నియోజకవర్గానికి రూ.కోటి
ABN , Publish Date - Oct 13 , 2026 | 04:06 AM
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా ఆస్తులను సృష్టించడమే లక్ష్యంగా ప్రభుత్వం 175 నియోజకవర్గాల కోసం రూ.175 కోట్ల ప్రత్యేక అభివృద్ధి నిధులు విడుదల చేసింది.
నియోజకవర్గాల్లో స్థానికంగా అభివృద్ధి పనులకు ఊతం
175 కోట్లు మంజూరు.. ఎమ్మెల్యేల సిఫారసులకే పెద్దపీట
మతపరమైన పనులకు ఈ నిధులు నిషిద్ధం
అమరావతి, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా ఆస్తులను సృష్టించడమే లక్ష్యంగా ప్రభుత్వం 175 నియోజకవర్గాల కోసం రూ.175 కోట్ల ప్రత్యేక అభివృద్ధి నిధులు విడుదల చేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికీ రూ.కోటి చొప్పున కేటాయించింది. స్థానిక ఎమ్మెల్యేల సిఫారసుల మేరకు జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ఈ పనులు పారదర్శకంగా చేపట్టాలని స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది. జనరల్ కేటగిరీకి రూ.108.34 కోట్లు, ఎస్సీ సబ్‌ప్లాన్ కింద రూ.51.91 కోట్లు, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద రూ.14.74 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులను కేవలం ప్రభుత్వ ఆస్తుల నిర్మాణం కోసమే వాడాలని, ఎట్టి పరిస్థితుల్లో మతపరమైన పనులకు లేదా ప్రైవేట్ స్థలాల అభివృద్ధికి ఉపయోగించరాదని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
నిధులను ఎమ్మెల్యేలు స్థానిక ప్రజల తక్షణ అవసరాలైన తాగునీరు, డ్రైనేజీలు, ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల ఆధునికీకరణ కోసం ఉపయోగించాల్సి ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఇతర పథకాల కింద ఇప్పటికే మంజూరైన పనులకు ఈ నిధులను వాడకూడదు. ఒకే పనికి రెండు చోట్ల నిధులు డ్రా చేయడం నిషిద్ధం. నిర్వహణ ఖర్చులు, జీతాలు, ఎస్టాబ్లి్‌షమెంట్ చార్జీలు, రెవెన్యూ ఖర్చుల కోసం వాడకూడదు. పనులను నామినేషన్ పద్ధతిలో ఇవ్వకూడదు. టెండర్ ప్రక్రియను తప్పించుకోవడానికి పెద్ద పనులను చిన్నముక్కలుగా చేయకూడదు.
చేయదగ్గ పనులు
తాగునీటి సౌకర్యాలు, నీటిపారుదల చెరువులు, కాలువల పూడికతీత, భూగర్భజలాల రీచార్జ్ నిర్మాణాలు, కల్వర్టులు, వంతెనలు, ఫుట్‌పాత్‌లు, కాలిబాటల నిర్మాణం, బహిరంగ డ్రైనేజీలు, లింక్ రోడ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీటి వసతులు, పబ్లిక్ టాయిలెట్లు, ప్రభుత్వ పశువైద్యశాలలు, ఆరోగ్య కేంద్రాల భవనాల నిర్మాణం, ప్రభుత్వ విద్యాసంస్థల్లో తరగతి గదులు, లేబొరేటరీలు, మరుగుదొడ్ల నిర్మాణం, కమ్యూనిటీ హాళ్లు, ఉర్దూ ఘర్, గ్రామ పంచాయతీల భవనాలు, రీడింగ్ రూమ్‌ల నిర్మాణం, శ్మశాన వాటికల చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం, రైతు ఉత్పత్తుల కోసం స్టోరేజీ సౌకర్యాలు, వృద్ధులు, దివ్యాంగుల కోసం పబ్లిక్ షెల్టర్లు, వీధి దీపాల ఏర్పాటు, వారసత్వ కట్టడాల పునరుద్ధరణ, మరమ్మతులు.
క్షేత్రస్థాయిలో తనిఖీలు:
పనుల్లో నాణ్యతను పరిశీలించేందుకు రాష్ట్రస్థాయి హెచ్‌వోడీలు, జిల్లా కలెక్టరు/అధికారులు కనీసం 5 శాతం నుంచి 10 శాతం పనులను క్షేత్రస్థాయిలో స్వయంగా తనిఖీ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. పనులు పూర్తయిన తర్వాత ఆడిట్ నిర్వహించి యుటిలైజేషన్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది.
ఈ వార్తలనూ చదవండి: