Share News

రాష్ట్రంలో రేర్‌ఎర్త్‌ మినరల్స్‌ కార్పొరేషన్‌!

ABN , Publish Date - Oct 19 , 2026 | 04:48 AM

భూమిలో దొరికే అరుదైన ఖనిజాల (రేర్‌ఎర్త్‌ మినరల్స్‌)కు కేంద్రం అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ నిర్ణయం తీసుకున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ముందుగానే అందిపుచ్చుకునేందుకు సిద్ధమవుతోంది.

రాష్ట్రంలో రేర్‌ఎర్త్‌ మినరల్స్‌ కార్పొరేషన్‌!
RARE EARTH

  • రాష్ట్రంలో రేర్‌ఎర్త్‌ మినరల్స్‌ కార్పొరేషన్‌!

  • అరుదైన ఖనిజాల అభివృద్ధి, వ్యాపారం కోసం ఏర్పాటు

  • సీఎం చంద్రబాబు పరిశీలనలో గనుల శాఖ ప్రతిపాదన

  • ప్రతిపాదిత ‘ఏపీ తిరమ్‌’ పాలసీలో కీలక అంశాలు

  • 2030 నాటికి 40 వేల కోట్ల పెట్టుబడుల అంచనా

  • మరో పదేళ్లకు రెట్టింపుతో పాటు 65 వేల ఉద్యోగాలు

  • భవిష్యత్‌ ప్రాజెక్టుల దృష్ట్యా ఐపీవోకు ఏపీఎండీసీ!(అమరావతి-ఆంధ్రజ్యోతి)

భూమిలో దొరికే అరుదైన ఖనిజాల (రేర్‌ఎర్త్‌ మినరల్స్‌)కు కేంద్రం అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ నిర్ణయం తీసుకున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ముందుగానే అందిపుచ్చుకునేందుకు సిద్ధమవుతోంది. అరుదైన ఖనిజాల వెలికతీత, అనుబంధ రంగాల అభివృద్ధి, వాటిని జాతీయ, రాష్ట్ర అవసరాలకు అభివృద్ధి చేయడం కోసం గనుల శాఖ ప్రణాళికలు రూపొందించింది. 2030 నాటికి ఈ రంగంలో 40 వేల కోట్ల పెట్టుబడులు రావొచ్చని అంచనా వేస్తూ.. రేర్‌ఎర్త్‌ మినరల్‌ మైనింగ్‌ కోసం ప్రత్యేక పాలసీని ప్రతిపాదించింది. రాష్ట్రంలో ప్రత్యేకంగా రేర్‌ ఎర్త్‌ మినరల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఆర్‌ఈడీసీ)ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఇప్పటికే గనుల శాఖ పరిధిలో ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ఉంది. దీనికి అనుబంధంగా కేవలం అరుదైన ఖనిజాల అభివృద్ధి, వ్యాపారం కోసం ఏపీఆర్‌ఈడీసీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఇది ప్రస్తుతం సీఎం చంద్రబాబు పరిశీలనకు వెళ్లింది. దీంతోపాటు టైటానియం, రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌, మోనోజైట్‌ ఖనిజాల మైనింగ్‌, వ్యాపారం కోసం ప్రత్యేక పాలసీలను కూడా గనుల శాఖ ప్రతిపాదించింది. దీనిపై ముఖ్యమంత్రి స్థాయిలో ఇప్పటికే పలు దఫాలుగా సమావేశాలు జరిగాయి. తుది నిర్ణయం కోసం గనుల శాఖ ఎదురుచూస్తోంది.


మైనింగ్‌పై ఏటా అదనపు ఆదాయం

ప్రతిపాదిత ఆంధ్రప్రదేశ్‌ టైటానియం-రేర్‌ఎర్త్‌ మాగ్నెట్‌ (ఏపీ తిరమ్‌) పాలసీలో గనుల శాఖ కీలక అంశాలు పొందుపరిచింది. ఇప్పటికే రాష్ట్రంలో చ్‌శాండ్‌ మైనింగ్‌కు అనుమతి వచ్చింది. ఏపీఎండీసీ తరఫున అదానీ సంస్థకు చెందిన కంపెనీ బీచ్‌శాండ్‌ మైనింగ్‌ ప్రాజెక్టు డెవలపర్‌గా కాంట్రాక్టు దక్కించుకుంది. శ్రీకాకుళం జిల్లా గార, విశాఖ జిల్లా బీమిలీలో బీచ్‌శాండ్‌ మైనింగ్‌ జరుగుతోంది. ఇంకా 16 చోట్ల మైనింగ్‌ అనుమతులు రావాల్సి ఉంది. బీచ్‌శాండ్‌ మినరల్స్‌ మైనింగ్‌ చేసి, ప్రాసెస్‌ చేసిన తర్వాతే టైటానియం మెటల్‌, ఇలిమినైట్‌, రుటైల్‌, టీఐఓ2 పిగ్‌మెంట్‌, మోనోజైట్‌లను ప్రాసెస్‌ చేయాల్సి ఉంటుంది. వీటిని దేశీయ భద్రత, ఇతర అవసరాలకు వినియోగిస్తారు. కేంద్రం అనుమతితో మిగులు ఖనిజాలను వ్యాపారం కోసం ఉపయోగిస్తారు. 2030 నాటికి మైనింగ్‌, అభివృద్ధి, వ్యాపారం కోసం ఒక్క ఏపీలోనే రూ.40 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని గనుల శాఖ చెబుతోంది. ఈ రంగంలో 20 వేల ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తోంది. 2035 నాటికి పెట్టుబడులు రెట్టింపవుతాయని, 40 వేల ఉద్యోగాలు వస్తాయని ఆ శాఖ నివేదిక చెబుతోంది. 2040 నాటికి అరుదైన ఖనిజాల రంగంలో పెట్టుబడులు లక్ష కోట్లకు చేరుతాయని, కనీసం 65 వేల ఉద్యోగాలు వస్తాయని గనుల శాఖ అంచనా. ఇదంతా ఏపీఎండీసీ ద్వారా చేపట్టలేనందున, దాని పరిధిలో పనిచేసేలా ప్రత్యేకంగా రేర్‌ఎర్త్‌ మినరల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని గనుల శాఖ ప్రతిపాదించింది. ప్రతిపాదనలు కార్యరూపం దాలిస్తే 2030 నుంచి మైనింగ్‌పై వచ్చే ఆదాయానికి ఏటా అదనంగా మరో రూ.4 వేల కోట్ల నుంచి గరిష్ఠంగా రూ.27 వేల కోట్లు రావొచ్చని ఆ శాఖ లెక్కలేసింది. అయితే అరుదైన ఖనిజాల మైనింగ్‌ను ఏపీఎండీసీ నేరుగా చేపట్టే అవకాశం కనిపించడం లేదు. ప్రాజెక్టు డెవలపర్‌ పేరిట ప్రైవేటుకే మైనింగ్‌ను కట్టబెట్టేలా గనుల శాఖ నివేదిక సారాంశంగా ఉంది.


ఐపీవో ఆలోచనలో ఏపీఎండీసీ

అరుదైన ఖనిజాల మైనింగ్‌, భవిష్యత్‌ ప్రాజెక్టులను దృష్టిలో పెట్టుకొని ఏపీఎండీసీని షేర్‌ మార్కెట్‌ వ్యాపారంలోకి దించే ఆలోచనలు ఉన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం సంస్థ చేతిలో ఉన్న, ప్రతిపాదిత ప్రాజెక్టుల నేపథ్యంలో ఏపీఎండీసీని ఐపీవో (ఇన్షియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌ )కు పెట్టేలా గనుల శాఖ ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలిసింది. ఎండీసీ పరిధిలో బొగ్గు, బాక్సైట్‌, బీచ్‌శాండ్‌ మినరల్స్‌, ఐరన్‌ ఓర్‌, బంగారం మైనింగ్‌ ప్రాజెక్టులున్నాయి. కొత్తగా అరుదైన ఖనిజాల మైనింగ్‌, వ్యాపారం కోసం రేర్‌ఎర్త్‌ మినరల్స్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు ప్రతిపాదన చేసింది. ఈ నేపథ్యంలో వ్యాపారం భారీగా పెరుగుతుందని పేర్కొంటూ గణాంకాలను సర్కారు ముందుంచింది. 2030-31 నాటికి ఐదు ఖనిజాల మైనింగ్‌ వ్యాపారంలో భారీ ఆదాయం వస్తుందని, ఈ క్రమంలో ఏపీఎండీసీని ఐపీవోలోకి దించాలని ప్రతిపాదించినట్లు తెలిసింది.

ఈ వార్తలు కూడా చదవండి..

వైసీపీకి హైకోర్టులో ఎదురుదెబ్బ.. స్థానిక ఎన్నికల నామినేషన్ల గడువు పిటిషన్ కొట్టివేత

మున్సిపల్ ఎన్నికలు.. మేయర్ అభ్యర్థులపై ఉత్కంఠ.. సీఎం నిర్ణయంపై ఆసక్తి

Updated Date - Oct 19 , 2026 | 04:48 AM