ఐ-బ్రెస్ట్’తో రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్
ABN , Publish Date - Nov 21 , 2026 | 05:10 AM
రొమ్ము క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
ఇంటి వద్దే పరీక్షల నిర్వహణకు వీలు
‘ఐ-బ్రెస్ట్’ వినియోగంపై వైద్యులకు శిక్షణ పూర్తి
750 పరికరాలు ఉచితంగా అందిస్తున్న బీపీసీఎల్
అమరావతి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): రొమ్ము క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రొమ్ములో కణితులు, అసాధారణ మార్పులను గుర్తించేందుకు సెన్సర్ల ఆధారంగా పనిచేసే అత్యాధునిక ‘ఐ-బ్రెస్ట్ ఎగ్జామ్’ పరికరాలను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ పరికరాల సాయంతో గ్రామాల్లో మహిళలకు ఇంటివద్దే ఉచితంగా స్ర్కీనింగ్ నిర్వహిస్తామని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీలో ‘ఐ-బ్రెస్ట్ ఎగ్జామ్’ పరికరాల వినియోగంపై శిక్షణ పొందిన మహిళా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, అధికారులతో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... త్వరలో కొత్తగా చేపట్టే నాన్‌కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్‌సీడీ) సర్వేలో భాగంగా విలేజ్ హెల్త్ క్లినిక్‌ల వద్ద ఐ-బ్రెస్ట్ ఎగ్జామ్ పరికరాలతో రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ సర్వేలో రొమ్ము క్యాన్సర్‌తోపాటు నోటి, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, బీపీ, షుగర్ వంటి పరీక్షలు కూడా చేపడతామని వెల్లడించారు.
సీఎస్‌ఆర్ నిధులతో 750 పరికరాలు
భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) నిధుల కింద 750 ‘ఐ-బ్రెస్ట్ ఎగ్జామ్’ పరికరాలను ఆరోగ్యశాఖకు అందించేందుకు అంగీకరించింది. ఒక్కో పరికరం విలువ దాదాపు రూ.7.5 లక్షలు ఉంటుంది. మొత్తం 750 పరికరాల కోసం రూ.56 కోట్లు అందించనుంది. ఈ మేరకు బీపీసీఎల్‌తో ఆరోగ్యశాఖ కమిషనర్ చక్రధర్‌బాబు ఒప్పందం చేసుకున్నారు. తొలివిడతగా ఇప్పటికే 375 పరికరాలను అందించగా వాటిని 13 జిల్లాలకు పంపిణీ చేశారు. ఆయా జిల్లాల్లో మహిళా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు ఈ పరికరాల వినియోగంపై శిక్షణ ఇచ్చారు.
‘ఐ-బ్రెస్ట్ ఎగ్జామ్’ ఇలా పనిచేస్తుంది..?
ప్రస్తుతం వైద్య సిబ్బంది చేతులతో రొమ్మును తాకి కణితులు ఉన్నాయా లేదా అని గుర్తిస్తున్నారు. అయితే యూఈ లైఫ్ సైన్సెస్ సంస్థ అభివృద్ధి చేసిన ఐ-బ్రెస్ట్ ఎగ్జామ్ పరికరాన్ని రొమ్ముపై ఉంచి, అందులోని ప్రత్యేక ఎలక్ట్రానిక్ సెన్సర్ల ద్వారా కణజాలంలో మార్పులను అంచనా వేస్తారు. పరీక్ష పూర్తయిన వెంటనే దానికి అనుసంధానమైన మొబైల్‌లో ఫలితాలు కనిపిస్తాయి. ఐ బ్రెస్ట్ ఎగ్జామ్ పరికరం చిన్నగా ఉంటుంది. బ్యాటరీతో పనిచేసే ఈ పరికరాన్ని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. ఐ-బ్రెస్ట్ ఎగ్జామ్ వల్ల మహిళలు ఎలాంటి సంకోచం లేకుండా పరీక్షలు చేయించుకునేందుకు ముందుకొస్తారని, తద్వారా క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించే అవకాశాలు పెరుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది సాధారణ వైద్య పరీక్షలకు తోడ్పడే సాంకేతికత మాత్రమే. క్యాన్సర్‌ను నిర్ధారించే వైద్య పరీక్షలకు ప్రత్యామ్నాయం కాదు. ఐ-బ్రెస్ట్ ఎగ్జామ్‌లో అసాధారణ మార్పులు కనిపించిన మహిళలను తదుపరి వైద్య పరీక్షల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆస్పత్రులు, వైద్య కళాశాలలకు పంపిస్తారు. అవసరాన్ని బట్టి అల్ట్రాసౌండ్, మామోగ్రఫీ, బయాప్సీ పరీక్షలు నిర్వహిస్తారు. క్యాన్సర్ నిర్ధారణ అయిన వారికి ప్రత్యేక కేంద్రాల్లో వైద్యం అందిస్తారు.
ఈ వార్తలనూ చదవండి:
వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్‌పై సైబర్ దాడి.. కస్టమర్ల సమాచారం లీక్!
ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్.. 37 గంటల మిషన్‌లో ఏం జరిగిందంటే..