ఐటీలోనూ లూటీ!
ABN , Publish Date - May 21 , 2026 | 05:06 AM
ఆరోగ్య శాఖలో అవినీతి అంతా ఇంతా కాదు. మందుల కొనుగోళ్లు.. వైద్య పరికరాల కొనుగోళ్లు.. బిల్లుల చెల్లింపులు.. చివరికి టెండర్ ప్రక్రియలోనూ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు.
గతంలో కేంద్ర సర్వీస్‌లో ఉన్న ఢిల్లీ డీల్స్ అధికారి ఐటీ శాఖలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో అక్కడ కొన్ని ఐటీ కంపెనీలతో సత్సంబంధాలు ఏర్పడ్డాయి. ఏపీలోనూ కొంత కాలం ఐటీ శాఖలో విధులు నిర్వహించారు. ఏ శాఖకు వెళ్లినా అస్మదీయ ఐటీ కంపెనీలను తీసుకువచ్చి కీలకమైన ఐటీ బాధ్యతలు అప్పగించడం, తద్వారా కొంత వెనకేసుకోవడం ఆయనకు మామూలైంది. ఆరోగ్య శాఖకు వచ్చినప్పటి నుంచీ ఇదే పనిలో ఉన్నారు. అస్మదీయ కంపెనీలకు టెండర్లు దక్కేలా అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు.
ఆరోగ్య శాఖ టెండర్లలో ఇష్టారాజ్యం
ఐటీ సేవలన్నీ అస్మదీయ కంపెనీకి అప్పగించేలా ఢిల్లీ డీల్స్ అధికారి ప్లాన్
రూ.2.75 కోట్ల విలువైన టెండర్ రూ.5 కోట్లకు పెంపు
సదరు కంపెనీ డిస్‌క్వాలిఫై కావడంతో టెండర్ రద్దు చేయాలని ఒత్తిడి
‘పాపులేషన్ మేనేజ్‌మెంట్’లోనూ ఇంతే
మరో అస్మదీయ కంపెనీ కోసం మూడుసార్లు టర్నోవర్ మార్చిన వైనం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఆరోగ్య శాఖలో అవినీతి అంతా ఇంతా కాదు. మందుల కొనుగోళ్లు.. వైద్య పరికరాల కొనుగోళ్లు.. బిల్లుల చెల్లింపులు.. చివరికి టెండర్ ప్రక్రియలోనూ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా ‘ఢిల్లీ డీల్స్’ అధికారి అవినీతి దాహానికి అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఆరోగ్య శాఖ పిలిచే ప్రతి టెండర్‌లోనూ ‘నాకేంటి’ అన్న ధోరణిలో వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సంజీవని, సిటిజన్ హెల్త్ స్ర్కీనింగ్, పాపులేషన్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టులలోనూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కొన్ని టెండర్లలో ముందుగానే కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని వాటికి అనుగుణంగా టెండర్ నిబంధనలు రూపొందించడం, వాటికే టెండర్ వచ్చేలా ఒత్తిడి చేయడం సదరు అధికారికి అలవాటుగా మారింది. ఈ మధ్యకాలంలో ఆరోగ్య శాఖలో ఐటీ సేవలపై ఢిల్లీ డీల్స్ అధికారి కన్ను పడింది. ఐటీ పేరుతో కోట్లు లూటీ చేసేద్దామని స్కెచ్ వేశారు. ముఖ్యంగా ఎన్‌హెచ్‌ఎం (నేషనల్ హెల్త్ మిషన్)లో ఐటీ సేవలు చాలా కీలకం. ఆశా వర్కర్ దగ్గరి నుంచి పీహెచ్‌సీ వైద్యుల వరకూ ప్రతి ఒక్కరికి ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ ద్వారానే వారు కీలకమైన నివేదికలు ఎన్‌హెచ్‌ఎంకు పంపిస్తుంటారు. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఏ సర్వే చేపట్టినా యాప్‌ల ద్వారా నివేదికలు తెప్పించుకుంటుంది. ఎన్‌హెచ్‌ఎంలో దాదాపు 40 యాప్‌ల వరకూ ఉపయోగిస్తున్నారు. ఈ యాప్‌లను నిర్వహించేందుకు ఒక ఐటీ కంపెనీని టెండర్ ప్రక్రియ ద్వారా ఐదేళ్ల క్రితం ఎంపిక చేశారు. ఈ ఏడాది జనవరిలో ఆ టెండర్ గడువు పూర్తయింది. ఇప్పుడు మళ్లీ టెండర్లు ఆహ్వానించి కొత్త ఐటీ కంపెనీని ఎంపిక చేసి, యాప్‌ల నిర్వహణ బాధ్యతను అప్పగించాలి. ఢిల్లీ డీల్స్ అధికారి కన్ను దీనిపై పడింది.
ఐటీ కార్యకలాపాలు, డేటా కలెక్షన్‌పై దృష్టిపెట్టారు. వారానికి రెండు సార్లు వీడియో కాన్ఫరెన్స్‌లు, రోజు కోసారి టెలీకాన్ఫరెన్స్‌లు నిర్వహించడం, రోజువారీ డేటా ఇవ్వడంటూ ఆశా వర్కర్ దగ్గర నుంచి వైద్యులు, డీఎంహెచ్‌వోలు చివరికి హెచ్‌వోడీల వరకూ ఒత్తిడి చేస్తున్నారు. అడిగిన డేటా ఇవ్వకపోతే వారికి తిట్లదండకం తప్పదు. గత ఏడు నెలల నుంచి ఆరోగ్య శాఖలో ఇదే తంతు. ఇదంతా అస్మదీయ ఐటీ కంపెనీలను ఆరోగ్య శాఖలోకి తీసుకురావడానికే అన్న విషయం ఇప్పుడు బహిర్గతమైంది. ఎన్‌హెచ్‌ఎం ఐటీ టెండర్ల విలువ రెండింతలు చేశారు. ప్రస్తుతం ఎన్‌హెచ్‌ఎం ఐటీ సేవలకు నెలకు రూ.23 లక్షలు చెల్లిస్తోంది. అంటే.. ఏడాదికి రూ.2.76 కోట్లు. ఆ మొత్తాన్ని ఢిల్లీ డీల్స్ అధికారి ఏకంగా రూ.5 కోట్లకు పెంచారు. ఈ టెండర్‌ను అస్మదీయ కంపెనీకి అప్పగించాలని విశ్వప్రయత్నాలు చేస్త్తున్నారు.
ఉన్నతాధికారులపై తిట్లదండకం
ఎన్‌హెచ్‌ఎంలో ఐటీ సేవల కోసం ఆరోగ్యశాఖ కమిషనర్ విన్నపం మేరకు ఏపీటీఎస్(ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ సర్వీసెస్) టెండర్లు ఆహ్వానించింది. మే మొదటి వారంలో పిలవగా నాలుగు కంపెనీలు బిడ్లు వేశాయి. ఇందులో ప్రస్తుతం ఐటీ సేవలు అందిస్తున్న కంపెనీతో పాటు ఢిల్లీ డీల్స్ అధికారి అస్మదీయ ఐటీ కంపెనీ కూడా ఉన్నాయి. మూడు కంపెనీలు అర్హత సాధించాయి. ఆ అధికారి అస్మదీయ కంపెనీ మాత్రం డిస్‌క్వాలిఫై అయింది. ఈ విషయం తెలియగానే ఆయన ఆగ్రహం చెందారు. ఆరోగ్య శాఖ కమిషనరేట్‌లో ఉన్నతాధికారులందరిపై ఒక రౌండ్ తిట్లదండకం అందుకున్నారు. ఏపీటీఎస్ అధికారులతో మాట్లాడి అస్మదీయ కంపెనీకి అర్హత కల్పించాలని కోరారు. ఏపీటీఎస్లో ఉన్న కీలక అధికారి దీనికి అంగీకరించలేదు. అయినా, టెండర్లు రద్దు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు.
మూడోసారి టెండర్
ముఖ్యమంత్రి చంద్రబాబు పాపులేషన్ మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇందులో ఆరోగ్య శాఖ కీలక బాధ్యతలు నిర్వహిస్తోంది. ప్రజలు ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ప్రచారం చేసే బాధ్యత ఆరోగ్య శాఖకు అప్పగించారు. ఈ దిశగా గ్రామాలు, గిరిజన ప్రాంతాలు, పట్టణాల్లో మహిళలను ప్రోత్సహించి, వారిలో అవగాహన కల్పించే బాధ్యతను ఆరోగ్య శాఖ ఒక ప్రైవేటు కంపెనీకి అప్పగించాలని ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసింది. సదరు కంపెనీ సోషల్ మీడియా, ఇతర సామాజిక మాధ్యమాల్లోనూ మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఈ టెండర్లను కూడా ఏపీటీఎస్కు అప్పగించారు. టెండర్ పిలవక ముందే ఢిల్లీ డీల్స్ అధికారి ఢిల్లీకి చెందిన ఐటీ కంపెనీతో మాట్లాడుకున్నారు. టెండర్లలో సదరు కంపెనీ అర్హత సాధించలేదు. దీంతో టర్నోవర్‌ను మూడుసార్లు తగ్గించారు. తొలుత రూ.8 కోట్లు టర్నోవర్ పెట్టారు. దానిని రూ.4కోట్లకు తగ్గించారు. అయినా సదరు కంపెనీ అర్హత సాధించలేదు. దీంతో ఇప్పుడు టర్నోవర్‌ను రూ.1.5 కోట్లకు తగ్గించారు. ఇప్పటి వరకూ రెండుసార్లు టెండర్లు రద్దు చేసి తాజాగా మూడోసారి టెండర్ పిలిచారు.