి: 74శాతం

  • పరిశీలనలో ప్రతిపాదనలు: 188

  • వీటి విలువ: రూ.5.4 లక్షల కోట్లు

అమరావతి/విశాఖపట్నం, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. 2024 లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి 714 పెట్టుబడుల ప్రతిపాదనలు రాగా.. వీటిలో తాజాగా 526 ప్రతిపాదనలు కార్యరూపం దాల్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది. వీటి విలువ సుమారు రూ.17.2లక్షల కోట్లు ఉంటుందని, 19.3లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వివరించింది. మొత్తం పెట్టుబడుల ప్రతిపాదనల్లో ఇవి 74 శాతం ఉండగా, పెట్టుబడుల విలువలో 76 శాతం మేరకు ఉందని పేర్కొంది. ఇప్పటి వరకు వచ్చిన మొత్తం పెట్టుబడుల ప్రతిపాదనల విలువ రూ.22.6 లక్షల కోట్లుగా ఉందని తెలిపింది.

తాజాగా 526 ప్రతిపాదనలు కార్యరూపం దాల్చగా.. మరో 188 వివిధ దశల్లో పరిశీలనలో ఉన్నట్టు పేర్కొంది. వీటి విలువ రూ.5.4 లక్షల కోట్లుగా ఉందని తెలిపింది. ఇక, 303 ప్రాజెక్టులకు సంబంధించిన పెట్టుబడుల విలువ రూ.7.1 లక్షల కోట్లని, వీటిద్వారా 7.7 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొంది. ఆయా ప్రాజెక్టుల పనులు కొన్ని ప్రారంభంకాగా, మరికొన్ని ప్రారంభ దశలో ఉన్నాయని సర్కారు తెలిపింది. విశాఖలో గురువారం నుంచి 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో పెట్టుబడులకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం వెల్లడించింది.


సదస్సుకు ఏర్పాట్లు పూర్తి

రాష్ట్ర ప్రభుత్వం, భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సంయుక్తంగా చేపట్టనున్న 31వ భాగస్వామ్య పెట్టుబడిదారుల సదస్సుకు విశాఖపట్నంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో గురు, శుక్రవారాల్లో జరిగే ఈ సదస్సుకు కేంద్ర మంత్రులు అమిత్‌షా, పియూష్‌ గోయల్‌, కింజరాపు రామ్మోహన్‌నాయుడు, శర్బానంద సోనోవాల్‌, చిరాగ్‌ పాశ్వాన్‌, ప్రహ్లాద్‌ జోషి, నితిన్‌ గడ్కరీ ముఖ్య అతిథులుగా వస్తున్నారు. ముగింపు రోజున ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ రానున్నారు. అలాగే, సింగపూర్‌, కెనడా, యూఏఈ, బహ్రెయిన్‌, ఈజిప్ట్‌ తదితర 18 దేశాల నుంచి మంత్రులు హాజరవుతున్నారు.

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం, ఏడీబీల ప్రతినిధులు, జపాన్‌, రష్యా, ఐర్లాండ్‌ తదితర దేశాల నుంచి రాయబారులు విచ్చేస్తున్నారు. జీఎంఆర్‌, కియా, భారత్‌ ఫోర్జ్‌, రెన్యూ, అపోలో, వాల్‌మార్ట్‌, స్కైరూట్‌, అగ్నికుల్‌, గెలాక్సీ తదితర పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు రానున్నారు. ఈ సదస్సులో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ సమక్షంలో 160 వరకు ఎంవోయూలు కుదుర్చుకోవాలని, తద్వారా రూ.11 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకురావాలని నిర్ణయించారు.

వాటి ద్వారా రాష్ట్రంలో 2.5 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈసారి ఆరు రంగాల ద్వారా అధిక పెట్టుబడులను రాబట్టాలని నిర్ణయించారు.. పునరుత్పాదక, హరిత ఇంధనం, ఖనిజాలు, జనరల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌, ఆటోమొబైల్స్‌, ఎలక్ట్రికల్‌ వెహికల్స్‌, అంతరిక్ష, రక్షణ, ఐటీ, డేటా సెంటర్స్‌ను కీలక రంగాలుగా ఎంచుకున్నారు.

ముందే రోడ్‌ షోలు

31వ పెట్టుబడిదారుల సదస్సును విజయవంతంగా నిర్వహించాలని ముందస్తు ప్రణాళిక రూపొందించుకుని కార్యక్రమాలు, రోడ్‌ షోలు, ద్వైపాక్షిక సమావేశాలు, కంపెనీల ప్రతినిధులతో భేటీలు నిర్వహించారు. సింగపూర్‌, కొరియా, తైవాన్‌, స్వీడన్‌, జపాన్‌ తదితర దేశాలతో పాటు దేశీయంగా చెన్నై, కోయంబత్తూర్‌, బెంగళూరు, అహ్మదాబాద్‌, హైదరాబాద్‌, ముంబైలలో రోడ్‌ షోలు నిర్వహించారు. 127 కంపెనీలతో చర్చలు జరిపారు. 17 రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహించారు. ప్రధాన సదస్సుకు ముందు అక్టోబరు 7, 12, 16, 23, 26 తేదీల్లో విశాఖపట్నం, కాకినాడ, అమరావతి, అనంతపురం, తిరుపతిలతో ప్రాంతీయ సదస్సులు నిర్వహించారు. వాటిలో రూ.85,561 కోట్ల పెట్టుబడులు, ఆయా సంస్థల్లో 1,56,241 మందికి ఉద్యోగ అవకాశాలు లభించేలా 195 ఎంఓయూలు చేసుకున్నారు.


అంతర్జాతీయ ప్రతినిధులతో సీఎం భేటీలు

సీఐఐ సమ్మిట్‌లో భాగంగా సీఎం చంద్రబాబు పలు దేశాల మంత్రులు, రాయబారులు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతోనూ సమావేశమవుతారు. అలాగే జపాన్‌, రష్యా రాయబారులతో చర్చించనున్నారు. వీరితో పాటు ప్రపంచ మేధోసంపత్తి సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ డారెన్‌ టాంగ్‌తో కూడా ప్రత్యేకంగా భేటీ కానున్నారు. అలాగే జపాన్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ స్ట్రాటజీ చైర్మన్‌తో సీఎం భేటీ అవుతారు.

సీఐఐ భాగస్వామ్య సదస్సు నేపథ్యంలోనే మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ ప్రత్యేకంగా ఓ సమావేశం నిర్వించనున్నారు. దీనికి కూడా సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో తలెత్తుతున్న పరిణామాలు.. రాష్ట్రంలోని పలు రంగాలపై పడుతున్న ప్రభావాన్ని కేంద్రమంత్రుల దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లనున్నారు.

నేడు చంద్రబాబు విస్తృత సమావేశాలు

సీఐఐ సదస్సుకు ఒకరోజు ముందుగానే బుధవారం సీఎం చంద్రబాబు అంతర్జాతీయ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో అమరావతి, విశాఖల్లో సమావేశాలు నిర్వహించనున్నారు. సింగపూర్‌ మంత్రి గాన్‌ సియో హువాంగ్‌తో అమరావతిలో సమావేశమవుతారు. అనంతరం విశాఖ చేరుకుని డబ్ల్యూఐపీవో డైరెక్టర్‌ జనరల్‌ డారెన్‌ టాంగ్‌, జపాన్‌ రాయబారి కీచి ఒనో, యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్‌ తౌక్‌ అల్‌ మార్రీ, రెన్యూ సంస్థ సీఈవో సుమంత్‌ సిన్హాలతో బుధవారమే సమావేశం కానున్నారు. బుధవారం సాయంత్రం అంతర్జాతీయ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తల కోసం ఏర్పాటు చేసిన స్వాగత విందులో పాల్గొంటారు.


గత ఏడాది సదస్సులో..

విశాఖపట్నంలో గతేడాది నవంబరులో నిర్వహించిన 30వ సీఐఐ సదస్సులో రూ.10,50,976 కోట్ల పెట్టుబడులు, వాటిద్వారా 10,77,207 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి 463 ఎంవోయూలు కుదుర్చుకున్నారు. పర్యాటకరంగంలో 83, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ 30, ఏపీసీఆర్‌డీఏ 20, వైద్య, ఆరోగ్య రంగం 10, పురపాలన పట్టణాభివృద్ధి 8, టెక్స్‌టైల్స్‌ 6, ఉన్నత విద్య, మైన్స్‌ తదితర రంగాల్లో 4 ఒప్పందాలు జరిగాయి. వీటిలో సగానికి పైగా పునరుత్పాదక ఇంధన రంగానికి చెందినవి.

రాకెట్‌ వేగంతో.. పుంజుకుని!

పెట్టుబడుల సాధనలో ఏపీ ర్యాకెట్‌ వేగంతో పుంజుకుందని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా అధ్యయనం పేర్కొంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25 శాతం ఏపీ రాబట్టినట్టు తెలిపింది. అదేసమయంలో ఒక్క 2026లోనే రూ.8.95 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు ఏపీకి వచ్చాయని వివరించింది. దీంతో పెట్టుబడుల సాకారంలో గతంలో 9వ స్థానంలో ఉన్న రాష్ట్రం 2వ స్థానంలోకి ఎగబాకిందని అధ్యయనం వివరించింది.

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లోనూ..

కీలకమైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో రాష్ట్రం మెరుపు వేగంతో పుంజుకుందని ప్రభుత్వం తెలిపింది. 2023-24 మధ్య రూ.862 కోట్ల మేరకు(92 మిలియన్‌ డాలర్లు) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయని పేర్కొంది. అయితే, 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.5.62 వేల కోట్లు(600 మిలియన్‌ డాలర్లు) వచ్చాయని వివరించింది.

ఈ వార్తలనూ చదవండి:

విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవల రద్దు

30 ఏళ్లు దాటినా రాజీవ్ గాంధీ భౌతికకాయం ఫొటో చూడని సోనియా!

Updated Date - Nov 11 , 2026 | 02:27 AM