తుఫాన్ సహాయక చర్యలకు రూ.27 కోట్లు
ABN , Publish Date - Oct 27 , 2026 | 06:10 AM
ఆర్నబ్ తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఏపీఈపీడీసీఎల్ అన్ని రకాలుగా ముందస్తు ఏర్పాట్లు చేసిందని సీఎండీ పృథ్వీతేజ్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..
తుఫాన్ సహాయక చర్యలకు రూ.27 కోట్లు
తక్షణ ఖర్చుల నిమిత్తం మంజూరు చేసిన ప్రభుత్వం
21 బృందాలు సిద్ధం: విపత్తుల సంస్థ
అమరావతి, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): ఆర్నబ్ తుఫాన్ నేపథ్యంలో సహాయ, పునరావాస చర్యలకు తక్షణ వ్యయం కోసం 20 జిల్లాలకు రూ.27 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. బాపట్ల, కృష్ణా, ఉభయగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి జిల్లాలకు రెండేసి కోట్లు, ప్రకాశం, మార్కాపురం, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, అల్లూరి, పోలవరం, మన్యం, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రూ.కోటి చొప్పున కేటాయించింది. ఈ మేరకు రెవెన్యూ, విపత్తుల నిర్వహణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ సోమవారం ఈ ఉత్తర్వులు జారీచేశారు.
వరద ప్రభావిత ప్రాంతాల నుంచి బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడం, వారికి ఆహారం, సురక్షిత తాగునీరు, పిల్లలకు పాలు అందించడం, వైద్య శిబిరాల నిర్వహణకు ఈ నిధులు వినియోగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో 8 ఎస్డీఆర్‌ఎఫ్, 7 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, అదనంగా మరో 6 బృందాలు అందుబాటులో ఉన్నాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
అగ్నిమాపకశాఖకు చెందిన 115 ఉడ్ కటింగ్ మిషన్లు, 13 బోటు రెస్క్యూ టీమ్‌లు, 76 ఆస్కా లైట్స్, 853 లైఫ్ బాయ్స్, 1,328 లైఫ్ జాకెట్స్‌తో సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. ఇక పశుసంపద సంరక్షణకు పశు సంవర్ధకశాఖ జిల్లా కార్యాలయాల్లో 24/7 కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ అమరేంద్రకుమార్ తెలిపారు. ప్రథమ చికిత్స కిట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచామన్నారు. పశుసంపద నష్టాలపై వెంటనే నివేదికలు పంపాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించినట్లు వివరించారు.
రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి: అచ్చెన్న
తుఫాన్ నేపథ్యంలో రైతులు, మత్స్యకారులు, పశుపోషకులు, పౌల్ర్టీ పెంపకందారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. పంటలను కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుని, నష్టాన్ని తగ్గించుకోవచ్చని సోమవారం ఓ ప్రకటనలో సూచించారు. పశుసంపదను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఆక్వా చెరువులు దెబ్బతినకుండా చూసుకోవాలని సూచించారు.
ఈ వార్తలనూ చదవండి:
బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా బలపడిన ‘అర్నబ్’
అతి తీవ్ర తుఫాను..ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్