ఇలాగైతే ఎలా జగనూ?
ABN , Publish Date - Jun 05 , 2026 | 05:10 AM
ఓ డీఎస్సీ అభ్యర్థికి ఉద్యోగం పొందడానికి మెరిట్ ర్యాంకు రాలేదు. కానీ తనకు ఉద్యోగం ఇవ్వకుండా అన్యాయం చేశారని చెప్పారు. అంతే.. జగన్ నమ్మేశారు.
ఉద్యోగాలకు మెరిట్, రిజర్వేషన్లు వద్దా?
టీచర్ పోస్టులు రానివారికి సాధ్యం కాని హామీలా..
వారికి ఎందుకు ఉద్యోగాలు రాలేదో గతేడాదే వివరించిన పాఠశాల విద్యాశాఖ
నిబంధనలు, రిజర్వేషన్లు పాటించినట్టు వెల్లడి
అయినా అన్యాయం చేశారని వైసీపీ గగ్గోలు
డీఎస్సీ అభ్యర్థులను రెచ్చగొట్టే యత్నం
తమ ప్రభుత్వంలో న్యాయం చేస్తామని జగన్ హామీ
నిబంధనలకు విరుద్ధంగా ఎలా ఇస్తారనే ప్రశ్నలు
మెరిట్‌లో ఉద్యోగాలు వచ్చిన వారి పరిస్థితి ఏంటి?
జగన్ తీరుపై సర్వత్రా విస్మయం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఓ డీఎస్సీ అభ్యర్థికి ఉద్యోగం పొందడానికి మెరిట్ ర్యాంకు రాలేదు. కానీ తనకు ఉద్యోగం ఇవ్వకుండా అన్యాయం చేశారని చెప్పారు. అంతే.. జగన్ నమ్మేశారు. మరో అభ్యర్థి అంగవైకల్యం శాతం ఎక్కువ చూపించి తనకు ఆ కోటాలో ఉద్యోగం ఇవ్వకుండా తిరస్కరించారని చెప్పారు. అవునా.. అంటూ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ఇంకో అభ్యర్థి తెలుగు సబ్జెక్టే చదవకుండా ఉద్యోగం ఇవ్వలేదన్నారు. మాట తప్పను.. మడమ తిప్పనని చెప్పుకొనే జగన్ తమ ప్రభుత్వంలో న్యాయం చేస్తానని హామీ ఇచ్చేశారు.
ఐదేళ్లు సీఎంగా పనిచేసిన వైసీపీ అధినేత.. ర్యాంకులు, రిజర్వేషన్ ఇవేవీ పట్టించుకోకుండా వారికి అన్యాయం చేశారంటూ ఏకపక్షంగా చెప్పేశారు. పైగా తమ ప్రభుత్వంలో వీటిపై పునఃవిచారణ చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. డీఎస్సీలో తమకు ఉద్యోగాలు ఇవ్వలేదంటూ పలువురు అభ్యర్థులు కలిసినపుడు జగన్ వ్యవహరించిన తీరిది. వైసీపీ నాయకులే దగ్గరుండి బుధవారం వారిని ఆయన వద్దకు తీసుకెళ్లారు. అయితే గతేడాదే వారికి ఎందుకు ఉద్యోగాలు రాలేదో పాఠశాల విద్యాశాఖ వివరించింది. హారింజటల్ రిజర్వేషన్ విధానం, అంగవైకల్యం నిబంధనలు, తప్పనిసరిగా చదవాల్సిన సబ్జెక్టుల నిబంధనలను సవివరంగా వివిధ దశల్లో వివరించారు. అయితే డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ తప్పుడు ప్రచారం ప్రారంభించగానే వీరంతా తెరపైకి వచ్చారు. ఈ అభ్యర్థులను అడ్డుపెట్టుకుని కూటమి ప్రభుత్వంపై బురదచల్లే ప్రయత్నాలను వైసీపీ ముమ్మరం చేసింది. మాజీ సీఎం జగన్ ఇందుకు వంత పాడారు. డీఎస్సీ నిబంధనలు ఏంటి? అభ్యర్థుల ర్యాంకులు, వివరాలు ఏంటి? ఎందుకు ఉద్యోగం రాలేదు? అన్నది జగన్ అసలు ఆలోచించకుండా, పరిశీలించకుండా.. కూటమి ప్రభుత్వాన్ని నిందించడం కోసం అభ్యర్థులకు అన్యాయం చేశారని ఆరోపించారు. అయితే హారిజంటల్ రిజర్వేషన్ విధానం ప్రారంభమైందే 2023లో వైసీపీ హయాంలోనే. హారిజంటల్ రిజర్వేషన్‌పై జీవో 77 జారీచేసింది కూడా అప్పుడే. దానినే కూటమి ప్రభుత్వం యథాతథంగా అమలు చేస్తోంది. ఏ ప్రభుత్వం ఉన్నా/వచ్చినా నిబంధనల ప్రకారం ఈ అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. అయినా కళ్లు మూసుకుని తెరిస్తే మూడేళ్లు గడిచిపోతాయని, ఆ వెంటనే మీకు ఉద్యోగాలు వచ్చేస్తాయని జగన్ వారికి చెప్పారు. ఆయన తీరు సర్వత్రా ఆశ్చర్యం, విస్మయం కలిగిస్తోంది. జగన్‌ను కలిసిన డీఎస్సీ అభ్యర్థులలో కొందరి విషయంలో అసలు ఏం జరిగిందంటే...
ఎం.ఏకాంబరం.. చిత్తూరు జిల్లాకు చెందిన బీసీ-డీ కేటగిరీ అభ్యర్థి. సోషల్ స్టడీస్‌లో 125వ ర్యాంకు సాధించారు. బీసీ-డీలో ఏడు పోస్టులుండగా.. 114 ర్యాంకు వరకు మొదటి 5 పోస్టులు భర్తీ అయ్యాయి. అనంతరం హారిజంటల్ రిజర్వేషన్ అమలులో భాగంగా 139 ర్యాంకు సాధించిన కె.యువరాజు(దివ్యాంగుల కోటా), 906 ర్యాంకు అభ్యర్థి ఎ.వసంత(దివ్యాంగుల కోటా) ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మెరిట్‌లో ఉద్యోగం రావాలంటే.. ఏకాంబరం 114 కంటే తక్కువ ర్యాంకు సాధించి ఉంటే ఉద్యోగం వచ్చేది. మెరిట్‌లో దివ్యాంగులు లేనందున చివరి పోస్టులు హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం తప్పనిసరిగా వారికి కేటాయించాలి. అదే ప్రభుత్వం అమలుచేసింది. జగన్‌ను కలిసిన ఈ అభ్యర్థి తనకు అన్యాయం జరిగిందని చెప్పారు. తన పోస్టును హారిజంటల్ రిజర్వేషన్ కోటాలో వేరేవారికి ఇచ్చేశారని ఆరోపించారు.
అంజినప్ప.. శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన అభ్యర్థి. దృష్టిలోపం ఉన్నప్పటికీ తనను కావాలని ఉద్యోగానికి తిరస్కరించారనేది ఆయన ఆరోపణ. తనకు 40శాతం వైకల్యంతో సర్టిఫికెట్ ఉందని జగన్‌ను కలిసిన సమయంలో చెప్పారు. అయితే 30 శాతం వైకల్యంతోనే సర్టిఫికెట్ ఉందని జిల్లా విద్యాశాఖ అధికారులు ధ్రువీకరించుకున్నారు. అనంతరం ఆయన కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మరోసారి కంటి పరీక్షలు నిర్వహించగా 30 శాతం వైకల్యమే ఉన్నట్లు నిర్ధారణైంది. దీంతో దివ్యాంగుల కోటాలో ఆయనకు ఉద్యోగం రాదని పాఠశాల విద్యాశాఖ తేల్చింది.
సీహెచ్ నరసింహారావు.. ప్రకాశం జిల్లాకు చెందిన అభ్యర్థి. బయాలజీ సబ్జెక్టు స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు పరీక్ష రాసి 76వ ర్యాంకు సాధించారు. ఆ జిల్లాలోని పోస్టుల్లో వర్టికల్ రిజర్వేషన్ ప్రకారం పోస్టులు భర్తీ చేసిన తర్వాత హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేయాల్సిన స్థితిలో 137వ ర్యాంకు సాధించిన మెర్సీ క్రిస్టినాకు(దివ్యాంగుల) కోటాలో ఉద్యోగం దక్కింది. అయితే తనకు అన్యాయం చేసి 137వ ర్యాంకర్‌కు ఉద్యోగం ఇచ్చారని నరసింహారావు ఆరోపించారు.
మహమ్మద్ షాబుద్దీన్.. విశాఖపట్నం జిల్లాకు చెందిన అభ్యర్థి. ఫిజికల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేశారు. బీసీ-ఈ కేటగిరీలో మూడో ర్యాంకు సాధించారు. అయితే డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకారం ఈ పోస్టుకు టెన్త్ లేదా ఇంటర్మీడియట్‌లో తెలుగును ప్రథమ భాషగా చదవాలి. లేనిపక్షంలో డిగ్రీలో అయినా ఒక సబ్జెక్టు తెలుగు ఉండాలి. కానీ షాబుద్దీన్ టెన్త్ వరకూ ఉర్దూ మీడియంలో చదివారు. ఇంటర్ నుంచి ఇంగ్లిష్ మీడియంలో చదివారు. సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో ఏ దశలోనూ తెలుగు చదవలేదనే విషయం తెలిసింది. దీంతో తిరస్కరణకు గురయ్యారు.