కేంద్రం తీరుతో.. మా హక్కులకు భంగం
ABN , Publish Date - Feb 19 , 2026 | 03:55 AM
కృష్ణా జలాల వ్యవహారంలో కేంద్రం తీరుతో రాష్ర్టాల హక్కులకు భంగం కలుగుతోందని సుప్రీంకోర్టుకు ఆంధ్రప్రదేశ్ తెలిపింది.
కృష్ణా జలాల పంపిణీపై ‘సెక్షన్-3’ టీవోఆర్ చెల్లదు!
సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ వాదనలు
విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారమే
నీటి కేటాయింపులు ఉండాలి
ప్రాజెక్టులవారీగా ఆంక్షలు సహేతుకం కాదు
అదనపు అంశాలను పరిశీలించే అధికారం
బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్‌కు లేదు: ఏపీ
2002లోపు వచ్చిన ట్రైబ్యునల్ తీర్పులపై
పునఃసమీక్ష కుదరదు: చీఫ్ జస్టిస్
వాటి కేటాయింపులకు చట్ట రక్షణ ఉంది
విభజన చట్టం, టీవోఆర్‌పై లోతైన పరిశీలన అవసరం
ఈ నెల 25న సమగ్రంగా వాదనలు వింటాం
త్రిసభ్య ధర్మాసనం వెల్లడి.. విచారణ వాయిదా
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాల వ్యవహారంలో కేంద్రం తీరుతో రాష్ర్టాల హక్కులకు భంగం కలుగుతోందని సుప్రీంకోర్టుకు ఆంధ్రప్రదేశ్ తెలిపింది. కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్‌కు కేంద్రం జారీ చేసిన సెక్షన్-3 నిబంధనావళి (టీవోఆర్) సరికాదని, ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం కలిగే అవకాశముందని తెలిపింది. కేంద్ర నిర్ణయం ఆమోదయోగ్యం కాదని, నదీ జలవివాద చట్టం ప్రకారం.. బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్‌కు ఇలా అదనపు అంశాలు పరిశీలించే అధికారం లేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది. కృష్ణా జలాలను రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 89 ప్రకారం ఏపీ, తెలంగాణకు ప్రాజెక్టుల వారీగా కేటాయించాలని తొలుత నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం తొలుత బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్‌కు కేంద్రం మార్గదర్శకాలు జారీచేసింది. అయితే దీనివల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, అంతరాష్ట్ర నదీజలాల చట్టం-1956లోని సెక్షన్ 3 ప్రకారం కృష్ణాజలాల పునఃపంపిణీ చేపట్టాలని కేంద్రాన్ని ఆ ప్రభుత్వం కోరింది. సుదీర్ఘకాలం తర్వాత 2023 అక్టోబరు 6న కేంద్రం ట్రైబ్యునల్‌కు నూతన మార్గదర్శకాలిచ్చింది. సెక్షన్ 3 ప్రకారం ఇరురాష్ర్టాల మధ్య కృష్ణాజలాల పంపిణీ చేపట్టాలని నిబంధనావళి(టీవోఆర్) జారీచేసింది. ఈ టీవోఆర్‌ను రద్దు చేయాలని ఏపీ అదే ఏడాది అక్టోబరు 17న సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం నీటి కేటాయింపులకు రక్షణ ఉందని, ఇప్పటికే సెక్షన్ 89ఏ, బీ కింద.. రెండు తెలుగు రాష్ర్టాల మధ్య నీటిని ప్రాజెక్టుల వారీగా కేటాయించే అంశాన్ని ట్రైబ్యునల్ పరిశీలిస్తుండగా.. కొత్త అంశాలు చేర్చడం తగదని తన పిటిషన్‌లో స్పష్టం చేసింది. ఆ వ్యాజ్యం బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం.పంచోలితో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఏపీ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. విభజన చట్టం-2014లోని నిబంధనలకు విరుద్థంగా కేంద్రం కొత్త టీవోఆర్ జారీ చేసిందని, అది చెల్లదని తెలిపారు. కృష్ణాజలాల పంపిణీలో చట్టబద్థమైన ట్రైబ్యునల్ పరిధిని కుదించేలా కేంద్రం వ్యవహరించడం సరికాదన్నారు.
సెక్షన్ 89 ప్రకారమే జలాల పంపిణీ
ఏపీ, తెలంగాణ విడిపోయిన తర్వాత విభజన పంపకాలు జరిగాయని ఏపీ తరఫు న్యాయవాదులు తెలిపారు. ‘రాష్ట్ర విభజన చట్టం-2014లోని సెక్షన్ 89 ప్రకారం కృష్ణాజలాల పంపిణీ జరగాలనేది పార్లమెంటు వేదికగా తీసుకున్న నిర్ణయం. కానీ కేంద్రం కొత్తగా సెక్షన్ 3 కింద టీవోఆర్‌ను తీసుకురావలసిన అవసరం ఏముంది? ఇది ముమ్మాటికీ ఏపీకి నష్టం చేకూర్చే పనే. రెండు రాష్ర్టాల మధ్య ఏమైనా సమస్యలు తలెత్తితే కేంద్రం జోక్యం చేసుకుని పరిష్కరిస్తే మంచిదే. అయితే సెక్షన్-3 టీవోఆర్‌తో రెండు రాష్ర్టాల మధ్య జల వివాదం మరింత జటిలంగా మారింది’ అని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు సరికాదని.. రాష్ట్రం మొత్తమ్మీద ఒకే విధంగా ఉండాలన్నారు. కృష్ణా జలాలపై బచావత్ ట్రైబ్యునల్-1 ఉమ్మడి ఏపీకి 800 టీఎంసీలు కేటాయించిందని.. ఆ నీటిపై దిగువ రాష్ర్టాలకు సంపూర్ణ హక్కు ఉంటుందని.. ఎగువ రాష్ర్టాలైన మహారాష్ట్ర, కర్ణాటకకు ఏ ప్రమేయం ఉండదని తెలిపారు. ‘అంతర్రాష్ట్ర నదీజలాల విషయంలో ఒక ఒప్పందం కుదిరిన తర్వాత.. ఆ నీటిని తమ అవసరాలకు అనుగుణంగా ఎలా ఉపయోగించుకోవాలనే స్వేచ్ఛ రాష్ర్టాలకు ఉంటుంది. ప్రాజెక్టుల వారీగా ఆంక్షలు విధించడం లేదా రాష్ర్టాల అంతర్గత నీటి వినియోగంలో కేంద్రం మితిమీరి జోక్యం చేసుకోవడం సరికాదు.
ఇది ముమ్మాటికీ ఆ రాష్ర్టాల హక్కులను హరించడమేనని సుప్రీంకోర్టు 1996లో జల వివాదాలకు సంబంధించి స్పష్టమైన తీర్పు ఇచ్చింది’ అని గుర్తుచేశారు. కేంద్రం తీరుతో శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల నిర్వహణలోనూ ఇబ్బంది తలెత్తుతోందని తెలిపారు. 2015లోని తాత్కాలిక ఒప్పందం ప్రకారమే నీటి పంపిణీ జరుగుతోందని తెలిపింది. దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ.. 2002లోపు ఇచ్చిన ట్రైబ్యునల్ తీర్పులు, నీటి కేటాయింపులకు చట్టపరమైన రక్షణ ఉందని.. వాటిపై పునఃసమీక్ష సాధ్యం కాదని స్పష్టత ఇచ్చారు. ఇదేసమయంలో విభజన చట్టం-2014లోని సెక్షన్ 89, కొత్త రిఫరెన్స్‌ల ప్రకారం సెక్షన్ 3 మధ్య ఉన్న వైరుధ్యాలను లోతుగా పరిశీలించాల్సి ఉందన్నారు. ఈనెల 25న మధ్యాహ్నం 2 గంటలకు సమగ్రంగా వాదనలు వింటామని స్పష్టం చేస్తూ విచారణను వాయిదా వేశారు.