Share News

విధ్వంసం చేసేదెవరిని? రాష్ట్రాన్నా? ప్రజలనా?

ABN , Publish Date - Apr 10 , 2026 | 04:31 AM

2029లో చేయబోయే విధ్వంసం కోసం ఎదురుచూస్తున్నాం.. అని విజయవాడలో ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఎవరిని విధ్వంసం చేస్తారు? రాష్ట్రాన్నా? ప్రజలనా?’’ అని రాష్ట్ర హైకోర్టు మండిపడింది.

విధ్వంసం చేసేదెవరిని? రాష్ట్రాన్నా? ప్రజలనా?

  • 2029లో విధ్వంసం కోసం ఎదురుచూడటమా?

  • పోలీసుల చేతకానితనంతోనే ఇంకా ఇలాంటి ఫ్లెక్సీలు

  • జడ్జీలపై పోస్టులు పెట్టినప్పుడే కఠినంగా వ్యవహరించి ఉంటే ఈ పరిస్థితి ఉండేదా?

  • ఇప్పటికైనా ఉక్కుపాదంతో అణచివేయండి

  • సీఎంపై అనుచిత పోస్టులు పెట్టడమంటే 5 కోట్ల మంది ఆంధ్రులను అవమానించడమే

  • సజ్జల కేసు విచారణలో హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

అమరావతి, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): ‘‘2029లో చేయబోయే విధ్వంసం కోసం ఎదురుచూస్తున్నాం.. అని విజయవాడలో ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఎవరిని విధ్వంసం చేస్తారు? రాష్ట్రాన్నా? ప్రజలనా?’’ అని రాష్ట్ర హైకోర్టు మండిపడింది. రప్పారప్పా నరుకుతాం, విధ్వంసం సృష్టిస్తాం, గంగమ్మ జాతరే.. అంటూ కొన్ని నెలలుగా వైసీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఫ్లెక్సీలు ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే అంశంపై రాష్ట్ర న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. పోలీసుల చేతకానితనం వల్లే 2024 తరువాత కూడా అసభ్యకర పోస్టులు పెట్టే ధైర్యం వస్తోందని వ్యాఖ్యానించింది. ‘‘సోషల్‌ మీడియా కేసుల్లో దర్యాప్తును సక్రమంగా చేసి, చార్జ్‌షీట్‌తో నిందితులను కోర్టు ముందు నిలబెడితే సోషల్‌ మీడియాలో తిరిగి పోస్టులు పెట్టే ధైర్యం వారికి వచ్చేదా?’’ అని సీఐడీ, పోలీసులను ప్రశ్నించింది. సామాజిక మాధ్యమాలలో ముఖ్యమంత్రిపై అనుచిత పోస్టులు పెట్టడమంటే 5 కోట్ల మంది ఆంధ్రులను అవమానించినట్లు కాదా అని ప్రశ్నించింది. 2020లో హైకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తుల ప్రతిష్ఠను దిగజార్చేలా అసభ్యకర పోస్టులు పెట్టారని గుర్తుచేసింది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తును సీబీఐకి అప్పగించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని పేర్కొంది. పోలీసులు, సీఐడీ, సీబీఐ ఏమీ చేయలేవనే ధైర్యంతోనే మళ్లీ మళ్లీ పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. సిట్టింగ్‌ జడ్జిలపై అనుచిత పోస్టులు పెట్టినప్పుడే సీరియ్‌సగా తీసుకుని ఉంటే ప్రస్తుత పరిస్థితి వచ్చేది కాదని వ్యాఖ్యానించింది. తనపై జారీ చేసిన ఎల్‌వోసీని రద్దు చేయాలని కోరుతూ వైసీపీ సోషల్‌ మీడియా మాజీ ఇన్‌చార్జ్‌ సజ్జల భార్గవ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఇరువైపుల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది.


గురువారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టుల వ్యవహారంలో ఇమిగ్రేషన్‌ అధికారులు తనపై జారీ చేసిన ఎల్‌వోసీని రద్దు చేయాలని కోరుతూ సజ్జల భార్గవ్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం గురువారం విచారణకు రాగా సీఐడీ తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. బి.కొత్తకోట పోలీసులు నమోదు చేసిన కేసులో అన్నమయ్య జిల్లా అప్పటి ఎస్పీ కోరిన మీదట సీఐడీ అడిషనల్‌ డీజీ(నోడల్‌ అధికారి) ఎల్‌వోసీ జారీ చేయాలని ఇమిగ్రేషన్‌ అధికారులను కోరారని వివరించారు. విచారణకు రావాలని కోరినప్పటికీ పిటిషనర్‌ స్పందించలేదన్నారు. దర్యాప్తునకు సహకరించకపోవడంతోనే ఎల్‌వోసీ జారీకి ఎస్పీ అభ్యర్థించారని తెలిపారు. ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ... 2024 నవంబరు 7న ఎల్‌వోసీకి అభ్యర్థించారని, అదే ఏడాది నవంబరు 8న జారీ చేశారని గుర్తు చేశారు. సీఆర్‌పీసీ సెక్షన్‌ 41(ఏ) ప్రకారం నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని హైకోర్టు ఆదేశించిందన్నారు. కేసు నమోదు చేశాక పిటిషనర్‌కు ఎప్పుడైనా నోటీసులు ఇచ్చి పిలిచారా? పిలిస్తే ఎప్పుడు పిలిచారు? భార్గవ్‌రెడ్డి అందుబాటులో లేకపోతే కుటుంబ సభ్యులకు నోటీసులు ఎందుకు అందజేయలేదు? నోటీసులు ఇస్తే తీసుకోలేదని, దర్యాప్తునకు సహకరించలేదని అనేందుకు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అని పోలీసులను ప్రశ్నించారు. పోలీసుల చేతకానితనంతోనే సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్నారని వ్యాఖ్యానించారు. 2024 నవంబరు 8న ఎల్‌వోసీ జారీ చేశారని, దాని కాలపరిమితి ఏడాది మాత్రమే ఉంటుందని గుర్తు చేశారు. 2025 నవంబరు 7తో ఏడాది గడువు ముగిసిందని పేర్కొన్నారు.

  • రాజకీయ పార్టీల మధ్య సైద్ధాంతిక విభేదాలు ఉండవచ్చు. అంశాలవారీగా విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోవచ్చు. కానీ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రుల కుటుంబ సభ్యులను అవమానించేలా మాట్లాడే హక్కు ఎవరిచ్చారు? వ్యక్తిగత ప్రతిష్ఠను దిగజార్చే హక్కు ఎవరికీ లేదు.

- హైకోర్టు

Updated Date - Apr 10 , 2026 | 04:31 AM