రెవెన్యూలో కదలని కేసులు!
ABN , Publish Date - Oct 16 , 2026 | 05:19 AM
రెవెన్యూ విభాగంలో వేలాది కేసులు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం ఐదు చట్టాల పరిధిలో 11 వేలకు పైగా కేసులు పరిష్కారం కాకుండా రెవెన్యూ కోర్టుల్లో ఉండిపోయాయి.
దాదాపు 11వేలకు పైగా కేసులు పెండింగ్‌లో
భూ చట్టాల నిబంధనల అమలులో నిర్లక్ష్యం
కార్యాలయాల చుట్టూ రైతుల ప్రదక్షిణలు
అప్పీల్స్ కేసుల పెండింగ్‌లో తిరుపతి టాప్
(అమరావ తి-ఆంధ్రజ్యోతి) : రెవెన్యూ విభాగంలో వేలాది కేసులు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం ఐదు చట్టాల పరిధిలో 11 వేలకు పైగా కేసులు పరిష్కారం కాకుండా రెవెన్యూ కోర్టుల్లో ఉండిపోయాయి. తహశీల్దార్, ఇనామ్ డీటీ, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్, అప్పీల్ కమిషనర్, సెటిల్మెంట్ కమిషనర్ స్థాయిలో ఈ పరిస్థితి నెలకొంది. రాష్ట్రస్థాయులో సెటిల్మెంట్, అప్పీల్స్ కమిషనేట్ల పరిధిలోని కోర్టుల్లో 12 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూముల కేసుల పరిష్కారం కోసం రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రెవెన్యూ అధికారుల కోర్టుల్లో దాఖలయ్యే అప్పీల్స్‌ను 30 నుంచి 60 రోజుల్లో సెటిల్ చేయాలని ఏపీ ఆర్వోఆర్ చట్టం నిర్దేశించింది. నిర్దిష్ట గడువు దాటిన త ర్వాత అప్పీల్ కేసులను పెండింగ్ పెట్టకూడదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఆచరణలో మాత్రం ఈ చట్టాల అమలులో పూర్తి నిర్లక్ష్యం కనిపిస్తోంది. రెవెన్యూ అధికారుల కోర్టుల్లో ఉన్న కేసుల పురోగతి మాట అటుంచి, అసలు రైతు ఇచ్చిన పిటిషన్ ఎక్కడుందో కనిపెట్టడమే అసాధ్యంగా మారింది.
రివిజన్ నుంచే మహా పెండింగ్
ఆంధ్రప్రదేశ్ భూమి హక్కులు, పట్టాదారు పాస్‌పుస్తకం (రికార్డ్ ఆఫ్ రైట్స్) చట్టం-1971 ప్రకారం రైతుల భూ సమస్యలను పరిష్కరించే చట్టబద్ధమైన న్యాయాధికారాలు రెవెన్యూ అధికారులకు ఉన్నాయి. రైతుల భూముల విషయంలో తహశీల్దార్ తీసుకునే నిర్ణయాలు నచ్చకపోతే ఆర్డీవో కోర్టులో అప్పీల్ చేస్తారు. ఆర్డీవో ఇచ్చే ఆదేశాలు కూడా వ్యతిరేకంగా వస్తే జాయింట్ కలెక్టర్ వద్దకు అక్కడినుంచి హైకోర్టుకు వెళ్తారు. అయితే చాలా కేసులు జిల్లా స్థాయిలోనే పెండింగ్‌లో ఉంటున్నాయి. గత రెండేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ కోర్టుల్లో 2,398 కేసులు దాఖలయితే, అందులో 2,258 పెండింగ్‌లో ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి.
మిగిలిన 140 పరిష్కారం జాబితాలో ఉన్నా, అందులో ఫైల్ ఓపెన్ చేసినవి 120 వరకూ ఉన్నాయి. అంటే అవి కూడా పెండింగ్‌లో ఉన్నట్లుగానే భావించాలని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. సత్యసాయి జిల్లా-303, చిత్తూరు-280, అనంతపురం-255, అనకాపల్లి-166, కడప-160, అన్నమయ్య-149, తిరుపతి-149 కేసులు చొప్పున రివిజన్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. తిరుపతి, అన్నమయ్య, కడప, అనకాపల్లి జిల్లాల్లో ఒక్క కేసు కూడా పరిష్కారం కాలేదు. మరో 14 జిల్లాల పరిధిలోనూ ఒక్క రివిజన్ కేసు పరిష్కారం కాకుండా ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే ఉన్నాయి.
అప్పీల్స్లోనూ అదే తీరు
రాష్ట్రవ్యాప్తంగా 82 డివిజన్ల పరిధిలో 8,652 కేసులు ఆర్డీఓ కోర్టుల్లో దాఖలయ్యాయి. ఇందులో 8,049 పెండింగ్‌లో ఉన్నాయి. 603 కేసులకు సంబంధించి 420 ఫైల్స్ ఓపెన్‌చేసి పెట్టారు. అవి కూడా పెండింగ్‌లో ఉన్నట్లే.
ఆర్వోఆర్ రివిజన్తో పాటు, అప్పీల్స్ కేసుల పెండింగ్‌లో తిరుపతి డివిజన్ తొలి వరసలో నిలిచింది. ఒక్క తిరుపతి ఆర్డీవో కోర్టులోనే 473 కేసులకు గాను 446 పెండింగ్ ఉన్నాయి. 27 పరిష్కారం అయినట్లుగా చూపిస్తున్నా, అందులో ఫైల్ ఓపెన్ చేసినవి 23 వరకూ ఉన్నాయి. అవీ పూర్తిగా పరిష్కారం కాని కేసులేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. అన్నమయ్య జిల్లా 441 పెండింగ్ కేసులతో రెండో స్థానంలో నిలిచింది. మార్కాపురం-388, శ్రీకాళహస్తి-370, అనకాపల్లి-302 చొప్పున కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 70 మంది ఆర్డీవోలు తమ పరిధిలో సుదీర్ఘకాలంగా ఉన్న కేసుల్లో ఒక్కటీ పరిష్కరించలేదు. మార్కాపురం, పీలేరు, బద్వేలు, నగరి, బీమిలీ, ఒంగోలు, కందుకూరు, కడప, అద్దంకి, జమ్మలమడుగు, ఏలూరు, పాడేరు, గురజాల, పెద్దాపురం వంటి డివిజన్లు ఈ జాబితాలో ఉన్నాయి.
పెండింగ్‌లోనే అసైన్డ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల చట్టం(పీవోటీ)రూల్స్-2007 ప్రకారం 11 జిల్లాల పరిధిలో 91 కేసులు సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. అన్నమయ్య జిల్లాల్లో 23, చిత్తూరులో 16 కేసులున్నాయి. ఏ ఒక్క జిల్లాలో ఒక్క కేసు కూడా పరిష్కారం కాలేదు. ఇవన్నీ రివిజన్ కేసులే. అంటే జిల్లాస్థాయిలో సెటిల్ కావాల్సినవి.
అప్పిలేట్ కేసులు 63కు గాను 57 పెండింగ్‌లో ఉన్నాయి. అసైన్మెంట్ అప్పీల్ కేసుల పెండింగ్‌లోనూ కాళహస్తి డివిజన్ అగ్రస్థానంలో, విశాఖ జిల్లాభీమిలి డివిజన్ రెండోస్థానంలో ఉన్నాయి.
ఏపీ భూకబ్జా చట్టం-1905 ప్రకారం ఆరు జిల్లాల్లో 17 రివిజన్ కేసులు దాఖలయ్యాయి. ఇందులో ఒక్కటీ పరిష్కారం కాలేదు. నెల్లూరు జిల్లాల్లో గరిష్ఠంగా 9 కేసులు దాఖలయ్యాయి.
ఇదే చట్టం పరిధిలో 18 డివిజన్ల పరిధిలో 33 అప్పీల్ కేసులు దాఖలయితే ఏ ఒక్కటీ పరిష్కారం కాలేదు. అన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ జాబితాలో విశాఖ, బీమిలీ, బీమవరం, నందిగామ, తిరుపతి డివిజన్లు టాప్‌లో ఉన్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు