Share News

పోటెత్తిన పల్లె ఓటరు

ABN , Publish Date - Nov 06 , 2026 | 04:30 AM

పల్లె ఓటరులో చైతన్యం వెల్లివిరిసింది. ఓటేయడానికి పట్టణ ఓటర్ల కంటే గ్రామీణులు అధిక ఉత్సాహం చూపారు. చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. అర్ధరాత్రి వరకు అందిన వివరాల ప్రకారం..

పోటెత్తిన పల్లె ఓటరు

  • రాష్ట్రవ్యాప్తంగా 70 శాతం పైగా పోలింగ్‌.. మున్సిపోల్స్‌ కంటే 8శాతం అధికం

  • మొత్తం 578 జడ్పీటీసీ, 7724 ఎంపీటీసీలకు ఓటింగ్‌

  • పోలింగ్‌ కేంద్రాలకు భారీగా తరలిన జనం

  • విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచీ వచ్చిన ఓటర్లు

  • గ్రామాలకు మళ్లిన యువ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు

  • విశాఖ జిల్లాలో అత్యధికంగా 83.53శాతం పోలింగ్‌

  • అతి తక్కువగా శ్రీకాకుళం జిల్లాలో 57.30 శాతం

  • వేర్వేరు కారణాలతో వాయిదా పడినచోట నేడు పోలింగ్‌

అమరావతి, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): పల్లె ఓటరులో చైతన్యం వెల్లివిరిసింది. ఓటేయడానికి పట్టణ ఓటర్ల కంటే గ్రామీణులు అధిక ఉత్సాహం చూపారు. చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. అర్ధరాత్రి వరకు అందిన వివరాల ప్రకారం.. సుమారు 70.30 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈ నెల 1న జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో 62.16శాతం ఓటింగ్‌ మాత్రమే జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో అంతకంటే 8.14 శాతం ఎక్కువగా పోలింగ్‌ నమోదవడం విశేషం. అయితే మురసు తుఫాను ప్రభావిత జిల్లాల్లో ఇంకా సాధారణ పరిస్థితులు నెలకొనకపోవడం, విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ జరగకపోవడం.. పోలింగ్‌ కేంద్రాలు, రహదారులు వరద ముంపులోనే ఉండడం.. మొదలైన కారణాలతో అక్కడ తక్కువ ఓటింగ్‌ జరిగింది. లేదంటే పోలింగ్‌ శాతం మరింత పెరిగి ఉండేది.

రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 582 జడ్పీటీసీ, 7767 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ జరగాల్సి ఉంది. వీటిలో 578 జడ్పీటీసీ, 7724 ఎంపీటీసీ స్థానాలకు మాత్రమే గురువారం పోలింగ్‌ జరిగింది. మొత్తం 2.55 కోట్ల మంది ఓటర్లకు గాను గురువారం రాత్రి 10.30 గంటల సమయానికి 1.79 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. తుఫాన్‌ ప్రభావంతో ఏలూరు జిల్లా వేలేరుపాడు, బుట్టాయగూడెం, పోలవరం, జీలుగుమిల్లి మండలాల్లో 4 జడ్పీటీసీ, 43 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలను శుక్రవారానికి వాయిదా వేశారు. విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 83.53 శాతం మంది ఓట్లేయగా.. అతి తక్కువగా శ్రీకాకుళం జిల్లాలో 57.30శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.


కాగా.. రాష్ట్రంలో కొన్నిచోట్ల బూత్‌ల స్వాధీనం వంటి ఘటనలతో ఆయా చోట్ల శుక్రవారం ఎన్నికలు నిర్వహించనున్నారు. కర్నూలు జిల్లా కోసిగి జడ్పీటీసీ స్థానంలో ఆర్లబండ రెండో నంబర్‌ పోలింగ్‌ కేంద్రంలో, అనంతపురం జిల్లా కూడేరు మండలం మారుట్ల 8వ నంబర్‌ పోలింగ్‌ బూత్‌లో.. ఇదే జిల్లా పెద్దవడుగూరు మండలం చిత్రచేడులోని 46,47 నంబర్ల పోలింగ్‌ బూత్‌లలో, శ్రీకాకుళం మండలం పొన్నం రెండో నంబర్‌ పోలింగ్‌ కేంద్రంలో, మార్కాపురం జిల్లా పుల్లలచెరువు జడ్పీటీసీ పరిధిలో గంగవరం ఐదో నంబర్‌ పోలింగ్‌ బూత్‌లో.. మొత్తం 6 పోలింగ్‌ కేంద్రాల్లో శుక్రవారం మళ్లీ పోలింగ్‌ జరగనుంది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఓ ప్రకటన విడుదల చేసింది.

గోదారి ఓటింగ్‌కు తుఫాను దెబ్బ

పరిషత్‌ ఎన్నికల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పోలింగ్‌ శాతం తగ్గిపోయింది. వరుసగా అర్నబ్‌, మురసు తుఫాన్లు ఉమ్మడి జిల్లాపై తీవ్ర ప్రభావం చూపాయి. ముఖ్యంగా కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పలు పోలింగ్‌ కేంద్రాల పరిధిలో గడచిన మూడ్రోజుల్లో కురిసిన అతి భారీ వర్షాలకు ఎక్కడికక్కడ వరద నీరు చుట్టుముట్టింది. పోలింగ్‌ ప్రారంభమైన సమయానికి కూడా బూత్‌లకు వెళ్లే దారుల్లో వరద ముంపు తగ్గలేదు. దీంతో చాలామంది ఇళ్ల నుంచి కదల్లేదు. కాకినాడ జిల్లాలో ఆరు మండలాల్లోని లోతట్టు ప్రాంతాల్లో నీరు భారీగా ప్రవహిస్తోంది. కోనసీమ జిల్లాలో తుఫాను ధాటికి వేలాది చెట్లు, విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి. ఇప్పటికీ విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ పూర్తిస్థాయిలో జరగలేదు. ఈ ఇబ్బందుల్లో ఓటువేయడానికి కొందరు నిరాసక్తత కనబరిచారు. పలు పోలింగ్‌ కేంద్రాల్లో ఓట్ల స్లిప్పులు కూడా పూర్తిగా ఓటర్లకు అందలేదు. ఇవన్నీ కలిపి ఈ జిల్లాలో తక్కువ పోలింగ్‌ శాతం నమోదవడానికి కారణమయ్యాయి.

ఈ వార్తలనూ చదవండి:

ఓటెత్తిన పల్లెలు

అభివృద్ధి చేయలేదని.. ఎన్నికల బహిష్కరణ

Updated Date - Nov 06 , 2026 | 06:20 AM