Share News

కస్తూర్బా విద్యాలయాలు సరికొత్తగా!

ABN , Publish Date - Oct 16 , 2026 | 05:26 AM

బాలికలకు విద్యనందించే కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఉత్తమ వసతులు ఏర్పాటు చేసి, నాణ్యమైన ఆహారం అందిస్తూ..

కస్తూర్బా విద్యాలయాలు సరికొత్తగా!

  • కార్పొరేట్‌కు దీటుగా చదువులు

  • లేబొరేటరీల సాయంతో బోధన

  • మెరుగైన వసతులు.. నాణ్యమైన ఆహారం

  • సీసీటీవీలతో క్యాంప్‌సల పర్యవేక్షణ

  • ఏటా మెరుగవుతున్న టెన్త్‌, ఇంటర్‌ ఫలితాలు

  • బాలికల విద్యపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

(అమరావతి-ఆంధ్రజ్యోతి): బాలికలకు విద్యనందించే కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఉత్తమ వసతులు ఏర్పాటు చేసి, నాణ్యమైన ఆహారం అందిస్తూ.. లేబొరేటరీల సాయంతో విద్యా బోధన చేస్తూ.. ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా విద్యాలయాలను తీర్చిదిద్దింది. కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ సంస్కరణలతో విద్యాలయాల్లో బాలికల ప్రవేశాలు పెరగడమేగాకుండా, కార్పొరేట్‌ స్థాయిలో టెన్త్‌, ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల్లో విద్యార్థినులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు.

పెరుగుతున్న అడ్మిషన్లు

రాష్ట్రంలో 352 టైప్‌-3, 216 టైప్‌-4 కేజీబీవీలు ఉన్నాయి. టైప్‌-3 కేజీబీవీల్లో 2023-24 విద్యా సంవత్సరంలో 89,962 మంది విద్యార్థులు చదివితే ప్రస్తుతం అది 95,464కు పెరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024-25లో 90,963 మంది, 2025-26లో 92,198 మంది విద్యార్థులతో ఏటా అడ్మిషన్లు పెరిగాయి. టైప్‌-3 కేజీబీవీల్లో 98,560 సీట్లు ఉండగా దాదాపుగా అన్నీ భర్తీ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కేజీబీవీల్లో ప్రధాన సమస్యగా ఉన్న బోధనా సిబ్బంది పెంపుపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. గత మూడేళ్ల నుంచి ప్రతి ఏటా సిబ్బందిని నియమిస్తూ లోటును భర్తీ చేస్తోంది. ఫలితంగా బోధనలో నాణ్యత పెరిగి ఫలితాలు మెరుగుపడుతున్నాయి.


విద్యార్థుల ‘విజయపథం’

కార్పొరేట్‌ విద్యా సంస్థల తరహాలో విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంపొందించేందుకు ‘విజయపథం’ పేరుతో ఓ కార్యక్రమాన్ని అధికారులు రూపొందించారు. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు దీనిని అమలు చేస్తున్నారు. టెన్త్‌, ఇంటర్‌ విద్యార్థులకు ప్రతి సోమవారం ఒక సబ్జెక్టులో వంద మార్కులకు గ్రాండ్‌ టెస్ట్‌ నిర్వహిస్తున్నారు. అలాగే 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు ప్రతి మంగళవారం ఒక సబ్జెక్టుపై టెస్ట్‌ నిర్వహిస్తున్నారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యం ఆధారంగా నాలుగు గ్రూపులుగా ఏర్పాటుచేసి వెనకబడిన విద్యార్థులపై దృష్టి పెడుతున్నారు. విద్యార్థుల సామర్థ్యాలపై డిజిటల్‌ అసె్‌సమెంట్‌ చేస్తున్నారు. గణితం, సైన్స్‌పై విద్యార్థులు, ఉపాధ్యాయుల ఫీడ్‌బ్యాక్‌ తీసుకుని మరింత మెరుపడేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

పెరిగిన ఉత్తీర్ణత శాతం

కూటమి ప్రభుత్వం వచ్చాక ఫలితాల్లో అనూహ్య పెరుగుదల కనిపిస్తోంది. టెన్త్‌లో 2021-22లో 64.07శాతం మంది ఉత్తీర్ణులైతే, 2025-26లో అది 88.99 శాతానికి పెరిగింది. ఇంటర్‌ ఫస్టియర్‌ ఉత్తీర్ణత శాతం 2021-22లో 42.33 శాతంగా ఉంటే, 2025-26లో అది 84.78శాతానికి పెరిగింది. ఇంటర్‌ సెకెండియర్‌ ఉత్తీర్ణత 2021-22లో 58.94శాతం ఉండగా.. 2025-26లో 88.77 శాతానికి చేరింది.

కేంద్రీకృత సమీకరణ విధానం

కేజీబీవీల్లో విద్యార్థులకు అందించే ఆహారం, ఇతర అవసరాల టెండర్లను కేంద్రీకృతం చేశారు. గతంలో 562 కేజీబీవీలకు 200 మందికిపైగా కాంట్రాక్టర్లు వివిధ వస్తువులు సరఫరా చేసేవారు. ఫలితంగా తక్కువ నాణ్యతగల ఆహార వస్తువులు, తక్కువ పరిమాణం ఉన్న గుడ్లు, నాణ్యతలేని పండ్లు సరఫరా అయ్యేవి. వస్తువుల సమీకరణ ధరల్లోనూ వ్యత్యాసం ఏర్పడింది. ఈ సమస్యను అధిగమించేందుకు టెండర్లను సమగ్రశిక్ష కేంద్రీకృత విధానంలోకి మార్చింది. ఈ విధానంతో ఏకీకృత డిజిటల్‌ ఆడిట్‌ జరుగుతోంది. నాణ్యతలో రాజీలేకుండా ఆహార సంబంధిత వస్తువులు సరఫరా చేస్తున్నారు.


సీసీటీవీల పర్యవేక్షణలో క్యాంపస్‌లు

కేజీబీవీ ప్రాంగణాలను సీసీటీవీల పర్యవేక్షణలోకి తీసుకొచ్చారు. 568 కేజీబీవీలు, హాస్టళ్లలోనూ సీసీటీవీలు ఏర్పాటు చేశారు. ప్రతి విద్యార్థిని భద్రత కోసం అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ఇందుకోసం భద్రత, రక్షణ అంశంపై ఈ ఏడాది ప్రత్యేక ఎస్‌వోపీ జారీ చేశారు. ఎక్కడైనా విద్యార్థి కనిపించకపోతే వెంటనే తల్లిదండ్రులకు లేదా సంరక్షకులకు 30 నిమిషాల్లో సమాచారం అందించేలా ఎస్‌వోపీ రూపొందించారు. అలాగే పోలీసులకూ ఫిర్యాదు చేయనున్నారు.

విద్యార్థులందరికీ బెడ్లు

అన్ని కేజీబీవీలకు కలిపి 1,19,560 నాణ్యమైన పరుపులు, దుప్పట్లు సరఫరా చేశారు. అలాగే ఇటీవల కొత్తగా 53,180 టు టైర్‌ బంకర్‌ బెడ్లు కేజీబీవీలకు అందజేశారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.105.3 కోట్లు ఖర్చు చేసింది. అలాగే ఎంపీసీ విద్యార్థుల కోసం 244 కేజీబీవీల్లో లేబొరేటరీలు ఏర్పాటు చేశారు. ఇందులో 116 కేజీబీవీల్లో బైపీసీకి ల్యాబ్స్‌ ఉన్నాయి. హాస్టళ్లలో శీతాకాలంలో విద్యార్థులకు వేడి నీటిని అందించేందుకు 562 కేజీబీవీల్లో సోలార్‌ గీజర్లు ఇన్‌స్టాల్‌ చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

మీ ఛాయిస్‌ ఎవరు?

మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

Updated Date - Oct 16 , 2026 | 05:26 AM