Share News

రాష్ట్రంలో ‘విదేశీ’ క్యాంప్‌సలు!

ABN , Publish Date - Oct 13 , 2026 | 04:34 AM

రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ర్టానికి విదేశీ విద్యాసంస్థలు, ఇతర రాష్ర్టాల్లోని ప్రముఖ ప్రైవేట్‌ యూనివర్సిటీలను తీసుకురావడం లక్ష్యంగా కొత్త పాలసీ రూపొందించింది.

రాష్ట్రంలో ‘విదేశీ’ క్యాంప్‌సలు!

  • రాష్ట్రంలో ‘విదేశీ’ క్యాంప్‌సలు!

  • దేశంలోని ప్రైవేటు విశ్వవిద్యాలయాలకూ ఆహ్వానం

  • టాప్‌ ర్యాంకుల్లోని విద్యాసంస్థలకు అవకాశం

  • కొత్త పాలసీ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

  • 2029 నాటికి రాష్ర్టానికి కనీసం ఐదు విదేశీ ఉన్నత విద్యాసంస్థలను తీసుకురావాలని లక్ష్యం

అమరావతి, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ర్టానికి విదేశీ విద్యాసంస్థలు, ఇతర రాష్ర్టాల్లోని ప్రముఖ ప్రైవేట్‌ యూనివర్సిటీలను తీసుకురావడం లక్ష్యంగా కొత్త పాలసీ రూపొందించింది. ‘ఏపీలో విదేశీ ఉన్నత విద్యాసంస్థలు, ప్రైవేటు యూనివర్సిటీలకు ప్రోత్సాహం-2026’ పాలసీపై ఉన్నత విద్యాశాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. 2029 నాటికి కనీసం 5 విదేశీ ఉన్నత విద్యాసంస్థలను రాష్ర్టానికి రప్పించడం లక్ష్యంగా పేర్కొంది. 5 వేల మందికి మించి విదేశీ విద్యార్థులు రాష్ట్రానికి వచ్చి చదువుకోవాలని, 80 శాతం ఉన్నత విద్యాసంస్థలు ఒక ప్రోగ్రామ్‌ను సంయుక్తంగా లేదా డ్యూయెల్‌ విధానంలో అందుబాటులోకి తేవాలని, 50 శాతం జీఈఆర్‌ సాధించాలనే లక్ష్యాలు పెట్టుకుంది. టాప్‌ ర్యాంకింగ్స్‌లో ఉన్నవాటిని ఆకర్షించి రాష్ట్రంలో క్యాంప్‌సలో ఏర్పాటు చేసేలా...ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించి, ప్రైవేటు వర్సిటీలు విస్తరించేలా లక్ష్యాలు నిర్దేశించుకుంది.


రాయితీపై 50 ఎకరాల భూమి

ఈ పాలసీలో విద్యాసంస్థలకు ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు ప్రకటించింది. వాటి ప్రకారం.. విదేశీ ఉన్నత విద్యాసంస్థలకు రాయితీపై 50 ఎకరాల వరకు భూమి ఇస్తుంది. స్టాంపు డ్యూటీ, రిజిస్ర్టేషన్‌ చార్జీలను మినహాయిస్తుంది. పీపీపీ విధానంలో స్థానిక పరిశ్రమలతో సమన్వయం చేసి సహకారం అందిస్తుంది. సింగిల్‌ విండో విధానంలో ఏపీఈడీబీ ద్వారా అనుమతులు ఇస్తారు. విదేశాల నుంచి ఇక్కడికి వచ్చే వారి వీసాలు, వర్క్‌ పర్మిట్‌లు, రిసెర్చ్‌ వీసాల జారీ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని సహకారం అందిస్తారు. 2027 డిసెంబరు వరకు ప్రభుత్వంతో ఎంవోయూలు చేసుకునే వర్సిటీలకే ఈ ప్రోత్సాహకాలు వర్తిస్తాయి. ప్రభుత్వంలో ఎంప్యానెల్‌ అయిన అకడమిక్‌ ఇన్‌ఫ్రా సర్వీస్‌ ప్రొవైడర్‌ ద్వారా విదేశీ విద్యాసంస్థలు క్యాంపస్‌ కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చు. ఈ ప్రొవైడర్‌ నాన్‌ అకడమిక్‌ అంశాల్లో సహకారం అందిస్తుంది. టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ లేదా క్యూఎస్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకుల్లో టాప్‌ 500లో ఉన్న యూనివర్సిటీలు రాష్ట్రంలో క్యాంప్‌సల ఏర్పాటుకు అర్హులు. సబ్జెక్టు ర్యాంకింగ్‌లో టాప్‌ 100లో ఉన్న యూనివర్సిటీలకు కూడా అవకాశం ఉంటుంది.

ఆర్నెల్లలో భూకేటాయింపు, అనుమతులు

ప్రైవేటు వర్సిటీలకు కూడా రాయితీపై 50 ఎకరాల వరకు భూమి ఇస్తారు. స్టాంపు డ్యూటీ నుంచి వంద శాతం మినహాయింపు ఉంటుంది. 2027 డిసెంబరు వరకు ఒప్పందాలు చేసుకున్న వారికే ఈ ప్రోత్సాహకాలు వర్తిస్తాయి. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ టాప్‌-100 ర్యాంకింగ్‌లో ఉన్న యూనివర్సిటీలకు అర్హత. యూజీసీ నుంచి ఎల్‌వోఐ పొందిన విదేశీ, స్వదేశీ యూనివర్సిటీలకు ఆరు నెలల్లో భూ కేటాయింపులు, అనుమతులు మంజూరు చేస్తారు.

ఈ వార్తలనూ చదవండి:

పెట్టుబడుల స్వర్గధామం ఏపీ

నాడు అడ్డగోలు.. నేడు గగ్గోలు

Updated Date - Oct 13 , 2026 | 04:34 AM