Annamayya District Headquarters: అన్నమయ్య జిల్లా కేంద్రం మార్పుపై హైకోర్టులో పిల్
ABN , Publish Date - Jan 03 , 2026 | 07:41 PM
అన్నమయ్య జిల్లా పరిపాలనా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ మార్పు ప్రజలకు అసౌకర్యంగా ఉందని న్యాయవాది బి. వెంకటనారాయణ రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు.
అమరావతి: అన్నమయ్య జిల్లా పరిపాలనా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చడాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలైంది. ఈ మార్పు వల్ల ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందని పేర్కొంటూ న్యాయవాది బి. వెంకటనారాయణ రెడ్డి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.
జిల్లా కేంద్రం మార్పు చేస్తూ రెవెన్యూ శాఖ గత ఏడాది డిసెంబర్ 30న జారీ చేసిన జీఓతో పాటు గెజిట్ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు. జిల్లా కేంద్రాన్ని మార్చే విషయంలో ఏపీ డిస్ట్రిక్ ఫార్మేషన్ యాక్ట్–1974లోని సెక్షన్ 3(5) ప్రకారం ముందుగా ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉన్నప్పటికీ, అలా చేయలేదని పిటిషనర్ పేర్కొన్నారు.
అలాగే ప్రజలు, ఇతర భాగస్వామ్య పక్షాల నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేదా సూచనలు కూడా స్వీకరించలేదని పిటిషన్‌లో వివరించారు. 2022లో జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా అన్నమయ్య జిల్లా పరిపాలనా కేంద్రంగా రాయచోటినే కొనసాగించాలని కోర్టును కోరారు.
తాజాగా రెవెన్యూ శాఖ జారీ చేసిన జీఓ, గెజిట్ నోటిఫికేషన్‌పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కూడా పిటిషన్‌లో అభ్యర్థించారు. ఈ కేసులో రెవెన్యూ శాఖ, సాధారణ పరిపాలనా శాఖ ముఖ్యకార్యదర్శులు, భూ పరిపాలనా శాఖ ప్రధాన కమిషనర్‌తో పాటు అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ను ప్రతివాదులుగా పిటిషనర్ చేర్చారు.