Share News

మోగిన స్థానిక భేరి

ABN , Publish Date - Oct 15 , 2026 | 04:36 AM

స్థానిక సమరానికి నగారా మోగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్‌ను బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ విడుదల చేసింది.

మోగిన స్థానిక భేరి

  • మున్సిపల్‌, పరిషత్‌, పంచాయతీలకు షెడ్యూల్‌

  • ఒకేసారి విడుదల చేసిన ఎన్నికల సంఘం

  • రాష్ట్రమంతా అమల్లోకి వచ్చిన కోడ్‌

  • 100 పట్టణ స్థానిక సంస్థలకు నోటిఫికేషన్లు

  • ఈ నెల 28న మున్సిపల్‌ ఎన్నికలు

  • నవంబరు 3న ఎంపీటీసీ, జడ్పీటీసీలకు..

  • నవంబరు 26 నుంచి పంచాయతీలకు..

  • మూడు విడతల్లో ఎన్నికలు

  • డిసెంబరు 2 దాకా స్థానిక ఎన్నికల జోరు

  • పోలింగ్‌లో పాల్గొననున్న

  • 1.03 కోట్ల మంది పట్టణ ఓటర్లు

  • నోటిఫికేషన్‌ విడుదల చేసిన పునేఠా

అమరావతి, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): స్థానిక సమరానికి నగారా మోగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్‌ను బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ విడుదల చేసింది. ఒకేసారి మున్సిపల్‌, పరిషత్‌, గ్రామ పంచాయతీల ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల చేసింది. పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణకు తేదీలను ప్రకటించింది. ఇందులోభాగంగా 100 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికల నోటిఫికేషన్లు జారీచేసింది. మిగిలిన 23 పట్టణ స్థానిక సంస్థలకు ప్రస్తుతం నోటిఫికేషన్‌ జారీచేయలేదు. కోర్టు కేసుల కారణంగా వాటి వార్డు డీలిమిటేషన్‌ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు.

వాటికి తర్వాత నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనీల్‌చంద్ర పునేఠా తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 123 పట్టణ స్థానికసంస్థల్లో 13 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10నగర పంచాయతీలకు ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. గ్రేటర్‌ విశాఖపట్నం, విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్లతోపాటు మరో 11 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు కమిషన్‌ ఎన్నికల నోటిఫికేషన్లు జారీచేసింది. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన నాటి నుంచి డిసెంబరు 2 దాకా ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తెలిపారు. హైకోర్టులో కేసులు ఉండి, ఆలస్యమైనందున 4 కార్పొరేషన్లు, 15 మున్సిపాలిటీలు, 4 నగరపంచాయతీలతో కలిపి మొత్తం 23 పట్టణస్థానిక సంస్థలకు మరోసారి షెడ్యూల్‌ ప్రకటిస్తామస్తారు.


పార్టీల అభ్యర్థనలన్నీ పరిశీలిస్తాం..

రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశంలో అందిన అభ్యర్థనలపై చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనీల్‌చంద్రపునేఠా అన్నారు. అర్హత కలిగిన ప్రతి అభ్యర్థికీ పోటీ చేసే హక్కు ఉంటుందని, నామినేషన్ల దాఖలులో ఆటంకాలు ఎదురు కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కుల ధ్రువీకరణ పత్రాలు, నో డ్యూ సర్టిఫికెట్‌లను కూడా 24 గంటల్లోపు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీటీవీ పుటేజీ ఏర్పాటు చేస్తున్నామని, పుటేజీ స్టోరేజ్‌ 60 రోజుల వరకు ఉండేలా ఆదేశాలిస్తామన్నారు. మద్యం విచ్చలవిడి ప్రవాహంపై కట్టడికి ఎక్సైజ్‌శాఖను ఆదేశిస్తామన్నారు. అభ్యర్థుల వ్యయాలకు సంబంధించి సీనియర్‌ ఐఎఫ్ఎస్‌ అధికారిని నియమిస్తున్నామని, అదేవిధంగా శాంతిభద్రతల పర్యవేక్షణకు ఐజీ స్థాయి అధికారి అందుబాటులో ఉంటారన్నారు. బుధవారం నుంచి కోడ్‌ అమల్లోకి వస్తున్నందున జిల్లా ఎస్పీ, కలెక్టర్లు ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించాలన్నారు. నామినేషన్‌ దాఖలు చేసే సమయంలో అభ్యర్థులకు భద్రత కల్పించాలన్నారు. కొత్త పథకాలు గ్రామాల్లోగాని, పట్టణాల్లో గాని ప్రారంభించరాదన్నారు. సంక్షేమ పథకాలు యథావిధిగా అమలవుతాయన్నారు.

3942 వార్డులకు ఎన్నికలు..

రాష్ట్ర వ్యాప్తంగా 87 మున్సిపాలిటీల్లో 3942 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఎస్‌ఈసీ ఈ లిస్ట్‌ను విడుదల చేసింది. ఇందులో అత్యధికంగా తెనాలి, ప్రొద్దుటూరు, హిందూపురం, ఆదోని, నంద్యాల మున్సిపాలిటీల్లో 52 వార్డులున్నాయి. అలానే చిలకలూరిపేట, మదనపల్లె, తాడిపత్రి, గుంతకల్‌, ధర్మవరం మున్సిపాలిటీల్లో 48 వార్డులున్నాయి.

18న నామినేషన్లుమున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. అదే రోజు ఎన్నికల అధికారులు నోటీసులు జారీచేయడంతో పాటు 18న నామినేషన్లను స్వీకరిస్తారు. 19న స్కూృటినీ చేస్తారు. పట్టణ స్థానికసంస్థలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియపై అప్పీలు చేసుకునే అవకాశం లేదు. ఈ నెల 21న నామినేషన్ల ఉపసంహరణకు గడువిచ్చారు. అదే రోజు పోటీలో ఉన్నవారితో తుది జాబితా ప్రకటిస్తారు. 28వ తేదీన ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్ర 5 గంటల వరకు నిర్వహిస్తారు. ఎక్కడైనా పోలింగ్‌ నిలిచిపోతే 29న రీపోలింగ్‌ నిర్వహించి, 30న ఓట్లను లెక్కించి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు.


13 కార్పొరేషన్లకు ఎన్నికలు

విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్లలో మేయర్‌తో పాటు వార్డు సభ్యుల ఎన్నికలకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. గ్రేటర్‌ విశాఖపట్నం, విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్లకు కూడా ప్రత్యేక నోటిఫికేషన్లు విడుదల చేశారు. మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో చైర్‌పర్సన్‌తో పాటు వార్డు సభ్యులను ఎన్నుకోనున్నారు.

కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్‌, మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో వైస్‌ చైర్‌పర్సన్‌లను ఎన్నుకునేందుకు నవంబర్‌ 1న ఎన్నికైన సభ్యులకు నోటీసులు జారీచేసి, నవంబరు 5 లేక 6 తేదీల్లో ఎన్నుకుంటారు.

నవంబరు 3న ప్రాదేశిక ఎన్నికలు

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఒకే విడతలో నిర్వహించనున్నారు. ఈ నెల 19న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. అక్టోబర్‌ 21న ఎన్నికల నోటీసులు జారీచేస్తారు. 23వ తేదీ నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ కాగా, 24న పరిశీలన, 27న ఉపసంహరణ ప్రక్రియ ముగుస్తుంది. నవంబర్‌ 3న పోలింగ్‌, అవసరమైతే 4న రీపోలింగ్‌, 5న ఓట్ల లెక్కింపు చేపడతారు.

3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు

గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 విడతల్లో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది. తొలి విడత నవంబరు 13న, రెండో విడత నవంబరు 16న, మూడో విడత నవంబరు 19న నోటిఫికేషన్లు జారీ చేస్తారు. మొదటి విడతలో నవంబరు 26న, రెండో విడతలో నవంబరు 29న, మూడో విడతలో డిసెంబరు 2న పోలింగ్‌ నిర్వహిస్తారు. అవసరమైన చోట్ల వరుసగా నవంబరు 27, 30, డిసెంబరు 3వ తేదీల్లో రీపోలింగ్‌ చేపడతారు.


వదంతులను ప్రచారం చేయొద్దు

‘‘13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీ/నగర పంచాయతీలతో కలిపి మొత్తం 100 పట్టణ స్థానికసంస్థల్లో ఎన్నికలు జరుగుతాయి. 3,942 వార్డుల్లో ఎన్నికలు నిర్వహిస్తాం. 1.03 కోట్ల మంది పట్టణ ఓటర్లు ఓటు వినియోగించుకుంటారు. 12,244 పోలింగ్‌ స్టేషన్లలో 1,484 మంది రిటర్నింగ్‌ అధికారులు/ఎన్నికల అధికారులు ఈ ప్రక్రియలో పాల్గొంటారు. మరో 2,543 మంది అసిస్టెంట్‌/అడిషనల్‌ రిటర్నింగ్‌ అధికారులు/ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తారు. ఎన్నికల నిర్వహణకు 70 వేల మంది సిబ్బందిని నియమిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీలకు నామినేషన్‌ దాఖలుకు చెల్లించే ఫీజులో 50 శాతం రాయితీ. ఎన్నికల ప్రక్రియలో వదంతులను ప్రచారం చేయవద్దు.’’

- సంపత్‌కుమార్‌, మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ కమిషనర్‌ అండ్‌ డైరక్టర్‌

పరిమితి లోపలే వ్యయాలు ఉండాలి

‘‘గ్రేట్‌ విశాఖపట్నంలో మేయర్‌ అభ్యర్థి రూ.40 లక్షలు, వార్డు సభ్యులు రూ.15 లక్షల దాకా వ్యయం చేయవచ్చు. కార్పొరేషన్ల మేయర్లు రూ.25 లక్షలు, వార్డు సభ్యులు రూ.10 లక్షలు, మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్‌ రూ.20 లక్షలు, వార్డు సభ్యులు రూ.7.50 లక్షలు, నగర పంచాయతీల్లో చైర్‌పర్సన్‌ రూ.10 లక్షలు, వార్డు సభ్యులు రూ.5 లక్షల వరకు ఎన్నికల వ్యయం చేయొచ్చు. ఈ పరిమితి లోపలే వ్యయాలు ఉండాలి.’’

- మల్లికార్జునరావు, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి

ఈ వార్తలనూ చదవండి:

ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ ఎక్స్‌టెన్షన్‌ రద్దు.. అమెరికా ప్రభుత్వం వెల్లడి

హోర్ముజ్ జలసంధిలో మైన్‌ను ఢీకొని కార్గో నౌక మునక..

Updated Date - Oct 15 , 2026 | 04:37 AM