Share News

రైతులకు ఆసరాగా పంటల బీమా

ABN , Publish Date - Nov 13 , 2026 | 04:33 AM

అతివృష్టి, అనావృష్టి వంటి పరిస్థితులతో నష్టపోతున్న రైతులకు పంటల బీమా ఆసరాగా నిలుస్తుందని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్‌ చెప్పారు.

రైతులకు ఆసరాగా పంటల బీమా

  • పీఎంఎఫ్‌బీవైపై శిక్షణలో స్పెషల్‌ సీఎస్‌ రాజశేఖర్‌

అమరావతి, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): అతివృష్టి, అనావృష్టి వంటి పరిస్థితులతో నష్టపోతున్న రైతులకు పంటల బీమా ఆసరాగా నిలుస్తుందని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్‌ చెప్పారు. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకం అమలుపై విజయవాడలో రెండు రోజులపాటు జరిగే శిక్షణ కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించి, ప్రసంగించారు.

ఈ ఏడాది ఎల్‌నినోతో రాయలసీమలో వర్షాభావ పరిస్థితులతో పంటలు దెబ్బతినగా, కోస్తాలో వరుసగా అర్నబ్‌, మురసు తుఫాన్ల ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. ప్రకృతి విపత్తులతో రైతులు ఆర్థికంగా దెబ్బతినకుండా, ప్రత్యామ్నాయంగా పంటల బీమా పథకాన్ని వినియోగించుకోవాలన్నారు. దీనిపై రైతులకు పూర్తి అవగాహన కల్పించడానికి ప్రభుత్వం మాస్టర్‌ ట్రైనర్లను ఏర్పాటు చేసింది. శిక్షణ పొందిన ట్రైనర్లు క్షేత్రస్థాయిలో పంటల బీమాపై రైతులకు సమగ్ర అవగాహన కల్పించి, సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు.

వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ మనజీర్‌ జిలానీ మాట్లాడుతూ మాస్టర్‌ ట్రైనర్లకు జాతీయ బీమా అకాడెమీ సర్టిఫికెట్లు ఇస్తుందన్నారు. ఉద్యాన శాఖ డైరెక్టర్‌ శ్రీనివాసులు మాట్లాడుతూ ఉద్యాన పంటల రైతులు వాతావరణ ఆధారిత పంటల బీమాను వినియోగించుకోవాలన్నారు. పంట దిగుబడి, వాతావరణ ఆధారిత పంటల బీమా, పంట కోత ప్రయోగాలు, జాతీయ బీమా లాగిన్‌, ఉపగ్రహ ఆధారిత దిగుబడి అంచనాలు, క్లయిమ్‌ సెటిల్‌మెంట్లపై ఆర్థిక, గణాంక శాఖ అధికారులు, కేంద్ర వ్యవసాయ శాఖ ప్రాజెక్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ అధికారులు శిక్షణ ఇస్తున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

విశాఖలో 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2026 ప్రారంభం

ఏపీకి పెట్టుబడుల వరద.. తొలిరోజే రూ.1.57 లక్షల కోట్ల ఒప్పందాలు

Updated Date - Nov 13 , 2026 | 06:10 AM