రాష్ట్రంలో ఎస్సీల వద్ద 23.47 లక్షల ఎకరాల సాగుభూమి
ABN , Publish Date - Oct 16 , 2026 | 04:00 AM
రాష్ట్రంలో మొత్తం సాగులో ఉన్న భూమిలో 6 శాతం షెడ్యూల్డ్ కులాల(ఎస్సీ) యాజమాన్యంలో ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 3,91,26,931 ఎకరాలు ఉంటే,..
ఒక్కొక్కరికి సగటున 2.02 ఎకరాలు
మొత్తం భూ యజమానుల్లో 9.9 శాతం ఎస్సీలు
జాతీయ ఎస్సీ కమిషన్కు సీసీఎల్ఏ నివేదిక
(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మొత్తం సాగులో ఉన్న భూమిలో 6 శాతం షెడ్యూల్డ్ కులాల(ఎస్సీ) యాజమాన్యంలో ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 3,91,26,931 ఎకరాలు ఉంటే, అందులో అసైన్డ్ భూమి కాకుండా ఎస్సీల యాజమాన్యంలో 23,47,808 ఎకరాలు ఉందని పేర్కొంది. ఈ మేరకు జాతీయ ఎస్సీ కమిషన్కు ప్రభుత్వం నివేదించింది. రాష్ట్రంలో మొత్తం భూ యజమానులు 1,16,76,702 మంది ఉండగా, ఇందులో ఎస్సీలు 11,58,492 మంది ఉన్నారని ప్రభుత్వం పేర్కొంది. మొత్తం భూ యజమానుల్లో ఎస్సీల వాటా 9.9 శాతంగా ఉందని నివేదికలో తెలిపింది. జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశం మేరకు రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల సామాజిక, ఆర్థికాభివృద్ధిపై ప్రభుత్వం నివేదికలు రూపొందించింది.
ప్రభుత్వం తరఫున రెవెన్యూశాఖ నుంచి భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) జి. జయలక్ష్మి ఢిల్లీ వెళ్లి ఎస్సీ కమిషన్కు నివేదికలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డెపల్లి రామ్చందర్ లేవనెత్తిన అనేక అంశాలపై ఆమె ప్రభుత్వం తరఫున సమగ్ర ప్రజంటేషన్లు, వివరణలు ఇచ్చారు. అసైన్డ్ చేసినవి కాకుండా రెగ్యులర్గా ఎస్సీల చేతిలో ఎంత సాగు భూమి ఉందన్న అంశంపై రెవెన్యూశాఖ గణాంకాలను కమిషన్ ముందు ఉంచింది. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం ఎస్సీయేతరుల వద్ద సగటున 3.6 ఎకరాలు ఉంటే, ఎస్సీల వద్ద సగటున 2.02 ఎకరాల భూమి ఉన్నట్లు జయలక్ష్మి వివరించారు. ఇదిలా ఉంటే, వ్యవసాయ భూములు కలిగిన ఎస్సీలు అత్యధికంగా కడప జిల్లాలో 2,32,421 మంది ఉన్నారు. ఆ తర్వాత 2,16,376 మందితో అనంతపురం రెండో స్థానంలో ఉంది.
కర్నూలు, సత్యసాయి జిల్లాల్లో సగటున 2 లక్షల మంది ఎస్సీల వద్ద వ్యవసాయ భూములున్నాయి. ఇక అతి తక్కువగా అల్లూరి జిల్లాలో 442, పోలవరం జిల్లాలో 664 మంది ఎస్సీల వద్ద వ్యవసాయ భూములున్నట్లు ఈ నివేదిక చెబుతోంది. జనాభాపరంగా కోనసీమ జిల్లాలో ఎస్సీలు(3.85 లక్షలు) ఎక్కువగా ఉండగా, సాగు భూములు ఉన్నవారు 91,225 మందే ఉన్నారు. ఇక ఇంటిస్థలాలు కావాలని ప్రభుత్వానికి మొత్తం 4,90,876 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 93,639 మంది ఎస్సీలు ఉన్నట్లు సీసీఎల్ఏ తన నివేదికలో పేర్కొన్నారు. వారి దరఖాస్తుల్లో 28,393ను ఆమోదించినట్లు, మరో 65,246 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్లు వివరించారు. రాష్ట్రంలో ఎస్సీ జనావాసాలున్న గ్రామాలు 15,674 ఉన్నాయని, వాటిలోని 14,273లో ప్రత్యేకంగా ఎస్సీ శ్మశానవాటికలు ఉన్నాయని తెలిపారు. మరో 1401 జనావాసాలకు వాటి అవసరం ఉందని చెప్పారు. ఇందుకోసం 790 ఎకరాల సేకరణకు రూ.413 కోట్లు ఖర్చుకానుందని నివేదికలో సీసీఎల్ఏ వెల్లడించారు.
పదోన్నతుల్లో పక్కాగా రిజర్వేషన్లు
రాష్ట్రంలో ఎస్సీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్ల విధానం పక్కాగా అమలవుతోందని సీసీఎల్ఏ తెలిపారు. గత ఐదేళ్లకాలంలో ఒక్క రెవెన్యూశాఖ పరిధిలోనే 2,839 మంది రెగ్యులర్ ఉద్యోగులకు పదోన్నతులు ఇస్తే, అందులో 549 మంది ఎస్సీలున్నారని తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు