ఇక సరళంగా అనుమతులు
ABN , Publish Date - Oct 13 , 2026 | 05:34 AM
రాష్ట్రంలో పెట్టుబడులకు మరింత అనుకూల వాతావరణాన్ని కల్పిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమల స్థాపన, వ్యాపారాల నిర్వహణకు అనుమతుల జారీ ప్రక్రియను మరింత సరళతరం చేసింది.
పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా తగ్గింపు
లైసెన్సుల సంఖ్య 10 లోపునకే పరిమితం
కొన్ని అనుమతులు తొలగింపు, మరికొన్ని విలీనం
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
అమరావతి, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెట్టుబడులకు మరింత అనుకూల వాతావరణాన్ని కల్పిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమల స్థాపన, వ్యాపారాల నిర్వహణకు అనుమతుల జారీ ప్రక్రియను మరింత సరళతరం చేసింది. ఈ ప్రక్రియలో జాప్యాన్ని నివారించడంతోపాటు లైసెన్సులు, నిరభ్యంతర ధ్రువపత్రాలు (ఎన్‌వోసీ), ఇతర అనుమతుల సంఖ్యను 10 లోపునకు పరిమితం చేయాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ సెక్రటేరియట్ చేపట్టిన కంప్లయెన్స్ రిడక్షన్ అండ్ డీ రెగ్యులేషన్ రెండో విడత కార్యక్రమానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.
ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒకే అంశంలో పునరావృతమయ్యే అనుమతులను తొలగించడం, కొన్నింటిని విలీనం చేయడం, మరికొన్నింటిని ముందస్తు అనుమతి స్థానంలో సమాచార సమర్పణగా మార్చడం, స్వీయ ధ్రువీకరణ (సెల్ఫ్ డిక్లరేషన్)కు అవకాశం కల్పించడం వంటి చర్యలను ప్రభుత్వం చేపట్టింది. ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతాల్లో చెట్ల తొలగింపు, నీటి వనరులకు సంబంధించి నీటిపారుదల, రెవెన్యూ శాఖల నుంచి పొందాల్సిన కొన్ని ఎన్‌వోసీలు, ఫ్యాక్టరీ ప్లాన్ ఆమోదం, లిఫ్ట్‌కు అనుమతి, భూమి వినియోగ ధ్రువపత్రం, గ్రామ పంచాయతీ ఎన్‌వోసీ వంటి అనుమతులను తొలగించేందుకు లేదా సంబంధిత చట్టాల్లో మార్పులు చేయడానికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఉత్తర్వుల అమలుకు సంబంధించి ఇప్పటికే తొలగింపు, విలీనం లేదా సరళీకరణకు నిర్ణయించిన అనుమతుల ప్రక్రియను 14 రోజుల్లోగా సవరించి, తుది నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. చట్ట సవరణలు అవసరమైన అంశాలకు సంబంధించి న్యాయశాఖతో సంప్రదించాలని సూచించింది.
ఈ వార్తలనూ చదవండి: