నగర ఓటరు నిరాసక్తత
ABN , Publish Date - Nov 02 , 2026 | 05:46 AM
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఆదివారం 13 నగరపాలక సంస్థలు, 79 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అయితే నగర ఓటర్లు ఓటు వేయడానికి పెద్దగా ఆసక్తి కనబరచలేదు.
ప్రధాన కార్పొరేషన్లలో అతి తక్కువ పోలింగ్
తిరుపతి నగరంలో అత్యల్పంగా 46.85శాతం పోలింగ్
విశాఖలో 50.02, గుంటూరులో 56.15శాతం
బెజవాడలో 55.35, కర్నూలులో 53.77శాతం
మున్సిపాలిటీల్లో కాస్త బెటర్
అయినా అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే..అత్యధిక పట్టణాల్లో తక్కువ ఓటింగ్
ఆదోనిలో 53.60శాతం. గుత్తిలో 55శాతం
మొత్తంగా 92 పట్టణ సంస్థల్లో సగటున60.96శాతం ఓటింగ్ నమోదు
అమరావతి, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఆదివారం 13 నగరపాలక సంస్థలు, 79 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అయితే నగర ఓటర్లు ఓటు వేయడానికి పెద్దగా ఆసక్తి కనబరచలేదు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో అత్యల్పంగా 46.85 శాతం ఓటింగ్ మాత్రమే జరిగింది. రాష్ట్ర ఆర్థిక నగరమైన గ్రేటర్ విశాఖలో 50 శాతం, రాజధాని అమరావతి ప్రాంతం పరిధిలోని గుంటూరు కార్పొరేషన్లో 56.15 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. పాలనాపరంగా కీలకమైన విజయవాడలోనూ 55.35 శాతమే
ఓటింగ్ జరిగింది. 28 జిల్లాలకు గాను 20 జిల్లాల్లోని మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో 60 శాతం పైగా పోలింగ్ జరిగినా.. 2024 అసెంబ్లీ ఎన్నికలతో (81.87శాతం ఓటింగ్) పోలిస్తే తక్కువగానే నమోదైంది. కర్నూలు జిల్లా ఆదోనిలో అత్యల్పంగా 53.60 శాతం ఓటింగ్ నమోదైంది. అనంతపురం జిల్లా గుత్తిలో 55ు, కడప జిల్లా రాజంపేటలో 58.34శాతం అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో 59.3 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. కడప జిల్లాలో మాజీ సీఎం జగన్ సొంత మున్సిపాలిటీ పులివెందులలో 70.56 శాతం పోలింగ్ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఏడు మున్సిపాలిటీల్లో 80 శాతంపైగా పోలింగ్ జరిగింది. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో అత్యధికంగా 84.36 శాతం, మార్కాపురం జిల్లా కనిగిరిలో 83.86 శాతం, కర్నూలు జిల్లా గూడూరులో 83.73 శాతం, శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో 80.58 శాతం.. నంద్యాల జిల్లా నందికొట్కూరులో 80.35 శాతం, కడప జిల్లా బద్వేలులో 80.34శాతం, విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 80.31 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తంగా 92 పట్టణ స్థానిక సంస్థల్లో సగటున 60.96 శాతం పోలింగ్ జరిగింది. 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 62.28 శాతం పోలింగ్ నమోదైంది. అప్పట్లో 12 నగరపాలక సంస్థలు, 71 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి.
శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యం: ఎస్ఈసీ
రాష్ట్రంలో 92 పట్టణ సంస్థల్లో ఆదివారం పోలింగ్ ప్రశాంతం గా జరిగిందని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) వెల్లడించింది. కడప జిల్లా పులివెందులలో మాత్రమే మాజీ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు, రాళ్లదాడి వంటి ఘటనలు చోటు చేసుకున్నాయని.. మిగిలిన రాష్ట్రమంతటా పోలింగ్ ప్రక్రియ శాంతియుతంగా కొనసాగిందని తెలిపింది. కొన్ని చోట్ల బ్యాలెట్ పేపర్లు మారిపోవడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఎక్కడా ఎన్నికలు నిలిచిపోలేదు. 2021నాటి స్థానిక ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికల నిర్వహణలో భద్రత, సాంకేతిక పర్యవేక్షణకు ప్రాధాన్యమిచ్చారు. 36,351 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రకియ్రను నిరంతరం పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటుచేసిన 13,500 సీసీ కెమెరాల ద్వారా వెబ్‌కాస్టింగ్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఎ.మల్లికార్జున పరిశీలించారు. ఎన్నికల నిర్వహణలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యమిచ్చామని, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు, డీఐజీలు, ఎన్నికల పరిశీలకులతో సమీక్షలు నిర్వహించామని పునేఠా తెలిపారు. ఎస్ఈసీ కార్యాలయంలో మల్లికార్జున, ఐజీ రాజకుమారితో కలిసి ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఫిర్యాదులు, వినతులు అందాయని చెప్పారు. వాటిపై ఎప్పటికప్పుడు పోలీసు శాఖ, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. విజయవాడలోని 55వ వార్డులో సాంకేతిక, ఇతర కారణాలతో సుమారు రెండున్నర గంటల ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో.. పోలింగ్ సమయాన్ని రాత్రి 7.30 గంటల వర కు పొడిగించినట్లు తెలిపారు. పల్నాడు, అనంతపురం జిల్లాల్లో కొన్ని ఘటనలు జరిగినట్లు కలెక్టర్లు ఎస్ఈసీ దృష్టికి తెచ్చారని పునేఠా తెలిపారు. ఐజీ రాజకుమారి మాట్లాడుతూ.. పోలింగ్ సం దర్భంగా సుమారు 40 ఘటనలు చోటుచేసుకున్నాయని.. వీటిపై 275 ఎప్ఐఆర్లు నమోదు చేసినట్లు తెలిపారు.
13 కార్పొరేషన్లలో పోలింగ్ శాతం
తిరుపతి 46.85
అనంతపురం 56.12
కడప 69.58
కర్నూలు 53.77
చిత్తూరు 62.40
నెల్లూరు 57.72
ఒంగోలు 71.27
గుంటూరు 56.15
విజయవాడ 55.35
మచిలీపట్నం 70.83
ఏలూరు 59.64
గ్రేటర్ విశాఖ 50.02
విజయనగరం 62.93
జిల్లాలవారీగా పోలింగ్ ఇలా..
అనంతపురం 62.45
శ్రీసత్యసాయి 72.53
చిత్తూరు 68.75
తిరుపతి 53.65
అన్నమయ్య 62.48
కడప 70.06
కర్నూలు 55.28
నంద్యాల 67.06
నెల్లూరు 58.91
ఒంగోలు 69.00
బాపట్ల 71.09
గుంటూరు 57.12
పల్నాడు 69.81
ఎన్టీఆర్ 72.75
కృష్ణా 72.82
తూర్పు గోదావరి 72.75
కాకినాడ 70.81
కోనసీమ 72.90
పశ్చిమ గోదావరి 72.48
ఏలూరు 61.51
అనకాపల్లి 74.6
విశాఖపట్నం 51.47
విజయనగరం 62.65
పార్వతీపురం మన్యం 68.04
శ్రీకాకుళం 65.55
అల్లర్లకు పాల్పడినవారిపై చర్యలు: డీజీపీ
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కడప, కర్నూలు, అనంతపురం సహా 20 జిల్లాల్లో 41 ఘటనలు జరిగినట్లు డీజీపీ కార్యాలయం వెల్లడించింది. మంగళగిరిలోని పోలీసు కమాండ్ కంట్రోల్ నుంచి బందోబస్తు, భద్రతను ఎప్పటికప్పుడు ఆయన పర్యవేక్షిస్తూ వచ్చారు. సీసీ కెమెరాలు, డ్రోన్లు, బాడీవార్న్ కెమెరాలు, సమర్థ యాప్ లాంటి వాటి నుంచి వచ్చిన ఫుటేజ్ ఆధారంగా క్షేత్ర స్థాయిలో పరిస్థితులను ఆయన అంచనా వేస్తూ పోలీసు అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల్లో అల్లర్లకు పాల్పడిన వారందరినీ గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఎక్కువ ఘటనలు జరిగినట్లు సమాచారంతో పాటు ఆధారాలు కూడా అందడంతో ప్రతి ఘటనలో వాస్తవాలు నిర్ధారించి.. బాధ్యులను గుర్తించాలని.. ఎన్నికల ప్రక్రియకు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారిని ఉపేక్షించవద్దని ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ప్రతి ఘటనపై సాంకేతిక ఆధారాలు సేకరించి బాధ్యులను జైలుకు పంపుతామన్నారు. అక్కడక్కడా చెదురు మదురు సంఘటనలు జరిగినా.. పోలింగ్ కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బందీ కలుగలేదని డీజీపీ తెలిపారు. బ్యాలెట్ బాక్సులను భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. కాగా.. గత ఎన్నికల సమయంలో జరిగిన ఘర్షణలు, ఎన్నికల అక్రమాలు, ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ఈదఫా ప్రత్యేక నిఘా పెట్టారు. సీసీ కెమెరాల పుటేజీని 60 రోజుల పాటు భద్రపరచాలని నిర్ణయించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాహుల్ సభకు 10 లక్షల మంది వచ్చారా.. డ్రోన్ వీడియో విడుదల చేసిన బీజేపీ..
నార్తర్న్ బుల్లెట్ ట్రెయిన్ కారిడార్‌కు ప్రధాని ఆమోదం