నేడు అల్పపీడనం
ABN , Publish Date - Oct 13 , 2026 | 03:58 AM
మలక్కా జలసంధి పరిసరాల నుంచి ఉపరితల ఆవర్తనం సోమవారం దక్షిణ అండమాన్ సముద్రంలో ప్రవేశించింది. దీని ప్రభావంతో మంగళవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది.
మూడు రోజుల్లో ఈశాన్య రుతుపవనాల రాక
విశాఖపట్నం, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): మలక్కా జలసంధి పరిసరాల నుంచి ఉపరితల ఆవర్తనం సోమవారం దక్షిణ అండమాన్ సముద్రంలో ప్రవేశించింది. దీని ప్రభావంతో మంగళవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తర్వాత రెండు, మూడు రోజులు పశ్చిమ వాయవ్యంగా పయనించే క్రమంలో బలపడనున్నది. దీని ప్రభావంతో ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు కోస్తా, రాయలసీమల్లో వర్షాలు, అక్కడక్కడ భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా సోమవారం అనేక ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొంది. ఎండ తీవ్రత పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. కర్నూలులో 37.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఈశాన్య సీజన్‌లో సాధారణ వర్షాలు..
నైరుతి రుతుపవనాలు సోమవారం ఏపీ, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక , ఈశాన్య భారతంలోని పలు ప్రాంతాల నుంచి కూడా నిష్క్రమించాయి. రానున్న రెండు, మూడు రోజుల్లో దేశంలోని మిగిలిన ప్రాంతాల నుంచి పూర్తిగా వైదొలగనున్నాయి. అదే సమయంలో ఈశాన్య రుతుపవనాలు తమిళనాడు, రాయలసీమ, కోస్తాంధ్ర, కేరళ, దక్షిణ కర్ణాటకలో ప్రవేశించేందుకు వాతావరణం అనుకూలంగా ఉంది. ఈశాన్య రుతుపవనాల కాలం(అక్టోబరు నుంచి డిసెంబరు వరకు)లో బంగాళాఖాతంలో తుఫానులు ఏర్పడటం, తూర్పుగాలులతో దక్షిణ భారతంలో వర్షాలు కురుస్తుంటాయి. దక్షిణ భారతంలో ఏడాదిలో కురిసే వర్షపాతంలో 30 శాతం, ప్రత్యేకించి తమిళనాడులో 48 శాతం ఈశాన్య రుతుపవనాల సీజన్‌లోనే నమోదవుతుంటుంది. దక్షిణ భారతంలోని పలు రాష్ట్రాల్లో ఈనెల 15వ తేదీ తర్వాత భారీవర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ వార్తలనూ చదవండి: