తొలిరోజే పెట్టుబడుల జోరు
ABN , Publish Date - Nov 13 , 2026 | 03:23 AM
సాగర తీరాన పెట్టుబడుల వరద ప్రవహించింది. విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సు తొలిరోజునే రిలయన్స్, కియ వంటి దిగ్గజ కంపెనీలు ముందుకు రావడంతో సదస్సు ప్రాంగణంలో పెట్టుబడుల పండగ వాతావరణం కనిపించింది.
73 ఎంఓయూలు.. 5,84,355 కోట్ల పెట్టుబడులు
సీఐఐ సదస్సులో దిగ్గజ కంపెనీల ఒప్పందాలు
1,07,693 మందికి ఉద్యోగ అవకాశాలు
గ్రీన్‌కో ఎనర్జీస్, క్లీన్ మ్యాక్స్ ఎన్విరో ఎనర్జీ,
మేఘా, కియా సంస్థలతోనూ భారీ ఒప్పందాలు
రెన్యువబుల్ ఎనర్జీ, కెమికల్స్ అండ్ పెట్రో కెమికల్స్,
ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలపై పారిశ్రామికవేత్తల ఆసక్తి
జనరల్ మాన్యుఫ్యాక్చరింగ్‌లో రిలయన్స్ పెట్టుబడి రూ.2,73,000 కోట్ల
విశాఖపట్నం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): సాగర తీరాన పెట్టుబడుల వరద ప్రవహించింది. విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సు తొలిరోజునే రిలయన్స్, కియ వంటి దిగ్గజ కంపెనీలు ముందుకు రావడంతో సదస్సు ప్రాంగణంలో పెట్టుబడుల పండగ వాతావరణం కనిపించింది. జనరల్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో రూ.2,73,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకొచ్చింది. తూర్పు గోదావరి జిల్లాలో ఈ ప్రాజెక్టును ఆ సంస్థ చేపట్టనుంది. సదస్సు తొలిరోజున 88 ప్రతిపాదనలతో కంపెనీలు ముందుకొచ్చాయి. 73 సంస్థలతో రూ.5,84,355 కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా అవగాహన ఒప్పందాలు కుదిరాయి.
వాటి ద్వారా 1,07,683 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 15 జీవోలు జారీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్‌ల సమక్షంలో ప్రముఖ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ తో పాటు గ్రీన్ కో ఎనర్జీస్, క్లీన్ మ్యాక్స్ ఎన్విరో ఎనర్జీ సొల్యూషన్స్, మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రా, కియా ఇండియా తదితర భారీ సంస్థలు వీటిలో ఉన్నాయి. అత్యధికంగా జనరల్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో 23 ఎంఓయూలు కుదిరాయి. తద్వారా రూ.3,57,386 కోట్ల పెట్టుబడులకు సంతకాలు జరిగాయి. వాటి వల్ల 44,838 మందికి ఉపాధి లభించనుంది. రష్మి మెటలర్జీకల్ ఇండస్ర్టీస్ రూ.18,500 కోట్లు, జెఎస్ డబ్ల్యు రూ.15 వేల కోట్లు పెట్టనున్నాయి. ఇంకా..
రెన్యువబుల్ ఎనర్జీ : ఈ రంగంలో ఏడు ఎంఓయూలు కుదిరాయి. వాటి ద్వారా రూ.1,65,020 కోట్లు పెట్టుబడులు, ఆయా సంస్థల్లో 16,600 మందికి ఉద్యోగాలు కొత్తగా రానున్నాయి. గ్రీన్ కో ఎనర్జీస్ రూ.45 వేల కోట్లు, క్లీన్ మ్యాక్స్ ఎన్విరో ఎనర్జీ సొల్యూషన్స్ రూ.41వేల కోట్లు, కృష్ణా జిల్లాలో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రా రూ.36 వేల కోట్లు పెడుతున్నాయి.
కెమికల్స్ అండ్ పెట్రో కెమికల్స్: ఈ రంగంలో ఆరు ఎంఓయూల ద్వారా పెట్టుబడులు రూ.19,995 కోట్లు, 3,127 ఉద్యోగాలు వస్తాయి. గెయిల్ ఇండియా రూ.13,500 కోట్లు (శ్రీకాకుళం), ఎన్‌ఏఎన్ మ్యాగ్నాటెక్ రూ.3 వేల కోట్లు (నెల్లూరు), ఎన్‌ఏఎన్ సైలాక్స్ గ్రీన్‌మెట్ తిరుపతిలో రూ.1,800 కోట్లు పెడతాయి.
ఫుడ్ ప్రాసెసింగ్: ఈ రంగంలో ఐదు ఎంఓయూల ద్వారా రూ.4,770 కోట్ల పెట్టుబడులు, 2,847 ఉద్యోగాలు వస్తాయి. ఎస్‌ఎల్‌ఎన్ కాఫీ నెల్లూరులో రూ.2,500 కోట్లు, హిందూస్థాన్ కోకా-కోలా బేవరేజెస్ రూ.1,127 కోట్లు, శ్రీ వసుధ ఫుడ్స్ అనంతపురంలో రూ.400 కోట్లు పెడతాయి. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్, మంత్రులు గొట్టిపాటి రవికుమార్, కొల్లు రవీంద్ర, డోలా బాలవీరాంజనేయ స్వామి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
విశాఖలో 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2026 ప్రారంభం
ఏపీకి పెట్టుబడుల వరద.. తొలిరోజే రూ.1.57 లక్షల కోట్ల ఒప్పందాలు