మున్సిపల్ రిజర్వేషన్ల ఖరారులో..కట్టుదిట్టంగా రోస్టర్!
ABN , Publish Date - Oct 13 , 2026 | 04:21 AM
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారులో కూటమి ప్రభుత్వం రోస్టర్ విధానాన్ని కట్టుదిట్టంగా పాటించింది.
గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దిన కూటమి ప్రభుత్వం
(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారులో కూటమి ప్రభుత్వం రోస్టర్ విధానాన్ని కట్టుదిట్టంగా పాటించింది. గత ప్రభుత్వం ఈ విధానాన్ని తుంగలో తొక్కి అడ్డగోలుగా రిజర్వేషన్లు కేటాయించింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పదవుల కేటాయింపులో జనాభా నిష్పత్తిని పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో బలహీనవర్గాలకు న్యాయంగా దక్కాల్సిన అవకాశాలు రాలేదు. బీసీ రిజర్వేషన్లను నిర్ణయించేందుకు ప్రత్యేక కమిషన్‌ను నియమించాలన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల విషయంలోనూ 2011 జనాభా లెక్కల ఆధారంగా జనాభా శాతం అధికంగా ఉన్న పట్టణాలకు ప్రాధాన్యం ఇవ్వలేదన్న ఆరోపణలున్నాయి. ఈ తప్పులన్నీ కూటమి ప్రభుత్వం సరిదిద్ది రాజ్యాంగ పరిధిలో నిర్ణయాలు తీసుకుంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో డెడికేటెడ్ కమిషన్‌ను నియమించి.. దాని నివేదిక ఆధారంగా బీసీ రిజర్వేషన్లను ఖరారుచేసింది. 2011 జనగణనను అనుసరించి.. సంబంధిత వర్గాల జనాభా నిష్పత్తిని పరిగణనలోకి తీసుకుని.. అవరోహణ క్రమంలో రిజర్వేషన్ అమలు చేసి.. బలహీన వర్గాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంది.
జగన్ నిర్వాకమిదీ..
రాష్ట్రంలోని 17 కార్పొరేషన్ల మేయర్ పదవుల రిజర్వేషన్ల విషయంలో 2021లో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పరిశీలిస్తే.. అధిక శాతం బీసీలున్న కార్పొరేషన్లను పక్కనపెట్టి కడప మేయర్ పదవిని బీసీలకు కేటాయించారు. బీసీ జనాభా ఎక్కువగా ఉన్న నగరాల్లో ఏలూరు నాలుగో స్థానంలో, కాకినాడ 6వ స్థానంలో ఉండగా.. వీటిని పక్కనపెట్టేశారు. జగన్ అనుచరుడైన పాకా సురేశ్ కోసం బీసీ జనాభాపరంగా 11వ స్థానంలో ఉన్న కడపను బీసీలకు ఇచ్చారు. అంటే రిజర్వేషన్‌ను మార్చేశారు. అదే విధంగా చైర్‌పర్సన్ల పదవుల కేటాయింపులోనూ వివాదం ఉంది. 32 చైర్‌పర్సన్ పదవులను బీసీలకు కేటాయించారు.
కానీ ఇది బీసీ జనాభా శాతం ఆధారంగా చేయలేదు. బీసీ జనాభా ఎక్కువగా ఉన్న పట్టణాల్లో ఇచ్ఛాపురం రెండో స్థానంలో(82.07శాతం), పాలకొండ ఆరో స్థానంలో(78.17శాతం), నెల్లిమర్ల ఏడో స్థానంలో(77.81శాతం) ఉండగా.. చైర్‌పర్సన్ పదవులను ఎస్సీలకు కేటాయించారు. 46.67 శాతంతో 70వ స్థానంలో ఉన్న చీమకుర్తి చైర్మన్ పదవిని బీసీ జనరల్‌కు ఇచ్చారు. 106 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో ఎస్టీ జనాభా శాతం ఆధారంగా మూడు చైర్‌పర్సన్ పదవులు ఆ వర్గానికి దక్కాలి. ఎస్టీ జనాభా శాతం 10.92గా ఉన్న గూడూరును కేటాయించకుండా.. కేవలం 3.17 శాతం ఎస్టీ జనాభా ఉన్న శ్రీకాళహస్తికి ఎస్టీ రిజర్వేషన్ కల్పించారు. ఇక ఎస్సీ జనాభా శాతం అధికంగా ఉన్న ఏలేశ్వరం(23.64శాతం), సూళ్లూరుపేట (23.03శాతం) వంటి పట్టణాలను వారికి కేటాయించలేదు. చీరాల పట్టణంలో ఎస్సీ జనాభా సంఖ్య 18,735గా ఉన్నా చైర్‌పర్సన్ పదవి ఆ వర్గానికి దక్కలేదు. ఎస్సీ జనాభాపరంగా 60వ స్థానంలో ఉన్న పుత్తూరు, 71వ స్థానంలో ఉన్న పాలకొండ, 75వ స్థానంలో ఉన్న నర్సీపట్నం, 94వ స్థానంలో ఉన్న నెల్లిమర్లను ఆ వర్గానికి కేటాయించారు. ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలే.
ఈ వార్తలనూ చదవండి: