Share News

నేడే విడుదల!

ABN , Publish Date - Oct 14 , 2026 | 04:14 AM

‘స్థానిక’ సమరానికి నగారా మోగేది నేడే! పల్లె నుంచి నగరం దాకా... రాష్ట్రమంతటా మరోసారి ఎన్నికల వేడే! అన్ని అడ్డంకులూ తొలగిపోయాయి! రిజర్వేషన్లు ఖరారయ్యాయి! ఇక... ఆలస్యమేమీ లేదు.

నేడే విడుదల!

  • స్థానిక ఎన్నికల షెడ్యూలు ప్రకటన నేడు

  • మూడు దశల్లో జరగనున్న ‘స్థానికం’

  • ఆపై పరిషత్‌ ఎన్నికలు.. చివరిగా పంచాయతీ

  • ఈనెల 18 లేదా 19న పరిషత్‌ నోటిఫికేషన్‌

  • పంచాయతీ ఎన్నికలకు వచ్చే నెలలో జారీ

  • నేటి ఉదయం 11 గంటలకు షెడ్యూలు

  • తక్షణం రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి కోడ్‌

  • ఒకే విడతలో ముగియనున్న మునిసిపల్‌, పరిషత్‌ పోలింగ్‌

  • పంచాయతీ పోరు మాత్రం 3 విడతల్లో నిర్వహణ

‘స్థానిక’ సమరానికి నగారా మోగేది నేడే! పల్లె నుంచి నగరం దాకా... రాష్ట్రమంతటా మరోసారి ఎన్నికల వేడే! అన్ని అడ్డంకులూ తొలగిపోయాయి! రిజర్వేషన్లు ఖరారయ్యాయి! ఇక... ఆలస్యమేమీ లేదు. రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం ఉదయం 11 గంటలకు పంచాయతీలు, పరిషత్‌లు, మున్సిపాలిటీలు-కార్పొరేషన్‌ ఎన్నికల షెడ్యూలును విడుదల చేయనుంది. ఆ వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తుంది. స్థానిక ఎన్నికల ప్రక్రియలో తొలి ఓటు... మున్సి‘పోల్స్‌’దే! పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికల షెడ్యూలుతోపాటు నోటిఫికేషన్‌ కూడా బుధవారమే విడుదల కానుంది. అంటే... పట్నం బరిలో నామినేషన్ల పర్వానికి తెరలేచినట్లే! మున్సిపల్‌ ఎన్నికల తర్వాత జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌లకు ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 100 పట్టణ స్థానిక సంస్థలు, వాటిలోని వార్డులు ఈ జాబితాలో ఉన్నాయి.


‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియ రెండో దశలో 28 జిల్లా పరిషత్‌లు, 659 జడ్పీటీసీలు, ఎంపీపీలు... 9848 ఎంపీటీసీలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ నెల 18, 19 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం నోటిఫికేషన్‌ జారీచేసే అవకాశం ఉంది. చివరాఖరున... పల్లెల్లో ‘ఎన్నికల పంచాయతీ’ జరుగుతుంది. 13,185 గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, 1.32 లక్షల వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహిస్తారు. పండగల నేపథ్యంలో కొంత సమయం తీసుకుని గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు. వచ్చేనెల 13న లేదా 16న గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడే అవకాశముంది.

పుర, పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ ఒకే విడతలో ముగియనుండగా... గ్రామ పంచాయతీ ఎన్నికలు మాత్రం మూడు విడతల్లో నిర్వహించనున్నారు. డిసెంబరు 2 నుంచి 14 రోజుల్లో గ్రామ పంచాయతీల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయనున్నారు. బుధవారం వెలువడే షెడ్యూల్‌లో ఈ తేదీలపై పూర్తి స్పష్టత రానుంది. నగరపాలక సంస్థల మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్ల ఎంపిక ప్రత్యక్ష పద్ధతిలో జరగనుంది. అంటే... గ్రామ సర్పంచ్‌ల తరహాలో ప్రజలే వీరిని ఎన్నుకుంటారు. మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ అధ్యక్షులను మాత్రం... ఎన్నికల్లో నెగ్గిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఎన్నుకుంటారు.

ఈ వార్తలనూ చదవండి:

కొత్త డీఎస్సీలో 290 పోస్టులు

గిన్నిస్‌ బుక్‌లోకి 75 గంటల డప్పుమోత

Updated Date - Oct 14 , 2026 | 04:14 AM