రూ.30 కోట్ల రైతుల సొమ్ముకు ఎసరు?
ABN , Publish Date - Oct 16 , 2026 | 03:44 AM
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ద్వారా చేసిన ధాన్యం సేకరణ ప్రక్రియలో.. రవాణా చార్జీల చెల్లింపులపై వివాదం నెలకొంది. సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ అధికారులు, రైసు మిల్లర్లు కుమ్మక్కై..
అధికారులు, మిల్లర్లు కుమ్మక్కై దోపిడీకి స్కెచ్
ధాన్యం రవాణా చార్జీల చెల్లింపులపై వివాదం
అమరావతి, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ద్వారా చేసిన ధాన్యం సేకరణ ప్రక్రియలో.. రవాణా చార్జీల చెల్లింపులపై వివాదం నెలకొంది. సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ అధికారులు, రైసు మిల్లర్లు కుమ్మక్కై ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో 2021-22 ఖరీఫ్-రబీ సీజన్లకుగాను రైతులకు చెల్లించాల్సిన దాదాపు రూ.30 కోట్లకుపైగా ధాన్యం రవాణా చార్జీల సొమ్మును కాజేసేందుకు స్కెచ్ వేశారనే ఆరోపణలు వస్తున్నాయి. సంబంధిత అధికారుల డిజిటల్ సంతకాలు, రశీదులు, వే బ్రిడ్జి డేటాను పరిశీలించకుండానే రైతుల ముసుగులో మిల్లర్లకు దోచిపెట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ధాన్యం రవాణా చార్జీల చెల్లింపు ప్రక్రియను నిలిపివేయాలంటూ విజయవాడకు చెందిన రాజు అనే వ్యక్తి ఈ నెల 15న రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్‌కు లీగల్ నోటీసు పంపించారు. ఈ విషయం పౌర సరఫరాల శాఖలో చర్చనీయాంశమైంది.
విజిలెన్స్ విచారణలోనూ వెలుగు చూసిన అక్రమాలు
వైసీపీ ప్రభుత్వ హయాంలో ధాన్యాన్ని రైతులే సొంత ఖర్చులతో రైసుమిల్లులకు రవాణా చేశారు. అయితే రైతులకు రవాణా చార్జీలు బకాయి పెట్టడంతో, అవి వందల కోట్లలో పేరుకుపోయాయి. 2021-22 ఖరీఫ్ సీజన్లో 40.31 లక్షల టన్నులు, రబీలో సుమారు 27 లక్షల టన్నుల ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసినట్లు ఉద్యోగులు ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ (ఎఫ్‌టీవో) సిద్ధం చేశారు. కానీ ఈ ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేసేందుకు టెండర్లే ఖరారు చేయలేదు. దీంతో రైతులే సొంత ఖర్చులతో ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేశారు. ఆ ఒక్క సీజన్లోనే రాష్ట్రవ్యాప్తంగా రైతులకు దాదాపు రూ.160 కోట్లకుపైగా రవాణా చార్జీలు చెల్లించాల్సి ఉంది.
రబీ సీజన్లో కొనుగోలు చేసిన 26.90 లక్షల టన్నుల ధాన్యానికి కూడా రవాణా చార్జీలు చెల్లించలేదు. దీనిపై రైతుల నుంచి ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ బృందాలు ఆర్బీకేల్లో తనిఖీలు చేసి, ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చాయి. దీనిపై అప్పటి సివిల్ సప్లయిస్ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ స్పందించి.. ‘2021-22లో ధాన్యం రవాణా ఖర్చులను రైతులే భరించినప్పటికీ.. వారికి దక్కాల్సిన డబ్బులను ప్రైవేటు ఏజెన్సీలకు చెల్లిస్తున్నట్టు రైతుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై విచారణ జరపగా అంతా వాస్తవమేనని తేలింది. రైతులకు అవగాహన లేక ఎక్కువమంది రవాణా ఖర్చులను క్లెయిమ్ చేసుకోలేదు. దీంతో ప్రైవేట్ ఏజెన్సీలే ధాన్యాన్ని రవాణా చేసినట్టుగా.. సివిల్ సప్లయిస్ జిల్లా మేనేజర్లు ఫైళ్లను ప్రాసెస్ చేస్తున్నట్టు తెలిసింది. కాబట్టి నిజంగా ఖర్చు పెట్టినవారికే రవాణా ఖర్చులు దక్కేలా చర్యలు తీసుకోవాలి’ అంటూ కమిషనర్ అరుణ్‌కుమార్.. అప్పటి సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఎండీ వీరపాండియన్‌కు లేఖ కూడా రాశారు. కానీ.. రైతులకు చెల్లించాల్సిన రవాణా చార్జీలు పెండింగ్‌లోనే ఉన్నాయి.
కృష్ణా జిల్లా జేసీ లేఖతో తాజా వివాదం
ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2021-22 (ఖరీ్‌ఫ-రబీ) సీజన్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ధాన్యం రవాణా ఖర్చులను వాస్తవంగా భరించిన వారికి విడుదల చేయడానికి అనుమతి కోరుతూ కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టరు గత నెల 22న ప్రభుత్వానికి లేఖ రాశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 94,576 ట్రక్ షీట్ల ద్వారా రైసు మిల్లులకు ధాన్యాన్ని రవాణా చేసినట్లు తేలింది. అయితే రవాణా ఖర్చులను ఎవరు భరించారనే విషయాన్ని నిర్ధారించేందుకు ఆధారాలు లేకపోవడంతో అప్పటి నుంచి బిల్లులు పెండింగ్‌లో పెట్టారు.
ఈ బిల్లులు చెల్లించే ముందు అర్హులకు మాత్రమే రవాణా చార్జీలు చెల్లించేలా జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశిస్తూ కృష్ణా జిల్లా జేసీతోపాటు గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో భాగంగా ఉన్న ప్రస్తుత ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు ఉన్నందున.. ఆ రెండు జిల్లాల జాయింట్ కలెక్టర్లకు కూడా సివిల్ సప్లయిస్ కమిషనర్ కన్నబాబు ఈ నెల 9న ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే అదనుగా రైసు మిల్లర్లు రంగంలోకి దిగి.. రైతుల ముసుగులో కోట్లాది రూపాయల రవాణా చార్జీల సొమ్ము కాజేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని, సివిల్ సప్లయిస్ అధికారులు కూడా వారికి సహకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు